
నన్ను అరెస్ట్ చేయలేదు, కిడ్నాప్ చేశారు: ధృవ్ రాథీ
తను భారతీయుడే అని పాస్ పోర్టు చూపిన యూట్యూబర్
జంతర్ మంతర్ వద్ద సీజేపీ పిలుపునిచ్చిన నిరసనల్లో పాల్గొనడానికి ముందు తనను సుమారు 20 మంది పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, యూట్యూబర్ ధ్రువ్ రాథీ ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు చేరకుండా అడ్డుకోవడానికి రాజధాని ప్రాంతంలో భారీ స్థాయిలో పోలీసులు మెహరించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో శనివారం గురుగ్రామ్ లోని సెక్టార్ 56 లో ఉన్న తన ఇంటికి పలువురు పోలీసులు చేరుకున్నారని ఆయన చెప్పారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో అక్రమాలు జరిగాయని, దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని సీజేపీ, ఇతర రాజకీయ పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
‘‘నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ అతను జంతర్ మంతర్ వెళ్లడానికి ప్రయత్నిస్తే, అతడిని మళ్లీ అదుపులోకి తీసుకుంటాం.. లేదా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’’ అని ఒక పోలీస్ అధికారి చెప్పినట్లు పీటీఐ వార్తా కథనం ప్రసారం చేసింది.
విడుదల తరువాత రాథీ మాట్లాడుతూ.. తనను నిర్భంధించలేదని, కిడ్నాప్ చేశారని ఆరోపించారు. ‘‘నన్ను అరెస్ట్ చేయలేదు, నిర్భంధించలేదు. నన్ను కిడ్నాప్ చేశారు. మీ మద్దతుకు ధన్యవాదాలు.. ఇది పూర్తి కథ నేను ఇంటికి తిరిగి వచ్చాను’’ అని రాథీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అక్టోబర్ 10న ఉదయం తాను నిద్రిస్తున్న సమయంలో సుమారు 20 మంది తన ఇంట్లోకి ప్రవేశించారని ఆయన చెప్పారు. మప్టీలో ఉన్న పోలీసులు తన పడగ గదిలో నడిచి వచ్చి బయటకు లాగి, ఒక వాహనంలో తీసుకెళ్లారు. ఈ చర్యకు చట్టపరమైన కారణాలను తనకు చెప్పలేదని, న్యాయవాదిని సంప్రదించడానికి కూడా అనుమతించలేదని ఆయన పేర్కొన్నారు.
వీడియోలో తన భారత పాస్ పోర్ట్ ను చూపించారు. తాను భారత పౌరుడు అని స్పష్టం చేశారు. తన పౌరసత్వంపై వస్తున్న వదంతులను ఆయన తోసిపుచ్చారు. తనకు కూడా ఇతర పౌరులకు ఉన్నట్లే హక్కులు ఉన్నాయన్నారు.
ఈ నిర్భంధం వల్ల ఇతర నిరసనకారులపై తీసుకున్న చర్యలు అసమ్మతిని వ్యక్తం చేసే పౌరుల స్వేచ్ఛపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని రాథీ అన్నారు. తనపై ఉన్న వ్యక్తిగత అభిప్రాయాలను పక్కన పెట్టి ఇలాంటి సంఘటనలపై పరిణామాలను పరిగణలోకి తీసుకోవాలని ప్రజలను కోరారు.
Next Story
