హిమాచల్ ప్రదేశ్: హైకోర్టుకు ఎందుకు వెళ్లలేదు: వారికి సుప్రీం ప్రశ్నలు
అనర్హత అర్హతకు గురైన ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్లకుండా సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించారని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఇది ప్రాథమిక హక్కు కాదంది
హిమాచల్ ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడి అనర్హత వేటుకి గురైన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు నేడు విచారించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ.. ఈ విషయం పై నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని, హిమాచల్ ప్రదేశ్ హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని ప్రశ్నించింది.
స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వారు వేసిన పిటిషన్ జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ముందు నేడు విచారణకు వచ్చింది.
ఆరుగురు పిటిషనర్ల తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదీ హరీష్ సాల్వే పిటిషన్ ను మార్చి 15 లేదా 18కి వాయిదా వేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఖన్నా మాట్లాడుతూ.. "అయితే మీరు హైకోర్టుకు ఎందుకు వెళ్ళలేదు?" అని ఆయనను ప్రశ్నించారు.
పిటిషర్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం ప్రాథమిక హక్కు కాదని న్యాయమూర్తి ఈ సందర్బంగా వ్యాఖ్యానించారు. అయితే ఎమ్మెల్యేలపై కేవలం 18 గంటల్లోనే స్పీకర్ అనర్హత వేటు వేశారని, ఇది అరుదైన ఘటనగా సాల్వే ధర్మాసనం దృష్టికి తీసుకురావడంతో కేసును మార్చి 18కి వాయిదా వేశారు.
ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్ భూటూ, రవి ఠాకూర్ మరియు చెతన్య శర్మలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేశారు. అయితే వీరిపై పార్టీ విప్ ధిక్కరించారనే ఆరోపణలతో అనర్హత వేటుకు గురయ్యారు. వీరి కారణంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అభిషేక్ సింఘ్వీ రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో సభా బలం 68 నుంచి 62కి తగ్గగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 40 నుంచి 34కి తగ్గింది. అనర్హత పిటిషన్‌పై స్పందించడానికి తమకు తగిన అవకాశం లభించలేదని, సహజ న్యాయ సూత్రాన్ని ఉల్లంఘించారని తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు.
విప్ ధిక్కారించారనే
ఫిబ్రవరి 29న విలేకరుల సమావేశంలో ఆరుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్, పార్టీ విప్‌ను ధిక్కరించినందున ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వారిపై అనర్హత వేటు వేసినట్లు ప్రకటించారు. తక్షణమే వారు సభలో సభ్యులుగా ఉండడాన్ని నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
సభకు హాజరై బడ్జెట్‌కు ఓటు వేయాలన్న విప్‌ను ధిక్కరించినందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ ముందు పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎమ్మెల్యేలు హాజరు రిజిస్టర్‌పై సంతకం చేశారని, అయితే బడ్జెట్‌పై ఓటింగ్ సమయంలో సభకు దూరంగా ఉన్నారని స్పీకర్ తెలిపారు.
వాట్సాప్, ఈ-మెయిల్ ద్వారా పంపిన విప్‌ను ధిక్కరించినందుకు ఈ సభ్యులకు నోటీసులు జారీ చేయబడ్డాయి. ప్రజాస్వామ్యం యొక్క గౌరవాన్ని కాపాడటానికి మరియు "ఆయా రామ్, గయా రామ్" సంస్కృతికి చెక్ పెట్టడానికి ఇటువంటి కేసులలో త్వరగా తీర్పు వెలువరించాల్సిన అవసరం ఉందని స్పీకర్ అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్‌తో తీర్పుకు ఎలాంటి సంబంధం లేదని స్పీకర్ తెలిపారు.
Next Story