![‘నో వెహికల్ జోన్’ గా కుంభమేళా పరిసరాలు ‘నో వెహికల్ జోన్’ గా కుంభమేళా పరిసరాలు](https://telangana.thefederal.com/h-upload/2025/02/11/511968-kumbh.webp)
‘నో వెహికల్ జోన్’ గా కుంభమేళా పరిసరాలు
మూడు వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో కఠిన ఆంక్షలు
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో పవిత్ర స్నానం ఆచరించేందుకు వెళ్లే దారులన్నీ వాహానాలతో కిక్కిరిసిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కుంభమేళా పరిసరాలలో కొత్త ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రేపు మాఘ పౌర్ణమి సందర్భంగా కోట్ల సంఖ్యలో భక్తులు పుణ్యస్నాలు చేసేందుకు వస్తారని, ముందస్తుగా జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.
పుణ్య స్నానాలు ఆచరించడానికి శనివారం, ఆదివారం కోట్ల సంఖ్యలో భక్తులు సొంత వాహానాల్లో రావడంతో మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ నుంచి ప్రయాగ్ రాజ్ వరకూ ఉన్న 300 కిలోమీటర్ల మార్గంలో ట్రాఫిక్ జామ్ అయిన సంగతి తెలిసిందే.
రద్దీ, ట్రాఫిక్ జామ్ లను తగ్గించడానికి మంగళవారం ఉదయం 4 గంటల నుంచి మొత్తం మహాకుంభమేళా ప్రాంతాన్ని ‘‘ నో వెహికల్ జోన్’’గా ప్రకటించారు. ఈ పరిమితి మంగళారం సాయంత్రం 5 గంటల నుంచి మొత్తం ప్రయాగ్ రాజ్ నగరానికి విస్తరించబడుతుందని అధికారులు తెలిపారు.
పార్కింగ్ జోన్ లు..
ప్రయాగ్ రాజ్ వెలుపల నుంచి భక్తులు తమ వాహనాలను అధికారులు సూచించిన వివిధ ప్రాంతాలలో పార్క్ చేయాల్సి ఉంటుంది. వివిధ మార్గాలకు వివిధ పార్కింగ్ జోన్ లను ఏర్పాటు చేసి, ప్రత్యేక అధికారులను నియమించారు.
బుధవారం కుంభమేళా జరిగే ప్రాంతం నుంచి భక్తులు నిష్క్ర మించే వరకూ కొత్త ట్రాఫిక్ ఏర్పాట్లు అమలులో ఉంటాయి. అలాగే సంగం ప్రాంతం నిర్ణీత కాలం పాటు నివసించే కల్పవాసీల వాహనాలకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు వర్తిస్తాయి. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహయింపు ఉంది.
ఉత్తర ప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ జామ్ నిర్వహణలో జాప్యం తప్పదని, నిర్వహాణ లోపం వల్ల కాదని అన్నారు. భక్తుల సంఖ్య కోట్లలో ఉండటంతో ఇలా జరుగుతుందని ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
జనవరి 13 న ప్రారంభమైన మహా కుంభమేళా లో ఇప్పటి వరకూ 40 కోట్ల మంది ప్రజలు పుణ్య స్నానాలు ఆచరించారు. ప్రతి రోజు కనీసం 50 లక్షలకు తక్కువ కాకుండా ప్రజలు ప్రయాగ్ రాజ్ ను సందర్శిస్తూ పుణ్యస్నానాలు చేస్తున్నారు.
ఏర్పాట్లును పరిశీలించిన సీఎం
సోమవారం అర్థరాత్రి పోలీసులు, ఇతర అధికారులతో కలిసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రయాగ్ రాజ్ లో జరిగిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్, జనసమూహ నిర్వహణ ప్రణాళికను చక్కగా రూపొందించాలని ఆయన అధికారులకు సూచించారు.
దాదాపు 5 లక్షలకు పైగా ఉన్న వాహనాల పార్కింగ్ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని కూడా ఆయన వారికి ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాఫిక్ రద్దీని నివారించాలని రోడ్లపై పొడవైన వాహానాలు క్యూలు ఏర్పడకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
Next Story