విమానాల్లో చోరీలు చేసే ఖరీదైన దొంగ దొరికాడు
x

విమానాల్లో చోరీలు చేసే ఖరీదైన దొంగ దొరికాడు

కాయకష్టం చేయాల్సిన పని లేదు.. ఒళ్లు అలవాల్సిన పని లేదు. అలాంటి జబర్దస్త్ దొంగ ఇతడు. పేరు రాజేష్ కపూర్. ఊరు దేశరాజధాని ఢిల్లీ. పోలీసులకు ఎలా దొరికాడంటే..v


శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే ఇదేనేమో.. కాయకష్టం చేయాల్సిన పని లేదు.. ఒళ్లు అలవాల్సిన పని లేదు. అలాంటి జబర్దస్త్ దొంగ ఇతడు. పేరు రాజేష్ కపూర్. ఊరు దేశరాజధాని ఢిల్లీ. హై ప్రొఫైల్ రాజకీయ నాయకులు తెలుసు గాని ఆ స్థాయి దొంగలుంటారని వినడం ఇదే తొలిసారట. విమానాల్లో తిరుగుతాడు. అందినకాడికి దోచుకుంటాడు. మూడో కంటికి తెలియకుండా జల్సా చేస్తాడు. అటువంటి ఈ దొంగ ఇప్పుడు కటకటాల వెనక్కి చేరాడు. ఎక్కిన విమానం ఎక్కకుండా 360 రోజుల్లో 200 విమానాలు ఎక్కి మహిళా ప్రయాణీకుల చేతి సంచుల నుంచి సులువులుగా నగలు, నగదు మాయం చేసే ఈ దొంగను పట్టుకోవడానికి పోలీసులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది.

