ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ మురికి వాడల పై చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే షకూర్ బస్తీపై అర్వింద్ కేజ్రీవాల్ అలాంటి వ్యాఖ్యలు చేశారని అతని చర్య తీసుకోవాలని కోరారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కేజ్రీవాల్ షకూర్ బస్తీని సందర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడలను కూల్చి వేసి కబ్జా చేస్తుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కమల దళం దృష్టి మొత్తం భూసేకరణపైనే ఉందని ప్రజలపై లేదని అన్నారు. ‘‘ వారికి మొదట మీ ఓట్లు కావాలి.. ఎన్నికల తరువాత మీ భూమి కావాలి’’ అంటూ కేజ్రీవాల్ మాట్లాడారు. దీనిపై ఆ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సక్సేనా వీడియో విడుదల..
షకుర్ బస్తీపై కేజ్రీవాల్ మాట్లాడిన మాటలను ఖండిస్తూ లెప్టినెంట్ గవర్నర్ సక్సేనా వీడియో విడుదల చేశారు. ‘‘ కేజ్రీవాల్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధం, అర్థరహితం, షకుర్ బస్తీపై తప్పుడు, ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించే ప్రకటనలను ఆయన ప్రజల ముందు పెట్టారు’’ అని ఎల్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు .
కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం ఆపకపోతే అతడిని చర్య తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల రాజకీయాల కోసం ఎల్జీపై ఆరోపణలు చేయడం ఏంటనీ ప్రశ్నించారు.
డీడీఏ సమావేశం..
గత ఏడాది డిసెంబర్ 27 న ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ సమావేశం నిర్వహించారు. అందులో ఎల్జీ మురికివాడల భూవినియోగాన్ని మార్చారని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిపైనే ఎల్జీ ఘాటుగా స్పందించి వీడియో విడుదల చేసినట్లు సమాచారం.
‘‘ డీడీఏ భూ వినియోగాన్ని మార్చలేదు. ఎటువంటి తొలగింపు నోటీసులు ఇవ్వలేదు. కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని వీడియోలో పేర్కొన్నారు. రైల్వేభూమి, భూ వినియోగం, రవాణా నుంచి వాణిజ్యానికి సంబంధించిన అంశాలను మాత్రమే చర్చించామని, మురికివాడలు ఉన్న భూమి గురించి కాదని అన్నారు. భూ వినియోగాన్ని మార్చాడానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎల్ జీ చెప్పారు.
కాగా ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 5 పోలింగ్, అదే నెల 8 న ఫలితాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. గత మూడు ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఆప్ కు ఢిల్లీలో ఎదురుగాలులు వీస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ సహ పార్టీ అగ్రనాయకత్వం మొత్తం జైలుకు వెళ్లి వచ్చింది.
తాజాగా కాగ్ నివేదిక లీక్ అయి జాతీయమీడియాలో రావడం కూడా ఆ పార్టీకి తలపోటు తెప్పించింది. ఆప్ సర్కార్ నిర్ణయాల వల్ల ఖజానాకు 2 వేల కోట్ల నష్టం వాటిలినట్లు ఆ నివేదిక సారాంశం. ఆప్ పార్టీ పుట్టిందే అవినీతికి వ్యతిరేకంగా.. ఇప్పుడు ఆ పార్టీనే పీకల్లోతూ అవనీతిలో కూరుకుపోవడంతో ప్రత్యర్థి పార్టీలు విమర్శలు చేస్తూ ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి.