లాలూ సన్నిహితుడిని అరెస్ట్ చేసిన ‘ఈడీ’, ఎందుకంటే..
x

లాలూ సన్నిహితుడిని అరెస్ట్ చేసిన ‘ఈడీ’, ఎందుకంటే..

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర దర్యాప్తు సంస్థ బిహార్ లో మాజీ సీఎం లాలూ ప్రసాద్ సన్నిహితుడిని అరెస్ట్ చేసింది. ఇసుక తవ్వకాలలో మనీ లాండరింగ్ కు పాల్పడిన..


బిహార్ అక్రమ ఇసుక తవ్వకాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విచారిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాజాగా బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సన్నిహితుడిని అరెస్ట్ చేసింది. ఆయన పేరు సుభాష్ యాదవ్. పలుమార్లు ఆర్జేడీ టికెట్ పై వివిధ ఎన్నికల్లో పోటీ చేశారు.

ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసిన దర్యాప్తు సంస్థ, విచారణలో భాగంగా శనివారం రాష్ట్ర రాజధానిలో సుభాష్ యాదవ్, అతని సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలకు చెందిన అర డజను ప్రాంగణాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. అనంతరం యాదవ్‌ను శనివారం అర్థరాత్రి అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అలాగే సోదాల్లో దాదాపు రూ. 2.3 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.
దర్యాప్తు సంస్థ యాదవ్ ను ఇసుక మైనింగ్ రాకెట్‌లో "కీలక సిండికేట్ సభ్యుడు" అని ఆరోపిస్తోంది. ఆయనను సోమవారం పాట్నాలోని ప్రత్యేక మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎమ్‌ఎల్‌ఎ) కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఆయన గతంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బిహార్ పోలీసులు బ్రాడ్ సన్స్ కమోడిటీస్ అనే కంపెనీ, దాని డైరెక్టర్లపై ఎలాంటి ఇ చలాన్లు లేకుండా అక్రమ ఇసుక తవ్వకాలు జరిపి అమ్మకాలను పాల్పడుతున్నారని 20 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఇందులో మనీలాండరింగ్ విషయం బయటపడటంతో ఈడీ పరిధిలోకి కేసు వెళ్లింది.
గత ఏడాది ఈ కేసులో బీహార్ ఎమ్మెల్సీ, జేడీ(యూ) నేత రాధా చరణ్ సా, ఆయన కుమారుడు కన్హయ్య ప్రసాద్, బ్రాడ్‌సన్స్ కమోడిటీస్ డైరెక్టర్లు మిథిలేష్ కుమార్ సింగ్, బాబన్ సింగ్, సురేంద్ర కుమార్ జిందాల్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం వీరంతా జైలులో ఉన్నారు. 2023 నవంబర్‌లో పాట్నా ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఏజెన్సీ వారిపై ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో రూ. 161 కోట్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందని కేంద్ర దర్యాప్తుసంస్థ ఆరోపించింది.


Read More
Next Story