బీజేపీ తొలి జాబితాలో ఈ సంచలనం గమనించారా?
ఆమె పేరు పగ్యా ఠకూర్. సాధ్వి. అయితే, నోటిని అదుపులో పెట్టుకోలేదు. అది ప్రధానికే నచ్చలేదు. ఫలితం లిస్టు నుంచి జారిపోయింది...
లోక్ సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందుగానే కమలం పార్టీ తన తొలి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 195 మందికి స్థానం కల్పించారు. అయితే ఆశ్చర్యకరంగా ఇందులో బీజేపీ ఇంటా, బయటా తలనొప్పులుగా మారిన కొంతమంది ఎంపీలను ఈ సారి టికెట్లను కేటాయించలేదు. గత ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఇందులో నలుగురు సిట్టింగ్ లకు ఈసారి టికెట్ నిరాకరించింది.
ముఖ్యంగా భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరీ, పశ్చిమ ఢిల్లీ పర్వేష్ సాహిబ్ వర్మ వంటి వారు గడచిన ఐదేళ్లలో అనేక వివాదస్పద వ్యాఖ్యలతో కమలదళానికి కంట్లో నలుసులా మారారు. వీటిని వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండి కూటమి వాడుకునేలా ఉంది. ఈ అవకాశం వారికి ఇవ్వవద్దని బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఢిల్లీలోని చాందీని చౌక్ ఎంపీ స్థానం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచిన కీలక నేత హర్షవర్దన్ ను పక్కన పెట్టి ప్రవీణ్ ఖండ్వేల్ వాల్ ను ప్రకటించింది. అలాగే వెస్ట్ ఢిల్లీ నుంచి రెండు సార్లు గెలిచిన పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ ను కాదని కమల్ జీత్ సెహ్రావత్ , న్యూఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్న మీనాక్షి లేఖి ను కాదని సుష్మ స్వరాజ్ కుమార్తె బన్సూరీ స్వరాజ్ కు బీజేపీ టికెట్లు ఇచ్చింది. అలాగే సౌత్ ఢిల్లీ నుంచి ఎన్నికైన రమేష్ బిధూరిని పక్కన పెట్టి రామ్ వీర్ సింగ్ బిధూరికి టికెట్ ఇచ్చింది.
ప్రగ్యా ఠాకూర్
వివాదస్పద ప్రగ్యా ఠాకూర్ స్థానంలో ఈ సారి బీజేపీ అలోక్ శర్మ ను ప్రకటించింది. 2008 నాటి మాలేగావ్ పేలుళ్లతో పాటు అనేక వివాదాలు ప్రగ్యాఠాకూర్ చుట్టుముట్టాయి. ప్రస్తుతం ఠాకూర్ బెయిల్ పై బయట ఉన్నారు. నాథూరామ్ గాడ్సెను దేశభక్తుడిగా ప్రగ్యా ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. " ప్రగ్యా వ్యాఖ్యలు చాలా చెడ్డవి. ఇవి సమాజానికి మంచివి కావు. నేను ఆమెను క్షమించలేను " అని మోదీ వ్యాఖ్యానించారు. ముంబై ఏటీఎస్ చీఫ్ హేమంత్ కర్కరే తన శాపం కారణంగానే 26/11 ఉగ్రవాదుల దాడుల్లో మరణించాడని, తనను అరెస్ట్ చేసి చిత్రవధ చేశాడని ప్రగ్యా ఠాకూర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇది ఎన్నికల సంఘం నుంచి షోకాజ్ నోటీస్ జారీ చేయడానికి దారి తీసింది.
పర్వేష్ వర్మ
వెస్ట్ ఢిల్లీ ఎంపీ పర్వేష్ వర్మకు కూడా ఈసారి బీజేపీ టికెట్ నిరాకరించింది. ఈయన ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. గత ఏడాది జరిగిన ఒక సభ లో ఆయన మాట్లాడుతూ.. ఒక వర్గానికి వ్యతిరేకంగా ఆర్థిక బహిష్కరణకు పిలుపునిచ్చాడు. అంతకుముందు 2020లో జరిగిన షాహిన్ బాగ్ నిరసనలను బీజేపీ గనక అధికారంలోకి వస్తే ఒక గంటలో వారిని తొలగిస్తుందని అన్నారు.
రమేష్ బిధూరి
తన వివాదస్పద వ్యాఖ్యలతో తగిన మూల్యం చెల్లించుకున్న ఎంపీ రమేష్ బిధూరి. గత ఏడాది సెప్టెంబర్ లో లోక్ సభ లో చంద్రయాన్ -3 చర్చ జరిగింది. ఈ సందర్భంగా అమ్రోహా ఎంపీ డానిష్ అలీపై ఇస్లామోఫోబిక్ వ్యాఖ్యలు చేశారు. ఇవి కెమెరాకు చిక్కడంతో బీజేపీ ఇబ్బందుల్లో పడింది. తరువాత ఇవి సామాజిక వ్యాఖ్యాల్లో వైరల్ గా మారాయి. ఈ వ్యాఖ్యలకు రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను తరువాత లోక్ సభ రికార్డుల నుంచి తొలగించారు.
జయంత్ సిన్హా
బీజేపీ ఎంపీ హజారీ బాగ్ సిట్టింగ్ ఎంపీ జయంత్ సిన్హా ను తప్పించి ఆయన స్థానంలో మనీష్ జైస్వాల్ ను నియమించింది. ఈ కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా కుమారుడు. ఈసారి ఎన్నికల బరిలో నిలవడానికి ఆయన నిరాకరించారు. 2017 లో జార్ఖండ్ లోని రామ్ గఢ్ లో ఒక మాంసం వ్యాపారిని కొట్టిచంపినట్లు ఎదుర్కొంటున్న వ్యక్తులకు న్యాయపరమైన సహాయం అందించారని తెలిసింది. ఇది 2019 తరువాత బయటపడింది. ఈ నిందితులు విడుదలైన తరువాత హజారీ బాగ్ లోని నివాసానికి తీసుకెళ్లిన తరువాత వారితో సత్కరించడం, వారితో ఫొటోలు దిగడం వివాదస్పదమైంది.
Next Story