జమ్మూకాశ్మీర్: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి?
x

జమ్మూకాశ్మీర్: లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి?

అధికరణ 370 రద్దు తరువాత ఎన్నికల సంఘం కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్ లో లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి సమాయత్తం అవుతోంది.


ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికల తో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆలోచనగా ఉంది. సుప్రీంకోర్టు కూడా ఇంతకుముందే సెప్టెంబర్ 30, 2024 లోపు జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.

వీటిని పరిగణలోని తీసుకున్న ఈసీ తాజాగా వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించింది. తాము గత ఏడాది డిసెంబర్ 11న ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పునకు కట్టుబడి ఉండాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు, అందుకు అవసరమైన తీవ్రమైన కసరత్తు చేస్తున్నట్లు కూడా ఈసీ తన అంతర్గత సంభాషణల్లో వ్యక్తం చేసింది.

ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఈసీ బృందం మూడు రోజుల పాటు కేంద్ర పాలిత ప్రాంతం అయిన జమ్మూకాశ్మీర్ లో పర్యటించింది. వారు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులతో సమావేశమయ్యారు,ఈ సందర్భంగా పలువురు రాజకీయా నాయకులు లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని ఈసీ కి విన్నవించారు. బీజేపీ కూడా రెండు ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం.
జే అండ్ కే పర్యటనలో భాగంగా స్థానిక పార్టీలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీతో పాటు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఆప్ నేతలతో ఈసీ బృందం సమావేశమైంది. జమ్మూకశ్మీర్‌లోని ప్రజల హక్కులను ఏవిధంగా హరిస్తున్నారో ఈసీతో జరిగిన సమావేశం లో వివరించినట్లు రాజకీయ నేతలు మీడియాకు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాల్సిన ఆవశ్యకతను తాము ఎన్నికల సంఘానికి వివరించి ఒప్పించామని నసీర్ అస్లాం వానీ మీడియాకు తెలిపారు.
“జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించి 10 సంవత్సరాలు గడిచిందని మేము కమిషన్‌కు చెప్పాము. కమిషన్ మా మాటలను ఓపికగా ఆలకించింది” అని వానీ మీడియా సమావేశంలో చెప్పారు. రెండు ఎన్నికలు విడివిడిగా నిర్వహించడం జమ్మూకశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని ఆయన అన్నారు.
పోల్ సిద్ధంగా ఉందా?
తరువాత, ECI బృందం సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులతో మాట్లాడింది. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి చేస్తున్న సన్నాహాలను పరిశీలించింది. అలాగే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా లేదా అని కూడా ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులకు తగిన అవగాహన కల్పించడం, ఎన్నికల సామగ్రిని తరలించడానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన, సిబ్బందికి తగిన రక్షణ కల్పించడంపై ఈ సీ ఆరా తీసినట్లు పలు నివేదికలు తెలిపాయి.
తరువాత ఎన్నికల బృందం రాష్ట్రంలోని ఉన్నత పోలీసు అధికారులను కలుసుకుని, భద్రతా చర్యలను సైతం పరిశీలించి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. అలాగే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే పారా మిలిటరీ బలగాలు ఏమైన అదనంగా కేటాయించాల్సి వస్తుందా అని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.
రాష్ట్రపతి పాలన
2014లో జమ్మూకాశ్మీర్ కి అసెంబ్లీకి చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. 2018 తరువాత అక్కడ ప్రభుత్వం మనుగడలో లేదు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ-BJP సంకీర్ణం మార్చి 2015లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, అయితే జూన్ 19, 2018న ప్రభుత్వం పడిపోయింది. మెహబూబా ముఫ్తీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తన వాదనను వినిపించిన కొద్దిసేపటికే, గవర్నర్ సత్యపాల్ మాలిక్ నవంబర్ 28, 2018న J&K శాసనసభను రద్దు చేశారు.
జమ్మూకశ్మీర్‌లో గత ఐదేళ్లుగా రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు ఇంతలో, డీలిమిటేషన్ కసరత్తు జరిగింది. మే 2023లో ఇది పూర్తయింది. నియోజకవర్గాలు పునర్నిర్మించబడ్డాయి ఈ కసరత్తు తరువాత కొత్త అసెంబ్లీలో ఇప్పుడు 114 సీట్లు ఉన్నాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)కి ఇరవై నాలుగు సీట్లు కేటాయించబడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జమ్మూ ప్రాంతంలోని 43, కాశ్మీర్ లోయలోని 47 స్థానాలకు 90 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గడువులోగా ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఇప్పటి నుంచే ఈసీ జే అండ్ కే ఎన్నికలపై కసరత్తు చేయాలి.
Read More
Next Story