బీహర్ అసెంబ్లీకి వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార ఎన్డీఏ కూటమి ఇప్పటికే సీట్ల షేరింగ్ పూర్తయినట్లు ప్రకటించింది. జేడీ(యూ), బీజేపీ చెరో 101 స్థానాలలో పోటీ చేస్తుండగా మిగిలిన సీట్లను ఎల్జేపీ, ఆర్ఎల్ఎం, హెచ్ఏఎం పార్టీలకు కేటాయించారు.
అయితే సీట్ల పంపకాలపై తాజాగా పార్టీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఆర్ఎల్ఎం, హెచ్ఏఎం పార్టీలు తమ నిరసన స్వరం వినిపించగా, తాజాగా జేడీ(యూ) కూడా ఈ జాబితాలో చేరింది.
పార్టీ ఎంపీ అజయ్ కుమార్ మండల్ సీట్ల పంపకాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సీఎం నితీశ్ కుమార్ ను సంప్రదించడంతో కలకలం రేగింది.
పాట్నాలోని సీఎం నివాసం వద్ద జేడీ(యూ) కార్యకర్తలు నిరసన తెలిపారు. తమ పార్టీకి మరి కొన్ని సీట్లు కావాలని వారు డిమాండ్ చేశారు. దీనితో సీఎం నివాస పరిసరాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
243 సీట్లున్న అసెంబ్లీలో సీట్ల పంపకాలు పూర్తయినట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదివారం ప్రకటించారు. లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్ పాసవాన్) 29 సీట్లలో పోటీ చేస్తుందని, హిందూస్థాన్ అవామీ మోర్చా, రాష్ట్రీయ లోక్ మోర్చా చెరో ఆరు సీట్లలో పోటీ చేస్తాయని అన్నారు.
నితీశ్ కు లేఖ రాసిన అజయ్ కుమార్..
ఎంపీ అజయ్ కుమార్ తన రాజీనామా కోరుతూ సీఎం నితీశ్ కుమార్ కు లేఖ రాశాను. అయితే పార్టీ అధిష్టానం దీనిపై ఇంకా వ్యాఖ్యానించలేదు.
‘‘గౌరవనీయులైన సీఎం నితీశ్ కుమార్ గారు.. దయచేసి నేను ఎంపీ పదవికీ రాజీనామా చేయడానికి అనుమతి ఇవ్వండి. స్థానిక ఎంపీ అయినప్పటికీ టికెట్ కేటాయింపులో నా సలహాను ఎవరూ పట్టించుకోలేదు. అందువల్ల నేను ఎంపీ పదవిలో కొనసాగడానికి ఎటువంటి ఉపయోగం లేదు’’ అని లేఖలో పేర్కొన్నారు. తరువాత ఈ విషయాన్ని ఎక్స్ లో ట్వీట్ చేశారు.
భాగల్పూర్ కు ఎంపీ, ఎమ్మెల్యేగా 20-25 సంవత్సరాలుగా కొనసాగానని, తాను జేడీ(యూ) ను సొంత కుటుంబంలా భావించానని, కానీ గత కొన్ని రోజులుగా పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు జేడీ(యూ) భవిష్యత్ కు మంచిది కాదని పేర్కొన్నారు.
‘‘బయటి వ్యక్తులకు ప్రాధాన్యం ఇవ్వడంతో జేడీ(యూ) మూలాలను బలహీనపరిచింది’’ అని అజయ్ ఆరోపించారు. పార్టీ కార్యకర్తలకు తగిన అవకాశం రాలేదని పేర్కొన్నారు.
ఇది ముఖ్యమంత్రి నాయకత్వం తప్పుడు సమాచార వ్యాప్తికి దోహదపడుతుందని అన్నారు. ఇదిలా ఉండగానే తనకు టికెట్ రాదని భావిస్తున్న జేడీ(యూ) ఎమ్మెల్యే గోపాల్ మండల్ మంగళవారం పాట్నాలోని సీఎం ఇంటిముందు ధర్నాకు దిగారు.
గోపాల్ ను ఆపిన భద్రతా సిబ్బంది
భాగల్పూర్ జిల్లాలోని గోపాల్ పూర్ స్థానం నుంచి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయిన గోపాల్.. తన మద్దతుదారులతో సీఎం నివాసం ఉన్న వన్ అన్నే మార్గ్ కు చేరుకున్నారు.
తనకు అపాయింట్ మెంట్ ఉందని చూపిస్తూ లోపలకు ప్రవేశించడానికి ప్రయత్నించారు. అయితే భద్రతా సిబ్బంది లోపలకు అనుమతించకపోవడంతో గోపాల్ గేటు ముందు బైఠాయించారు.
‘‘మా పార్టీ అధినేత అయిన ముఖ్యమంత్రి నుంచి పార్టీ గుర్తు వచ్చే వరకూ నేను వెనక్కి తగ్గను. భద్రతా సిబ్బంది కావాలనుకుంటే నాపై లాఠీచార్జీ చేయవచ్చు’’ అని ఆయన చెప్పారు. బీహర్ అసెంబ్లీకి ఎన్నికల సంఘం నవంబర్ 6, 11 తేదీలలో రెండు విడతలుగా ఎన్నికల జరపబోతోంది. ఫలితాలు నవంబర్ 14 ప్రకటిస్తారు.