
కేవలం తేజస్వీ యాదవ్ ఫొటోతో ఏర్పాటు చేసిన మహాఘట్ బంధన్ బ్యానర్
నాయకుల ఫొటోలు లేకుండా మహాఘట్ బంధన్ బ్యానర్లు
ఇండి కూటమిలో తాజా కొనసాగుతున్న వివాదం..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు మహాఘట్ బంధన్ కూటమిలోని లుకలుకలు, వివాదాలు డైలీ సీరియల్ ను మించి కొనసాగుతున్నాయి. ఇప్పటికే కూటమిలోని పార్టీలు తమకు కేటాయించిన సీట్లకు కాకుండా ఇతర స్థానాలలో సైతం పోటీకి దిగగా, తాజాగా మహాఘట్ బంధన్ నాయకులంతా కలిసి ఏర్పాటు చేయబోయే సంయుక్త విలేకరుల సమావేశంలో ‘ఇండి’ కూటమి ప్రధాన నేతల పేర్లు లేకుండా బ్యానర్ ఏర్పాటు చేశారు.
ఇది ప్రస్తుతం వివాదంగా మారింది. ఈ బ్యానర్ లో కేవలం ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఫొటో మాత్రమే ఉంది. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, గాంధీ కుటంబంలోని ఇతర నాయకుల చిత్రాలు ఏవీ లేవు. సీట్ల పంపకాలపై కూటమిలోని పార్టీల మధ్య ప్రతిష్టంభన నెలకొన్న తరువాత వీరంతా కలిసి రాష్ట్ర రాజధానిలో ఏర్పాటు చేసిన తొలి సంయుక్త విలేకరుల సమావేశం ఇది.
కాంగ్రెస్ ప్రయత్నాలు..
సీట్ల పంపకాలపై బీహార్ లో పెద్ద పార్టీ అయిన ఆర్జేడీతో, కాంగ్రెస్ రోజుల తరబడి చర్చలు జరిపింది. కానీ అవి ఒక కొలిక్కి రాకముందే ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి నామినేషన్లు దాఖలు చేయించాయి.
అయితే ఈ అంతర్గత పోరాటం వల్ల ఎన్డీఏకు మరోసారి లాభం జరిగే అవకాశం ఉండటంతో ఇరు పార్టీలు తమ సొంత లాభాలను పక్కనపెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, ఆర్జేడీని మచ్చిక చేసుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బుధవారం ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ చర్చలు జరపడానికి పాట్నా వచ్చారు.
‘‘లాలు జీతో నేను చర్చలు జరిపాను. బీహార్ ఇండి కూటమి కుప్పకూలిపోతున్నట్లు ఒక అభిప్రాయం ఏర్పడింది. కానీ అది సత్యదూరం. 243 స్థానాలున్న అసెంబ్లీలో కేవలం ఓ ఐదు, పది స్థానాలలో స్నేహపూర్వక పోటీ జరిగితే అది పెద్ద విషయం కాదు. మేము ఒక జట్టుగా ఎన్డీఏతో తలపడబోతున్నాం. రేపు అన్ని సందేహాలను నివృత్తి చేసే విలేకరుల సమావేశం ఉంటుంది’’ అని లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ తో సమావేశం అనంతరం గెహ్లాట్ వ్యాఖ్యానించారు.
కూటమి కుప్పకూలింది: బీజేపీ
బీహర్ లో ఎన్నికల కోసమే మహఘట్ బంధన్ ఏర్పాటు అయిందని బీజేపీ విమర్శించింది.‘‘ఇండి కూటమిలో కొనసాగుతున్న అంతర్గత కలహాలు ఇప్పడు బహిరంగం అయ్యాయి. గతంలో రాహుల్ గాంధీ, తేజశ్వీ యాదవ్ పట్టించుకోలేదు. ఇప్పుడు తేజశ్వీ రాహుల్ గాంధీని పోస్టర్ల నుంచి తొలగించారు’’ అని ఆ పార్టీ రాష్ట్ర మీడియా ఇన్ చార్జ్ డానిష్ ఇక్భాల్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. సంయుక్త విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన పోస్టర్ మహ కూటమి విచ్చిన్నానికి ప్రకటన అని ఎద్దేవా చేశారు.
ఇండి కూటమిలోని ప్రధాన నాయకులేవరూ లేకుండా ప్లెక్సీ పెట్టడంపై వ్యాఖ్యానించడానికి ఆర్జేడీ నాయకులేవరూ అందుబాటులో లేరు. బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, నవంబర్ 11 తేదీలలో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 14న ఫలితాలు ప్రకటన ఉంటుంది. ఇక్కడ అసెంబ్లీలో 243 స్థానాలు ఉన్నాయి. ఏ పార్టీకి సొంతంగా మ్యాజిక్ ఫిగర్ అందుకునే బలం లేకపోవడంతో గత రెండు దశాబ్ధాలలో ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటున్నాయి.
Next Story