‘టీఎంసీ’ బాటలో పంజాబ్ ‘ఆప్’
x
భగవంత్ మాన్, పంజాబ్ సీఎం

‘టీఎంసీ’ బాటలో పంజాబ్ ‘ఆప్’

28 పార్టీలు కలిసి ‘ఇండియా’ కూటమిగా ఏర్పడ్డాయి. అయితే బెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీ, పంజాబ్ లో అధికారంలో ఉన్న ‘ఆప్’ సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించాయి.


ఇండియా కూటమిలో లుకలుకలు ప్రారంభం అయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. అయినప్పటికీ సీట్ల సర్ధుబాటు విషయంలో ఎటూ తేలకపోవడంతో బలమైన ప్రాంతీయ పార్టీలన్నీ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు.

ఈ రోజు ఉదయం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో బరిలోకి దిగుతున్నామని ప్రకటించారు. ఇప్పుడే ఇదే బాటలో పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శాఖ నడుస్తోంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మేము కూడా ఒంటరిగానే పోటీ చేస్తామని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు.

రాష్ట్రంలోని 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నామని, కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తు ఉండదని ప్రకటించారు. ఆమ్ ఆద్మీపార్టీ , టీఎంసీ రెండు పార్టీలు కూడా ఇండియా కూటమిలో కీలక భాగస్వాములు. సార్వత్రిక ఎన్నికల కోసం ఢిల్లీ, పంజాబ్, హర్యానా, గోవా, గుజరాత్ లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ తో ఆమ్ ఆద్మీ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే పంజాబ్ సీఎం ఈ ప్రకటన విడుదల చేయడం ప్రాధాన్య సంతరించుకుంది.

కాంగ్రెస్ తో పొత్తు గురించి ఓ ప్రశ్నకు సమాధాన మిస్తూ "దేశంలో పంజాబ్ మాత్రమే హీరో అవుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 13-0 తో అన్ని స్థానాలను గెలుస్తాం " ఇలా ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం, ఇప్పుడు కూడా చెబుతున్నామని అన్నారు. కాంగ్రెస్ తో ఆప్ కు ఎన్నికల పొత్తు ఉండదని స్పష్టంగా చెప్పారా? అని పంజాబ్ సీఎం ను ప్రశ్నించగా " మేము వారితో వెళ్లడం లేదని సమాధానమిచ్చారు".

పంజాబ్ లోని 13 స్థానాలకు 40 మంది అభ్యర్థులను నిర్ణయించామని, ఒక్కో లోక్ సభ నియోజకవర్గానికి ముగ్గురు, నలుగురు అభ్యర్థులు ఉన్నారని చెప్పారు. క్యాబినెట్ సమావేశానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాగా పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోకూడదని పలువురు ఆప్ ఎంపీలు కోరుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పై గెలిచి అధికారాన్ని చేజిక్కించుకుంది.

Read More
Next Story