పంజాబ్ సరిహద్దును ఖాళీ చేయించండి: కేంద్ర హోంశాఖ
x

పంజాబ్ సరిహద్దును ఖాళీ చేయించండి: కేంద్ర హోంశాఖ

కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య జరిగిన చర్చలు విఫలమైన నేపథ్యంలో పంజాబ్ రైతులు మరోసారి ఢిల్లీ చలో కు బయల్దేరారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ పలు సూచనలు చేసింది.


పంజాబ్- హర్యానా సరిహద్దులో 1200 ట్రాక్టర్లు- ట్రాలీలు, 300 కార్లు, 10 మిని బస్సులతో దాదాపు 14 వేల మంది ప్రజలు గుమిగూడారని, దీనిపై పంజాబ్ ప్రభుత్వానికి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. రైతులు మరోసారి ‘ఢిల్లీ చలో’ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గట్టి బందోబస్తుతో పాటు, హర్యానాలోకి ప్రవేశించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లు, కాంక్రీట్ పిల్లర్లను తొలగించడానికి కొంతమంది దుండగులు సమీకరించుకుంటున్న జేసీబీలు, భారీ యంత్రాలను స్వాధీనం చేసుకోవాలని కోరింది.

మరోవైపు హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ తోను ఇదే అంశంపై లేఖ రాశారు. సరిహద్దులో శాంతిభద్రతలను కాపాడాలని, తమకు సహకరించాలని వారికి రాసిన లేఖలో కోరారు. హర్యానాతో సరిహద్దులో గల శంభులో రైతుల ముసుగులో ఉన్న కొంతమంది దుండగులు పోలీసులపై కి రాళ్ల దాడి చేశారని, భారీ యంత్రాలను కూడా సిద్దం చేసుకున్నారని కేంద్ర హోంశాఖ తెలిపింది.

నేటి నుంచి యాత్ర పున: ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవడానికి పంజాబ్ రైతులు ప్రారంభించిన ‘ఢిల్లీ చలో’యాత్ర కేంద్ర ప్రభుత్వంతో నాలుగో సారి జరిపిన చర్చల అనంతరం నేడు మరోసారి ప్రారంభం కానుంది. ఇప్పటికే పంజాబ్- హర్యానా సరిహద్దులో లోని శంభు, ఖనౌరీలో వేలాది మంది గుమిగూడి ఉన్నారు. అదేవిధంగా పంజాబ్ ధాబీ- గుజ్రాన్ సరిహద్దు వద్ద కూడా 500 ట్రాక్టర్లు, 4500 మంది నిరసనకారులు కూడా సిద్దంగా ఉన్నారని కొన్ని నివేదికలు బయటకు వస్తున్నాయి.

పంజాబ్ నుంచి ఎట్టిపరిస్థితుల్లో హర్యానాలోకి రాకుండా పోలీసులు భారీ స్థాయిలో బారికేడ్లు పెట్టి ఆందోళనకారులను నిలువరించారు. మొదట పోలీసులకు, నిరసనకారులకు భారీ ఎత్తున ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. ఈ ఆందోళనలకు సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకత్వం వహిస్తున్నాయి. నిరసనకారులు జాతీయ రహదారులపై పెద్ద ఎత్తున గుమిగూడకూండా చూడాలని కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీనివల్ల శాంతిభద్రతలలో గణనీయమైన క్షీణత ఉందని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.

నిరసన కారులకు ఎటువంటి వాహనాలు అందించవద్దు

నిరసనతెలుపుతున్న కొంతమందికి రైతులు తమ పరికరాలను అందిస్తున్నారని, ఇలా అందించే యజమానులు, ఆపరేటర్లను గట్టిగా హెచ్చరించాలని హర్యానా పోలీసులు, పంజాబ్ పోలీసులను కోరారు. ఇవన్నీ నేరపూరితమైన చర్యలు కాబట్టి తదుపరి చట్టప్రకారం తీసుకునే చర్యలకు వారు బాధ్యులవుతారని హెచ్చరించారు. హర్యానా డీజీపీ పంజాబ్ డీజీపీ కి రాసిన లేఖలో దీనిని ప్రస్తావించారు. వెంటనే పోలీస్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షించాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More
Next Story