![మాఘ పౌర్ణమి: ఉదయం ఆరు గంటల వరకే 73 లక్షల మంది పుణ్య స్నానాలు మాఘ పౌర్ణమి: ఉదయం ఆరు గంటల వరకే 73 లక్షల మంది పుణ్య స్నానాలు](https://telangana.thefederal.com/h-upload/2025/02/12/512201-magh.webp)
మాఘ పౌర్ణమి: ఉదయం ఆరు గంటల వరకే 73 లక్షల మంది పుణ్య స్నానాలు
పుణ్య స్నానాల ఘాట్ మొత్తం నో వెహికల్ జోన్ గా ప్రకటించిన యోగీ సర్కార్
నేడు మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఉదయం 6 గంటల వరకూ 73 లక్షల మంది ప్రజలు పుణ్య స్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పుణ్య స్నానాలకు సంబంధించిన ఏర్పాట్లను రాజధాని లక్నోలోని ‘వార్’ రూమ్ లో నుంచి యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ మానిటర్ చేశారు. ఉదయం నాలుగు గంటల నుంచే ఆయన అధికారులతో కలిసి ఎప్పటికప్పుడూ వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ సమావేశంలో డీజీపీ ప్రశాంత్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ(హోమ్) సంజయ్ ప్రసాద్, ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు.
నెల రోజుల కింద తీసుకున్న కల్పవాస దీక్షలు మాఘ పూర్ణిమ నాడు జరిగే పుణ్య స్నానంతో ముగిస్తాయి. దాదాపు 10 లక్షల మంది ప్రజలు తమ దీక్షలు ముగిస్తారని అంచనాలు ఉన్నాయి.
లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తుండటంతో పరిపాలన విభాగం కూడా కఠినంగా నిబంధనలు అమలు చేస్తోంది. వాహానదారులు కేవలం పార్కింగ్ ప్రదేశంలోనే వాహానాలు నిలపాలని కోరుతున్నారు.
‘‘ మాఘ పూర్ణిమ నాడు పుణ్య స్నానాల కోసం లక్షలాది మంది భక్తులు పవిత్ర త్రివేణి సంగమానికి తరలివచ్చారు. ఈ రోజు ఉదయం వరకూ 73 లక్షల మంది భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. అందులో పది లక్షల వరకూ కల్పవాస దీక్షధారులు ఉన్నారు. ’’ అని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
కుంభమేళాకు సంబంధించి ఎస్ఎస్ఫీ రాజేష్ ద్వివేదీ మాట్లాడుతూ..‘‘ భక్తులు ప్రశాంతంగా పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలు వస్తే తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వసంత పంచమి నుంచి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. అవన్నీ ఇప్పుడూ మంచి ఫలితాలు ఇస్తున్నాయి’’ అని చెప్పారు.
సెక్యురిటీ ఏర్పాట్లు..
పుణ్య స్నానాల కోసం భారీ సంఖ్యలో భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఎస్ఎస్పీ చెప్పారు. కొన్ని కీలక ప్రాంతాలలో భద్రత అధికారుల సంఖ్య ను పెంచినట్లు వెల్లడించారు. ప్రజలకు కూడా ఎప్పటికప్పుడూ సమాచారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
పుణ్య స్నానాలు ఆచరిస్తున్న భక్తుల అందరికి సీఎం యోగీ శుభాకాంక్షలు చెప్పారు. ‘‘ ప్రయాగ్ రాజ్ లో మాఘ పూర్ణిమ సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరిస్తున్న మత పెద్దలు, సాధువులు, కల్పవాసులు, భక్తులకు శుభాకాంక్షలు. అందరి జీవితాల్లో సంతోషం, మంచి భవిష్యత్, కోరికలు నెరవారాలి. శ్రీహరి దయవల్ల భక్తులు నెరవేరాలని సీఎం ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో ఆకాంక్షించారు ’’.
నో వెహికల్ జోన్..
పుణ్య స్నానాలు చేయడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ ప్రాంతాన్ని మొత్తం నో వెహికల్ జోన్ ప్రకటించారు. మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి రేపు సాయంత్రం వరకూ మొత్తం ఘాట్ ప్రాంతం వాహానాలకు అనుమతి లేదని ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
కేవలం ఎమర్జెన్సీ వాహానాలు మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది. రద్దీని నియంత్రించడానికి అధికారిక పార్కింగ్ ప్రాంతాలలో మాత్రమే వాహానాలు పార్కింగ్ చేయడానికి అనుమతిస్తున్నామని ప్రయాగ్ రాజ్ ఏడీజీ భాను భాస్కర్ చెప్పారు. ఏదైన ఎమర్జెన్సీ పరిస్థితి ఎదురైతే భక్తులను తరలించడానికి ఈ నిబంధనలు విధించామని చెప్పారు.
భక్తుల అనుభవాలు..
‘‘ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి పవిత్ర స్నానం ఆచరించాను. ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. యోగీ ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు’’ అని శ్రీనివాస్ అనే భక్తుడు చెప్పారు.
మరోక భక్తురాలు గాయత్రి మాట్లాడుతూ.. ‘‘ కుంభమేళాకు వచ్చి స్నానం చేయడం నాకు సంతోషంగా ఉంది. ఇంత పెద్ద జన సందోహాన్ని నేను చూడలేదు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మంచి ఏర్పాట్లు చేసింది.
ఈ సందర్భంలో నేను నిజంగా హిందూవుగా, ఇండియన్ గా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ ప్రజలు తమ మత విశ్వాసాలు ఐక్యంగా ఆచరిస్తూ కనిపిస్తున్నారు’’ అని చెప్పారు.
ప్రస్తుతం పుణ్యస్నానాల కోసం వస్తున్న భక్తుల కోసం అదనంగా 12 వందల షటిల్ సర్వీస్ బస్సులను నడుపుతున్నారు. ప్రతి పది నిమిషాలకు ఒక బస్సును భక్తుల కోసం నడుపుతున్నామని ఓ అధికారులు తెలిపారు.
కుంభమేళా మరో 14 రోజుల్లో పూర్తవుతుందని, ఇప్పటి వరకూ దాదాపుగా 45 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని ప్రభుత్వం ప్రకటించింది. కుంభమేళా పూర్తి అయ్యే వరకు దాదాపుగా 55 కోట్ల మంది వస్తారని అంచనావేసింది. ఇది ఫిబ్రవరి 26 న జరిగే మహా శివరాత్రితో పూర్తవుతుంది.
Next Story