కేజ్రీవాల్ ఎన్నికల హిందువుగా వ్యవహరిస్తున్నారు: బీజేపీ
x

కేజ్రీవాల్ ఎన్నికల హిందువుగా వ్యవహరిస్తున్నారు: బీజేపీ

‘పూజారీ గ్రంథి సమ్మాన్ యోజన పథకం’ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదన్న ఆప్


అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఢిల్లీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ఆప్ సర్కార్ ప్రకటించిన ‘‘ పూజారి గ్రాంథి సమ్మాన్ యోజన’’’ పథకంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరగుతోంది.

ఆప్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ప్రకటించిన ‘‘ పూజారి గ్రాంథి సమ్మాన్ యోజన’’ పూర్తిగా రాజకీయ కోణంలోనే ప్రకటించారని బీజేపీ విమర్శలు గుప్పించింది. కేజ్రీవాల్ కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హిందువుగా వ్యవహరిస్తున్నాడని, ఆయన కేవలం ‘‘ఎన్నికల హిందువు’’(చునావీ హిందూ) అనే కొత్త పదాన్ని తెరపైకి తెచ్చింది.
కొత్త పథకంలో హిందు పూజారులు, సిక్కు గ్రంథిలకు ప్రతి నెల గౌరవ వేతనంగా రూ. 18 వేలు అందజేస్తామని కేజ్రీవాల్ ప్రకటించగానే బీజేపీ విమర్శల ప్రారంభించింది. కేవలం హిందూ, సిక్కు ఓట్లను లక్ష్యంగా చేసుకుని ఈ పథకం ప్రకటించారని ఆరోపణలు చేసింది.
ఈ వ్యాఖ్యలపై ఆప్ కూడా ఎదురుదాడికి దిగింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకం ఎందుకులేదని ప్రశ్నించింది. తమకు అన్ని మతాలు సమానమే అని, ఇమామ్ లకు ఇస్తున్నట్లు మిగిలిన మతాధికారులకు ఇస్తామని వెల్లడించింది.
ఢిల్లీ ఆర్థిక పరిస్థితి ఏంటీ?
ప్రస్తుతం ఢిల్లీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. ఇంతకుముందు ఇలాంటి పథకమే ముస్లిం ఇమామ్ లకు ప్రకటించారు. కానీ వారికి గత 17 నెలలుగా జీతాలు అందలేదని వక్ఫ్ బోర్డు తెలిపింది. చాలా పథకాలకు నిధులు సమకూర్చలేక చేతులెత్తేసినట్లు క్షేత్ర స్థాయి పరిస్థితులు చూస్తే తెలుస్తోంది.
ఆప్ పాలనలలో 1993 తరవాత తొలిసారిగా రాష్ట్ర బడ్జెట్ లోటులోకి జారుకునే పరిస్థితి ఉన్నట్లు ప్రస్తుత పరిస్థితులు చూస్తే తెలుస్తోంది. ప్రస్తుతం ఆప్ సర్కార్ పాలన వల్ల 2022-23 లో రూ. 14 వేల కోట్లుగా ఉన్న మిగులు ఒక్క ఏడాదిలోనే రూ. 3 వేల కోట్లకు చేరుకుంది. కేజ్రీవాల్ ఇప్పటికే కొత్తగా రూ. 5 వేల కోట్ల అప్పు కోసం ఎదురు చూస్తున్నాడు. దీనికి తోడుగా నెలకు రూ. 18 వేలు గౌరవ వేతనం అందజేస్తామనే కొత్త పథకం ప్రకటించారు. దీనికోసం అదనపు నిధులు సేకరించాలి.
అయితే హిందూ పూజారులకు గౌరవవేతనం అనే వ్యూహం ఇంతకుముందు బెంగాల్ లో టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ అమలు చేశారని రాజకీయ వ్యాఖ్యాత టీకే రాజ్యలక్ష్మీ గుర్తు చేశారు. ఓటర్లను విభజించే ప్రయత్నంలో భాగంగా ఇమామ్ లతో పాటు పూజారులకు కూడా వేతనం అందజేశారని, ఇప్పుడు కేజ్రీవాల్ కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరించారని పేర్కొన్నారు.
ఈచర్య వల్ల సిక్కు కమ్యూనిటీ కాస్త ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఆమె అంచనా వేశారు. ఢిల్లీ ఎన్నికల్లో సిక్కు కమ్యూనిటీ దాదాపు 10 స్థానాల్లో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్ వేసిన ఎత్తుతో ఇది ఎటువైపు మళ్లుతుందో చూడాలన్నారు.
ఇంతకుముందు ఆప్ సర్కార్ విద్యా, ఆరోగ్య రంగాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. కానీ గత కొంతకాలంగా దాని అధినాయకత్వం అవినీతి కోరల్లో చిక్కుకుని జైలు పాలయింది. అలాగే హెల్త్, పట్టణ అభివృద్ధికి సంబంధించి సరైన మొత్తంలో నిధులు ఖర్చు చేయలేకపోతున్నారు. వరుసగా ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో ఇచ్చిన హమీలు ఎన్నికల తరువాత గెలిస్తే అమలు చేయడంలో సవాళ్లు ఎదురవడం గ్యారెంటీ అని నిఫుణులు చెబుతున్న మాట.


Read More
Next Story