హిమాచల్ కాంగ్రెస్ లో కలవరం
x

హిమాచల్ కాంగ్రెస్ లో కలవరం

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మంత్రి విక్రమాదిత్య రెబెల్ ఎమ్మెల్యేలతో భేటీకావడంతో కాంగ్రెస్ పార్టీ..


హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ లో మరోసారి కలవరం మొదలైంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనకుండ, పార్టీ విప్ ధిక్కరించారనే ఆరోపణలపై ఆరుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా అనర్హత వేటు వేసిన ఎమ్మెల్యేలతో మంత్రి విక్రమాదిత్య శుక్రవారం భేటీ అయ్యారు.

ఈ పరిణామంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. హిమాచల్ ప్రదేశ్ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు ఇప్పటికే మాజీ సీఎంలు భూపేష్ భగేల్, దీపిందర్ హూడా, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సిమ్లాలోనే ఉన్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.

ఉత్తర భారతంలోని ఏకైక రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు వీరంతా ఓవర్ టైం పని చేస్తున్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం కుదర్చడానికి ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అన్నట్లుగానే ఒక కమిటీని ఏర్పాటు చేసి పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు.

స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తాం: రెబెల్ ఎమ్మెల్యేలు
స్పీకర్ తమపై వేసిన అనర్హత నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేస్తామని తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రకటించారు. వారు గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. స్పీకర్ హడావుడిగా, ముఖ్యమంత్రి ఒత్తిడితోనే ఈ అనర్హత వేటు వేసినట్లు వారు ఆరోపించారు. కచ్చితంగా దీనిపై న్యాయస్థానం దృష్టికి తీసుకుపోతామని వారు వివరించారు.
హర్యానాలోని పంచకులలో ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు, తాము మరోసారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్దంగా లేమని ప్రకటించారు. తమ ఆత్మగౌరవం దెబ్బతిందని, ఏడాది కాలంగా అనేక అవమానాలు ఎదుర్కొన్నామని చెప్పారు.
ధర్మశాల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ శర్మ మాట్లాడుతూ.. సభలో తమ ఉనికిని నిరూపించుకోవడానికి తగిన ఆధారాలు ఉన్నాయని, ఈ అనర్హత నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తానని వెల్లడించారు. " కాంగ్రెస్ ప్రభుత్వం పతనం ఆసన్నమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిర్భయంగా పోరడతా. నేను బెదిరిస్తే భయపడిపోయే వాడిని కాను" అని చెప్పారు.
మరో ఎమ్మెల్యే రాజిందర్ రాణా మాట్లాడుతూ.. స్పీకర్ నిర్ణయం తప్పని అభిప్రాయపడ్డారు. తమకు విధాన సభ నుంచి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎలా అనర్హత వేటు వేస్తారని ప్రశ్నించారు. రాణా 2017 లో మాజీ సీఎం పీకే ధుమాల్ ను ఓడించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలి వల్లే తాము తిరుగుబాటు చేసామని రాణా చెబుతున్నారు.
" మేము 14 నెలలుగా అవమానాలు ఎదుర్కొంటున్నాం. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్య తీసుకోలేదు. మేము ప్రస్తుతం సీఎంతో టచ్ లో ఉన్నామని అబద్దాలు చెబుతున్నారు. తిరిగి మరోసారి కాంగ్రెస్ లోకి వెళ్లే ప్రసక్తే లేదు అని ఆయన వెల్లడించారు.
సుఖునే సీఎం: డీకే శివకుమార్
హిమాచల్ ప్రదేశ్ సీఎంగా సుఖ్ విందర్ సుఖునే కొనసాగుతారని, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ఇక్కడ ఆపరేషన్ కమలం లాంటిది ఏమి లేదని, ఎమ్మెల్యేలంతా ఐదు సంవత్సరాల పాటు ప్రభుత్వం కొనసాగాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు.
పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఇందులో సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ ఇంకో ముగ్గురు సభ్యులుంటారని చెప్పారు. తప్పులున్నాయని సీఎం అంగీకరించారని, అయితే ఇకముందు వాటికి చోటు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారని వెల్లడించారు. సుఖు, పీసీసీ చీఫ్ ప్రతిభా సింగ్ సంయుక్తంగా మీడియా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
బీజేపీ ప్రయత్నం విఫలమైంది: కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వం స్థిరంగా ఉందని, బీజేపీ ఉపయోగించిన ధనబలం, అధికారం మరోసారి విఫలమయ్యాయని కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జైరాం రమేష్ మాట్లాడుతూ.. " హిమాచల్ ప్రదేశ్ కు సంబంధించి రకరకాల ఊహగానాలు మీడియాలో వస్తున్నాయి. అయితే నేను ఒక్క విషయం చెప్పాలని అనుకుంటున్న, హిమాచల్ రాజకీయంలో ప్రధాని, సోకాల్డ్ చాణక్యలు విఫలం అయ్యారు. కాంగ్రెస్ అధినాయకత్వం వెంటనే అక్కడికి తన పరిశీలకులను పంపి పరిస్థితిని సద్దుమణిగేలా చేసింది" అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Read More
Next Story