కొత్త స్కామ్ బయటపడుతుందనే ఎలక్టోరల్ బాండ్ బయటపెట్టట్లేదా? కాంగ్రెస్
x

కొత్త స్కామ్ బయటపడుతుందనే ఎలక్టోరల్ బాండ్ బయటపెట్టట్లేదా? కాంగ్రెస్

రాజ్యాంగ విరుద్దమైన ఎలక్టోరల్ బాండ్ విషయాలను బయటపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దర్యాప్తు సంస్థలను ఉపయోగించి పలు కంపెనీలను బెదిరించి బీజేపీ ఎన్నికల..


ఎలక్టోరల్ బాండ్స్ విషయం బయటపెడితే మోదీ ప్రభుత్వం పాల్పడిన కొత్త స్కామ్ తెలుస్తుందని, అందుకే ఆ సమాచారాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్) దీనిపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

"ఆశ్చర్యంగా ప్రధాని మోదీ బుధవారం న్యూఢిల్లీలోనే ఉన్నారు. దేశంలో ఎక్కడా ప్రారంభోత్సవాలకు వెళ్లలేదు. బ్రాండింగ్ చేయలేదు. గత పనులకు సంబంధించిన క్రెడిట్ తీసుకోవడానికి కూడా ఇంట్రస్ట్ చూపించలేదు. ఎందుకో మరి " అని ప్రశ్నించారు.
ప్రధాని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి
మోదీ ప్రభుత్వం ప్రజలకు చెప్పాల్సిన కొన్ని సమాధానాలు ఉన్నాయని ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. "ఫిబ్రవరి 15, 2024న ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగ విరుద్ధమైనవిగా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఎస్ బీ ఐ ద్వారా ఏ పార్టీకి ఎవరు ఎంత చందా ఇచ్చారో వెల్లడి చేయకుండా ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు" అని జైరాం రమేష్ ఆరోపించారు.
అసలు "ప్రధాని ఎందుకు భయపడుతున్నారు. ఎలక్టోరల్ బాండ్ల డేటా ఏ కొత్త కుంభకోణాన్ని వెల్లడించబోతోంది" అని ఆయన ప్రశ్నించారు. దాదాపు 30 కంపెనీల నుంచి బీజేపీకి ఫిబ్రవరి 20,2024 న రూ. 335 కోట్లు వచ్చాయి. అయితే సదరు సంస్థలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులకు పాల్పడిన తరువాతనే ఇంత పెద్ద మొత్తం బీజేపీకి చేరాయని జైరాం రమేష్ ఆరోపించారు. "ఈడీ-సీబీఐ-ఐటీ వంటి దర్యాప్తు సంస్థల బెదిరింపుల ద్వారా పలు కంపెనీల నుంచి విరాళాలు రాబట్టేందుకు బీజేపీ బెదిరింపులకు పాల్పడుతుందా" అని ఆయన ప్రశ్నించారు.
ఇప్పుడు రద్దు చేసిన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన సంస్థల వివరాలను, వాటిని స్వీకరించిన రాజకీయ పార్టీల వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన తరువాత రోజునే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పించింది.
మార్చి 12న బ్యాంకు పని వేళలు ముగిసేలోగా ఎన్నికల కమిషన్‌కు ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీంకోర్టు సోమవారం (మార్చి 11) ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం, ఎన్నికల సంఘం బ్యాంకు పంచుకున్న వివరాలను ప్రజలకు అందుబాటులో తేవాల్సి ఉంటుంది. అది కూడా మార్చి 15 సాయంత్రం 5 గంటలలోపే ఎన్నికల సంఘం దాని అధికారిక వెబ్‌సైట్లో వివరాలను బహిర్గతం చేయాలి.
ఆ షెల్ కంపెనీల నుంచి రూ. 4.9 కోట్లు
రమేష్ తన పోస్ట్‌లో మరో ప్రశ్న సంధించారు. సెబీ గుర్తించిన నాలుగు షెల్ కంపెనీల నుంచి బీజేపీకి రూ. 4.9 కోట్ల విరాళాలు వచ్చాయి. వాటిని పార్టీ ఎందుకు స్వీకరించింది. ఈ కంపెనీల ద్వారా ఎవరి నల్లధనం బీజేపీకి చేరింది? వాళ్లు ఎవరూ అని ఆయన ప్రశ్నించారు.
పౌరసత్వ (సవరణ) చట్టం, 2019ని పార్లమెంటు ఆమోదించిన నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం నిబంధనలను నోటిఫై చేయడంపై కూడా ఆయన మండిపడ్డారు. ఏదైన చట్టం చేసాక ఆరు నెలల్లోపే నియమాలు రూపొందించబడతాయి. అయితే మోడీ సర్కార్‌కు నాలుగు సంవత్సరాల మూడు నెలలు ఎందుకు పట్టింది? లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మాత్రమే నిబంధనలు ఎందుకు వచ్చాయి?" జైరాం రమేష్ అన్నారు.
ఎలక్షన్ కమిషనర్ ఒక్కరే పనిచేస్తున్నారు
ప్రజాస్వామ్య వ్యవస్థలు సజావుగా పనిచేయడమే ప్రభుత్వాల ముఖ్యమైన ప్రాధాన్యత అని ఆయన పేర్కొన్నారు. కానీ లోక్ సభ ఎన్నికల సందర్భంగా భారత దేశంలో కేవలం ఒక్కరే పనిచేస్తున్నారని, ఇలా ఒక్కరే పని చేసే స్థితికి ప్రజాస్వామ్యాన్ని దిగజార్చారని అన్నారు. ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ ఇంత హఠాత్తుగా ఎందుకు రాజీనామా చేశారు? అని ప్రశ్నించారు.
"కాంగ్రెస్ పార్టీకి మోడీ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది, టాక్స్ టెర్రిరిజాన్ని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు. సామాన్య భారతీయులు విరాళంగా ఇచ్చిన నిధులతో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను మోదీ సర్కార్ స్తంభింపజేసారని ఆరోపించారు.
అయితే రాజ్యాంగ విరుద్ధమైన ఎలక్టోరల్ బాండ్ల కుంభకోణం ద్వారా బిజెపికి వచ్చిన కార్పొరేట్ డబ్బులో ₹ 6,000 ను ఆ పార్టీ ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ఈ సమస్యలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని రమేష్‌ కోరారు.

Read More
Next Story