శ్రీరామా, ఈ లూఠీ ఆపలేమా!
x
అయోధ్య రామ మందిరం (ఫైల్)

శ్రీరామా, ఈ లూఠీ ఆపలేమా!

భక్త రామదాసులు ఆస్తులు అమ్మి దేవుడికి గుడి కట్టిస్తే ఈ భుక్తి రామదాసులు దేవుణ్ణి అమ్మేసే పనికి నడుంకట్టారు.. దీంతో వీహెచ్‌పీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది..


అప్పుడెప్పుడో భక్త రామదాసులుండే వారని పురాణాలు ఘోషిస్తుంటే ఇప్పుడేమో ఎటుచూసినా భుక్తి రామదాసులే కనిపిస్తున్నారట. భక్త రామదాసులు ఆస్తులు అమ్మి దేవుడికి గుడి కట్టిస్తే ఈ భుక్తి రామదాసులు దేవుణ్ణి అమ్మేసే పనికి నడుంకట్టారు. ఇదేదో కట్టుకథో, రాముడంటే గిట్టని వాళ్లో చెబుతున్న మాట కాదు. అయోధ్యలో రామమందిరానికి నడుంకట్టిన విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) అధికారికంగా చెబుతున్న మాట.

భక్తుల్ని దోచే ముఠాలెన్నో..

అయోధ్యలో రామ మందిరానికి జనవరి 22న మహా సంప్రోక్షణ మహోత్సవం జరుగుతోంది. ముహూర్తం సమీపిస్తున్న తరుణంలో ఆలయం పేరుతో భక్తులను దోచుకునే ముఠాల నేరాలు వెలుగులోకి వచ్చాయి. సైబర్ నేరగాళ్లు ఆలయం పేరుతో విరాళాలు ఇవ్వాలని కోరుతూ సోషల్ మీడియా సందేశాలు పెట్టి మరీ దోచేస్తున్నారు. ఈ సందేశాలకు QR కోడ్ కూడా ఉంటుంది. స్కాన్ చేసి డబ్బు చెల్లిస్తే నేరుగా ఈ మోసగాళ్ల ఖాతాలకు చేరుతుంది.

వీహెచ్‌పీ అధికారిక ప్రకటన ఇలా..


"శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర న్యాస్ నిధులు సేకరించడానికి ఎవరికీ అధికారం లేదు. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికావొద్దు. ఇలాంటి మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాం. హోం మంత్రిత్వ శాఖ, ఉత్తరప్రదేశ్ డీజీపీ, ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు లేఖ రాశా. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి" అన్నారు వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్. ఈ విషయాన్ని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని హోం మంత్రిత్వ శాఖ, పోలీసు ఉన్నతాధికారుల వరకు చేరింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం, ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ట్రస్ట్, నిధులు సేకరించడానికి ఎవరికీ అధికారం ఇవ్వలేదని తేల్చి చెప్పడంతో పాటు అటువంటి ముఠాలపై పోలీసులు కన్నేసి ఉంచాలని వీహెచ్‌పీ కోరడం గమనార్హం.

ఇదో నీచాతినీచమైన ప్రయత్నం...

"ఆలయం పేరు మీద డబ్బు వసూలు చేయడానికి "నీచాతినీచమైన" ప్రయత్నాల గురించి ఇటీవల తమకు సమాచారం అందిందని" వినోద్‌ బన్సాల్‌ చెప్పారు. ఈమేరకు ఓ వీడియోను కూడా విడుదల చేశారు. "ఇది సంతోషకరమైన సందర్భం, మేము ఆహ్వానాలు పంపుతున్నాం. మేము ఎటువంటి విరాళాన్ని అంగీకరించం" అని బన్సాల్‌ స్పష్టం చేస్తుంటే భక్తుల్ని దోచే ముఠాలు మాత్రం రెచ్చిపోయి విరాళాలు దండుకుంటున్నాయి.

ఎలా బయటపడిందంటే...

ఆలయానికి విరాళాలు ఇవ్వాల్సిందిగా సామాజిక మాధ్యమాల్లో సందేశాలు, ఫోన్ కాల్స్ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాల్‌ను స్వీకరించిన వారిలో VHP కార్యకర్తలు కూడా ఉన్నారు. ఎవరి నుంచి ఫోన్‌ నెంబర్‌ వచ్చిందో ఆ నెంబర్‌ ను వినోద్‌ బన్సాల్‌కి పంపారు. దీంతో ఓ వీహెచ్‌పీ కార్యకర్త ఆ నంబర్‌కు ఫోన్ చేయడంతో మోసగాళ్ల వ్యూహాలు బయటపడ్డాయి. ఆ మోసగాడి చెప్పిన విషయాన్ని రికార్డ్‌ చేసి ఆ ఆడియో క్లిప్‌ను VHP షేర్ చేసింది.

భక్తుల నుంచి ఎలా విరాళాలు సేకరిస్తారంటే...

'మోసగాడి నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌ను అందుకున్న VHP కార్యకర్త.. నిజానికి రామ్‌ టెంపుల్‌కి విరాళం ఇవ్వాలనుకున్నారు. 11 వేల రూపాయల విరాళం ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. తనతో పాటు తమ గ్రామంలోని ఇతరులు కూడా విరాళాలు ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని కూడా వివరించారు. దీనికి ఆ మోసగాడు QR కోడ్‌ను పంపుతానని, వాట్సాప్ నంబర్‌ పంపాలని కోరతాడు. క్యూఆర్‌ కోడ్‌ అనడంతో సందేహించిన వీహెచ్‌పీ కార్యకర్త.. మోసగాడి పేరును అడుగుతాడు. ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నానని, క్యూఆర్‌ కోడ్‌లో అన్ని వివరాలు ఉంటాయని నమ్మబలికేందుకు ప్రయత్నం చేస్తాడు. కాల్ చేసిన వ్యక్తిని ఒప్పించేందుకు.. నానా తంటాలు పడతాడు. దాతల పేర్లు, సంప్రదించాల్సిన నెంబరు, చిరునామాలు నమోదు చేస్తున్నామని, నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత విరాళాలు ఇచ్చిన వారందర్నీ రామమందిరానికి ఆహ్వానిస్తామని చెప్పాడు. ఒకానొక సమయంలో, ఆ మోసగాడు "హిందూ, ముస్లిం సమాజాల మధ్య యుద్ధం జరుగుతోంది. ముస్లింలు ఆలయ నిర్మాణాన్ని కొనసాగించనివ్వడం లేదు" అని చెప్పాడు. అందుకే గుడి కట్టేందుకు విరాళాలు సేకరిస్తున్నాం’’ అని చెప్పినట్లు ఈ వీడియోలో ఉంది. కాల్ చేసిన వ్యక్తి తన పేరును అడిగినప్పుడు, ఆ మోసగాడు తాను అయోధ్యలో ఉన్నానని, దేవాలయం కోసం డబ్బు వసూలు చేస్తున్న ముఠాలు అనేకం ఉన్నాయని, ఇవన్నీ అధికారికమైనవేనని చెప్పడానికి కూడా వెనుకాడలేదు. అంటే ఈ ముఠాలు ఎంతగా బరి తెగించి రాముడు పేరిట విరాళాలు సేకరిస్తున్నాయో అర్థం అవుతుంది.

Read More
Next Story