విచారణకు వెళ్లను.. ధర్నాకే వెళతా!  ఈడీకి కేజ్రీవాల్‌ సవాల్‌
x
కేజ్రీవాల్

విచారణకు వెళ్లను.. ధర్నాకే వెళతా! ఈడీకి కేజ్రీవాల్‌ సవాల్‌

నాలుగుసార్లు జారీచేసిన నోటీసులను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేఖాతరు చేశారు. విచారణకు వెళ్లలేదు. మరి ఈ రోజు విచారణకు వెళతారా లేదా ? అనే సస్పెన్స్‌ కొనసాగుతోంది..


ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేసేంత వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ నిద్రపోయేలా లేదు. ఇప్పటికి ఐదు సార్లు నోటీసులు ఇచ్చింది. అయినా ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ మాత్రం ససేమిరా అంటున్నారు. ఇవాళ తాజాగా ఏమవుతుందనేది ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది.

లిక్కర్‌ కేసులో ఇవాళ కూడా విచారణకు వెళ్లబోనంటున్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌. తనకు నోటీసులు ఇవ్వడమే అక్రమం అంటున్నారు. ఇవాళ విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు పంపింది. ఈ నోటీసులను కేజ్రీవాల్‌ లాయర్ల బృందం అధ్యయనం చేస్తోందని, అప్పటి వరకు కేజ్రీవాల్ ఈడీ విచారణకు వెళ్లరని ఆప్‌ నేతలు చెబుతున్నారు.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఇవాళ కూడా ఈడీ విచారణకు గైర్హాజరు కానున్నారు. అదే సమయంలో అరవింద్‌ కేజ్రీవాల్‌... బీజేపీ కార్యాలయం ఎదుట ధర్నాకు హాజరవుతున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో జరిగిన మోసానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ ధర్నా చేయనున్నారు. చండీగఢ్‌ ఎన్నికల్లో... ఎన్నికల అధికారి బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేశారని ఆప్-కాంగ్రెస్ కూటమి ఆరోపించింది. దీనికి నిరసనగా బీజేపీ ఆఫీసు ముందు ధర్నాకు పిలుపిచ్చింది.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌- ఈడీ- ఇప్పటికి ఐదు సార్లు అరవింద్ కేజ్రీవాల్‌కి నోటీసులు ఇచ్చింది. అయినా అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించలేదు. విచారణకు వెళ్లలేదు. కేజ్రీవాల్ కి గతేడాది నవంబర్ 2న, డిసెంబర్ 21న, జనవరి 3న, జనవరి 18న, జనవరి 31న ఈడీ నోటీసులు ఇచ్చింది.

తనకు ఈడీ ఇస్తున్న నోటీసులు చట్ట విరుద్ధమని, సార్వత్రిక ఎన్నికల ప్రచారం నుంచి దూరం చేయడం, ఢిల్లీలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బోగస్ కేసుల్లో తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపిస్తున్నారు కేజ్రీవాల్. ఇప్పటికే లిక్కర్ పాలసీ కేసులో ఏడాది కాలంగా ఆప్‌ నాయకుడు మనీష్‌ సిసోడియా, నాలుగు నెలలుగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జైలులో ఉన్నారు.

కేసు ఎలా మొదలైందంటే....

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 2021 నవంబర్‌లో న్యూ ఎక్సైజ్ పాలసీ ప్రవేశ పెట్టింది. దీంతో మద్యం రిటైల్ అమ్మకాల నుంచి ప్రభుత్వం వైదొలిగి లైసెన్స్ ఉన్న ప్రైవేట్ వ్యక్తులు లిక్కర్ స్టోర్లు నడిపే అవకాశం కలిగింది. బ్లాక్ మార్కెట్ నియంత్రించడం, ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకొచ్చామని ఆ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం స్పష్టంచేసింది. న్యూ ఎక్సైజ్ పాలసీ ప్రకారం అర్ధరాత్రి వరకు మద్యం షాపులు తెరచి ఉంచే అవకాశం ఉంది. లిక్కర్ స్టోర్లు డిస్కౌంట్లు ఇవ్వడం వల్ల మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ ఆదాయం 27 శాతం పెరిగింది. లిక్కర్ పాలసీలో నిబంధనలను తుంగలో తొక్కారని 2022 జూలైలో అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ బహిర్గతం చేశారు. లైసెన్స్ పొందిన కొందరికి లైసెన్స్ ఫీజుపై రూ.144 కోట్ల రాయితీ ఇచ్చారని వివరించారు. దాంతో అప్పటి లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు ఆదేశించారు. విపక్షాలు విమర్శించడంతో న్యూ ఎక్సైజ్ పాలసీని కేజ్రీవాల్ సర్కార్ వెనక్కి తీసుకుంది. గవర్నర్ సిఫారసు చేయడంతో 2022 ఆగస్టులో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. తర్వాత ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సిసోడియా సహా 14 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.

Read More
Next Story