ఈ రాజేష్ కపూర్ ఇళ్లకు కన్నాలేసి పోలీసులకు చిక్కి చావు దెబ్బలు తినేకన్నా సులువైన మార్గాన్ని కనిపెట్టాడు. ఎయిర్ ఇండియా, విస్తారా వంటి ప్రీమియం డొమెస్టిక్ విమానాలను టార్గెట్ చేశాడు. ఢిల్లీలో ఎక్కుతాడు హైదరాబాద్ లో దిగుతాడు. మళ్లీ హైదరాబాద్ లో ఎక్కుతాడు చండీగఢ్ లో దిగుతాడు. ఎంతరాత్రైనా మళ్లీ తిరిగి ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోని తన గెస్ట్ హౌస్ కు వెళతాడు. విమానాల్లో తోటి ప్రయాణీకుల హ్యాండ్‌బ్యాగ్‌ల నుంచి నగలు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించడం ఇతని హాబీ. తీరా చూస్తే ఇతని వయసు 40 ఏళ్లకు మించదు. చివరకు అతని పాపం పండి ఢిల్లీ పోలీసులకు జైల్లో మగ్గుతున్నాడు.
పోలీసులకు ఎలా దొరికిపోయాడంటే...
రాజేష్ కపూర్ గత ఏడాది కాలంలో కనీసం 200 విమానాల్లో ప్రయాణించాడు. 110 రోజులకు పైగా విమానాల్లో ప్రయాణాలు చేశాడు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో దొరికిపోయాడు. ఏయిర్ పోర్టు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఉషా రంగనాని చెప్పిన కథనం ప్రకారం కపూర్‌ను పహర్‌గంజ్‌లో అరెస్టు చేశారు. ఓ ప్రయాణికురాలి నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను కరోల్ బాగ్ లోని శరద్ జైన్ అనే వ్యాపారికి అమ్ముతుండగా పోలీసులకు చిక్కాడు.
మూడు నెలల్లో వేర్వేరు విమానాల్లో రెండు దొంగతనాల కేసులు నమోదయ్యాయి. ఈ హైప్రొఫైల్ కేసుల్ని ఛేదించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
ఏప్రిల్ 11న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళుతుండగా ఓ ప్రయాణికురాలు 7 లక్షల రూపాయల విలువైన నగలను పోగొట్టుకున్నారు. ఫిబ్రవరి 2న అమృత్‌సర్‌ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా మరో ప్రయాణికురాలు 20 లక్షల రూపాయల విలువైన నగలను పోగొట్టుకున్నారు. దీంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఢిల్లీ, అమృత్‌సర్‌ విమానాశ్రయాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, విమానాల మానిఫెస్టోలను జల్లెడ పట్టారు. ఓ ప్రయాణీకుడు ఈరెండు విమానాశ్రయాల సీసీ ఫుటేజీలోనూ కనబడ్డారు. ఇక అంతే పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. అతని ఫోన్ నెంబరు రాబట్టారు. అయితే అది తప్పని తేలింది. దీంతో అతను ఎక్కడి నుంచి టికెట్ బుక్ చేస్తున్నారో కనిపెట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కపూర్ అసలు ఫోన్ నంబర్‌ను కనిపెట్టారు. నిందితుణ్ణి పట్టుకొస్తే ఆ తర్వాత పోలీసులు వాళ్ల స్టైల్లో విచారణ జరిపారు. ఇక అంతే ఈ ఖరీదైన దొంగ ఈ సులువైన దొంగతనాల చిట్టా విప్పాడు. హైదరాబాద్‌ సహా ఆరేడు దొంగతనాలు చేసినట్టు అంగీకరించారు. ఇలా కొట్టుకొచ్చిన డబ్బును ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ గ్యాంబ్లింగ్‌కు తగలబెట్టాడట. డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడంలో ఈ కపూర్ దిట్ట.
కపూర్ గతంలో చిల్లర మల్లర దొంగతనాలు చేసినట్టు రికార్డులు ఉన్నాయి. 11 దొంగతనం కేసులు, మరికొన్ని పేకాట కేసులు, మోసాలకు సంబంధించి మరికొన్ని కేసులు అతనిపై ఉన్నాయి. విమానాశ్రయాల్లో దొంగతనానికి సంబంధించి ఐదు కేసులు ఉన్నాయి.
మహిళా ప్రయాణీకులే టార్గెట్..
సులువుగా ట్రాప్ లో పడేసి బ్యాగుల్లోని డబ్బు, నగల్ని కొట్టేయంలో చేయి తిరిగిన వాడు. ప్రత్యేకించి అంతర్జాతీయంగా ప్రయాణించే వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంటాడు. "అటువంటి ప్రయాణీకులు తమ హ్యాండ్‌బ్యాగ్‌లలో విలువైన వస్తువులను తీసుకెళ్లే ధోరణి ఉంటుందని గుర్తించాడు. ఓ ప్లాన్ ప్రకారం టికెట్ ఖరీదు కాస్త ఎక్కువైనా ప్రీమియం డొమెస్టిక్ విమానాలలో ప్రయాణిస్తాడు. ముఖ్యంగా ఎయిర్ ఇండియా, విస్తారా వంటి విమానాల్లో ఢిల్లీ, చండీగఢ్, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లేవాడు. తన పని కానిచ్చుకుని వచ్చేవాడు" అని పోలీసు అధికారి చెప్పారు.
విమానాల్లోకి ఎక్కే బోర్డింగ్ ప్రాంతంలో ప్రయాణికుల హడావిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా దాన్నే ఇతడు ఉపయోగించుకునే వాడు. ముసలి వాళ్లకు సాయం చేసే వాడి మాదిరి చొరవ చూపేవాడు. ఆ మహిళల చేతుల్లోని బ్యాగుల్ని ఓవర్‌హెడ్ క్యాబిన్‌లలో సర్దేవాడు. సర్దే సమయంలో ఏమీ విలువైన వస్తువులు లేవు కదా అనే అడిగేవాడు. వాళ్లు చెప్పే సమాధానాల్ని తన దొంగ తెలివి తేటలతో విశ్లేషించి ఓ నిర్ణయానికి వచ్చేవాడు. ప్రయాణికులు సీట్లలో సర్దుకునే సమయంలో అటువి ఇటువి అటు సర్దుతున్నట్టు నటించి అత్యంత చాకచక్యంగా హ్యాండ్‌బ్యాగ్‌ల నుంచి విలువైన వస్తువులను దొంగిలించేవాడు.
ఒకవేళ తాను టార్గెట్ చేసిన వృద్ధురాళ్ల పక్కన సీటు దొరక్కపోతే ఎయిర్ లైన్స్ సిబ్బందినో, తోటి ప్రయాణీకులనో అడిగి సీటు మార్చుకునేవాడు. బోర్డింగ్ సమయంలో ప్రయాణీకుల్లో ఉండే పరధ్యానాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడం ఇతనికి వెన్నతో పెట్టిన విద్య. మూడో కంటికి అనుమానం రాకుండా వ్యవహరించడం ఇతని నైజం.
పోలీసుల కళ్లుగప్పి ప్రయాణించేందుకు వీలుగా - తన చనిపోయిన సోదరుడి పేరుతో టిక్కెట్లను బుక్ చేసేవాడు. ఆ విధంగా తానెవరో తెలుసుకునేందుకు వీలులేకుండా చూసుకునే వాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నింటినీ ఉపయోగించేవాడు.
మూడంతస్తుల గెస్ట్ హౌస్...
ఈ ఖరీదైన దొంగకు ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలోనే అన్ని సౌకర్యాలున్న మూడంతస్తుల గెస్ట్ హౌస్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడికి పోవాలన్నా పిలిస్తే పలికేలా ట్రాన్స్ పోర్ట్ ఏర్పాటు ఉంది. మూడో అంతస్తులో ఈ దొంగ ఉంటాడు. మిగతా రెండు అంతస్తులను అద్దెకు ఇచ్చి వ్యవహారాలు నడుపుతుంటాడు. మిగతా అన్ని చోట్ల కంటే విమానాశ్రయాల్లో దొంగతనాలు చేయడం సులువని ఈ దొంగ సూత్రీకరణ.
Read More
Next Story