ఎన్నికలకు ముందే సీఏఏ అమలు: అమిత్ షా
x
అమిత్ షా, కేంద్ర హోంమంత్రి

ఎన్నికలకు ముందే సీఏఏ అమలు: అమిత్ షా

సీఏఏ ను ఏ వర్గాన్నో లక్ష్యంగా చేసుకుని తీసుకురాలేదని, ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.


దేశంలో సార్వత్రిక ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. " సీఏఏ ఒక జాతీయ చట్టం,ఇది కచ్చితంగా అమలు చేస్తాం, అది కూడా ఎన్నికలకు ముందే " అని ప్రకటించారు. 2019 డిసెంబర్ లో పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. తరువాత దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. తరువాత కోవిడ్ నేపథ్యంలో ఆందోళనలన్నీ సద్దుమణిగాయి.

న్యూఢిల్లిలో జరిగిన ‘ఈటీ నౌ గ్లోబల్’ బిజినెస్ సమ్మిట్ ను ఉద్దేశించి షా మాట్లాడారు. సీఏఏ అమలు గురించి ఎలాంటి సందిగ్ధత అవసరం లేదు. దానిని కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు.

ఈ చట్టం ఏదో నిర్దిష్ట వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించారనే వాదనలను ఆయన కొట్టిపారేశారు. సీఏఏ అనేది పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి రూపొందించబడింది. దానిని రద్దు చేయడం కుదరదు అని పేర్కొన్నారు.

ఎన్నికల్లో మాదే విజయం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. మా పార్టీకి సొంతంగానే 370 సీట్లు వస్తాయని, ఎన్డీఏ కూటమి 400 స్థానాలు గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశంలో వరుసగా మూడో సారి ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని అన్నారు.

లోక్ సభ ఫలితాలపై ఎలాంటి సస్పెన్స్ లేదని, కాంగ్రెస్ తో సహ ఇతర ప్రతిపక్షాలు తాము మరోసారి ప్రతిపక్షంలో కూర్చుంటాయనే నమ్మకంతో ఉన్నాయని, అదే నిజం అవుతుందని అన్నారు. " మేము జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన అధికరణ 370 ని తొలగించాం. కాబట్టి దేశ ప్రజలు మాకు 370 సీట్లు, ఎన్డీఏ కు 400 సీట్లను కట్టబెట్టాలని నిర్ణయించుకున్నారు" అని షా వ్యాఖ్యానించారు.

జయంత్ చౌధరి నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్( ఆర్ఎల్డీ), శిరోమణి అకాళీదళ్ తో పాటు మరికొన్ని చిన్న పార్టీలు ఎన్డీఏలో చేరే అవకాశం ఉందని అమిత్ షా అభిప్రాయపడ్డారు. వచ్చే లోక్ సభ ఎన్నికలు ఎన్డీఏకు ప్రతిపక్ష ఇండి కూటమి మధ్య కాదని, అభివృద్ధికి- నినాదాలు ఇచ్చే వ్యక్తులకు మధ్య జరగుతోందని అమిత్ షా అన్నారు.

Read More
Next Story