జార్ఖండ్ పిచ్ పై ఆదివాసీ ఆటేనా? బీజేపీ ఎత్తుకు జేఎంఎం పైఎత్తు?
చలికాలంలో జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ ను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు జేఎఎం నేతృత్వంలోని కూటమి ప్రణాళికలు రచిస్తోంది.
ఓబీసీ కార్డును ప్రధాని మోదీ ప్రయోగించి ఓట్లను పొందుతున్నాడని, అందుకే తాము కూడా గిరిజన కార్డును ఉపయోగించి జార్ఖండ్ లో బీజేపీని ఎదుర్కోవచ్చని అధికార పార్టీ భావిస్తోంది. సోమవారం నాటి విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు హేమంత్ సోరెన్ కు రాంఛీలోని ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విశ్వాస పరీక్షలో జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వానికి అనుకూలంగా 47 ఓట్లు, ప్రతిపక్ష బీజేపీకీ 29 ఓట్లు వచ్చాయి. దీనితో ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకున్నట్లు అయింది.
ఈ సందర్భంగా చర్చను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంపై సోరెన్ మాట్లాడుతూ "గత నాలుగు సంవత్సరాలు గిరిజనుల అభివృద్ది కోసం హేమంత్ సోరెన్ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. అయినా బీజేపీ చెప్పినట్లు వినలేదనే కారణంతో అక్రమంగా కేసులో ఇరికించారు " అని బీజేపీని నిందించారు. అలాగే బిహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేస్తున్న సందర్భాలను సైతం ఆయన గుర్తు చేసుకున్నారు. " మేము ఆదివాసీల హక్కుల కోసం బిహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం శిబూ సోరెన్ నాయకత్వంలో పోరాడాం. కానీ బీజేపీ ఆనాడు మమ్మల్ని చూసి ఎగతాళి చేసింది, ఇప్పుడు గిరిజన నాయకులను అవమానిస్తూ , వేధిస్తోంది " అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మమ్మల్ని అంటరానివారీగా చూస్తున్నారు: హేమంత్ సోరెన్
గిరిజనులను బీజేపీ అంటరానీవారీగా చూస్తోందని మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఆరోపించారు. తన అరెస్ట్ సందర్భంగా ఓ యాంకర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కాషాయ పార్టీ తమను అంటరానీవారిగా చూస్తారు( యే హమ్ అచూత్ సమ్జాతే హైం) అని విమర్శించారు.
ఇంకా ఆయన మాటల్లోనే " హమ్ జంగిల్ సే బహార్ ఆ గయే ఔర్ ఇంకే బరాబర్ బైత్నే లగే తో ఇంకో లగా ఇంక కప్డే మైలే హో గయే( మేము గిరిజనులం, అడవుల నుంచి బయటకు వచ్చి వారి పక్కన కూర్చోవడం నచ్చట్లేదు. ఎందుకంటే వారి బట్టలు ఎక్కడ మురికిగా మారతాయో అని అనుకుంటున్నారు) అని విమర్శించారు. " నేను మనీలాండరింగ్ కేసులో అక్రమంగా 8.5 ఎకరాలు కొనుగోలు చేసానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, అంతే కాదు జార్ఖండ్ ను వీడి వెళ్లిపోతాను" అని ఆయన సవాల్ చేశారు. ఆదివాసీ, దళిత సోదరుల్లారా మీరు సిద్దంగా ఉండండి. ఇప్పుడు మనం యుద్దం చేయకపోతే మన ముందు తరాలు మనల్ని క్షమించవు అని ప్రసంగించారు.
ఆదివాసీ కార్డ్ బయటకు తీసిన జేఎంఎం
ఇద్దరు సోరెన్ లు చాలా తెలివిగా లోక్ సభ ఎన్నికల ముందు తమ గిరిజన పిచ్ ను సిద్దం చేశారు. ఇక బీజేపీ ఇదే పిచ్ పై మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. కాషాయ పార్టీ ద్వేషం అనే పునాదుల మీద నిర్మించబడిందని వారికి మూల నివాసులు, ఆదివాసీలు, దళితులు, ఓబీసీలోని ఓ వర్గానికి వ్యతిరేకం అంటూ మరో ప్రచారాస్త్రాన్ని బయటకు తీశారు ఇరువురు సోరెన్ లు.
జార్ఖండ్ ఏర్పడిన 23 సంవత్సరాల కాలంలో ఇప్పటికే అక్కడ దాదాపు 12 మంది సీఎంలు వచ్చారు. ఏ ఒక్క గిరిజన ముఖ్యమంత్రి కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేదు. కానీ బీజేపీ చెందిన ఓబీసీ నాయకుడు రఘుబర్ దాస్ మాత్రం ఇంతకుముందు ఐదు సంవత్సరాలు సీఎంగా ఉన్నారు.
ఇదే అంశాన్ని ప్రస్తుతం జేఎంఎం నాయకులు తమకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నారు. హేమంత్ సోరెన్ తమ్ముడు దుమ్కా ఎమ్మెల్యే బసంత్ సోరెన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. " వారు ఓబీసీ కార్డుతో ఓట్లను రాబట్టుకున్నప్పుడు, మేము గిరిజన కార్డును ఉపయోగిస్తే తప్పేముంది" అని ప్రశ్నించారు. " రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది బీజేపీనే కానీ, గిరిజన ముఖ్యమంత్రులకు మాత్రం పూర్తి కాలం పదవిలో ఉండనివ్వదు. వారి లోపాల్ని ఎత్తిచూపడం తప్పెలా అవుతుంది" అని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం జార్ఖండ్ లో భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్న రాహూల్ గాంధీ కూడా తన భాగస్వామ్య పక్షంలోని హేమంత్ సోరెన్ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. "బీజేపీ గిరిజన ముఖ్యమంత్రిని జార్ఖండ్ లో సహించదు" అని ట్వీట్ చేశారు.
లోహర్దగా కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఆర్థిక మంత్రి రామేశ్వర్ ఒరాన్ ఫెడరల్ తో మాట్లాడుతూ " జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రధాని మోదీ, అమిత్ షా చేసిన కుట్రలు ఫలించలేదు. అయితే వారి గిరిజన వ్యతిరేకత మాత్రం బయటపడింది, హేమంత్ సోరెన్ వారి బెదిరింపులకు లొంగకపోయే సరికి ఈడీ, సీబీఐ కేసుల్లో ఇరికించారు. ఇదే పనిని బిహార్ లో తేజశ్వి యాదవ్ మీద కూడా ప్రయోగించవచ్చు " అని విమర్శించారు. వారికి ప్రజాకోర్టులో గుణపాఠం తప్పదు అని హెచ్చరించారు.
బీజేపీకి వ్యతిరేకంగా తమతో కలిసి పనిచేయాలని పలు ప్రముఖ పౌరహక్కుల నాయకులను, స్థానిక ప్రజలను జేఎంఎం, కాంగ్రెస్ నాయకులు సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. ప్రత్యేకించి ఆదివాసీ నాయకులను కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని వివిధ ఆదివాసీ సంఘాలు హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేయడంపై తమ సంఘీభావం ప్రకటించాయి. ఇదే అంశంపై ఓటర్లలో విస్తృత అవగాహన కల్పించాలని రాహూల్ గాంధీతో చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.