
నిక్కికి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న బంధువులు
‘‘నా కూతుళ్లు తొమ్మిదేళ్ల నుంచి నరకం చూస్తున్నారు’’
గ్రేటర్ నోయిడా వరకట్నం కేసులో బాధితురాలి తండ్రి ఆవేదన
ఆడ పిల్లను కంటే జీవితాంతం కట్టుకున్నోడి.. అత్తమామల గొంతెమ్మ కోర్కెలు తీర్చాల్సిందేనా? అడిగినంత ఇవ్వకపోతే టార్చర్ చేయడం, అప్పుడు కూడా కావాల్సినవి రాకపోతే నిలువునా దహనం చేయడం.. ఇది ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలు..
గ్రేటర్ నోయిడాలో సజీవ దహనానికి గురైన బాధితుడి తండ్రి చెబుతున్న మాటలు వింటే కళ్ల వెంట నీళ్లు రావడం తథ్యం. తన ఇద్దరు కుమార్తెలకు ఒకే ఇంటిలో సోదరులకు ఇచ్చి పెళ్లి చేసిన ఆయన ఈ తొమ్మిది సంవత్సరాలలో నిత్యం శారీరక, మానసిక హింసలకు గురైయ్యారని, భర్త, అత్తమామల డిమాండ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదని తండ్రి భిఖారీ సింగ్ వాపోయాడు. తాజాగా నా నుంచి రూ. 36 లక్షలు డిమాండ్ చేయడం ప్రారంభించారని ఆయన చెప్పారు.
‘‘నిందితుడి ఇళ్లను కూల్చివేయాలి. ఎన్ కౌంటర్ జరగాలి. ఇది యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం, ఆ కుటుంబం పై కఠిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాము’’ అని అన్నారు.
మూడో అరెస్ట్
ఈ కేసులో మూడో నిందితుడు, బాధితురాలు నిక్కి, బావ అయిన రోహిత్ భాటిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిర్సాటోల్ చౌరాహ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిక్కిని సజీవ దహనం చేసిన తరువాత ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రోహిత్ భాటీ పరారయ్యాడు. ఈ సజీవ దహనం ఘటనలో నిక్కి భర్త విపిన్ భాటీ, అన్న రోహిత్ భాటీ, తల్లి దయా, తండ్రి ప్రధాన నిందితులుగా పోలీసులు గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
రోహిత్ భాటీపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 103(1) (హత్య),, 115(2)( గాయపరచడం), 61(2) (జీవిత ఖైదు) కింద కేసు నమోదు చేశారు.
పనిచేయరు కానీ అంతులేని కోరికలు..
నిక్కి(26), ఆమె సోదరి కాంచన్ (29) 2016 లో ఒకే కుటుంబంలో వివాహం చేసుకున్నారు. నిక్కి విపిన్ ను, కాంచన్ రోహిత్ ను వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వారు నిత్యం హింసను ఎదుర్కొంటున్నారు. తమకు ఖరీదైన కార్లు, డబ్బు కావాలని నిత్యం వేధించేవారని తెలిసింది.
‘‘వివాహంలో మొదటగా వారు స్కార్పియో కార్ డిమాండ్ చేస్తే ఇచ్చాము. తరువాత బుల్లెట్ వెహికల్ అడిగితే ఇచ్చాము. తరువాత మెర్సిడెజ్ మాకు ఇవ్వమన్నారు. ఇప్పుడు రూ. 36 లక్షలు డిమాండ్ చేశారు’’ అని తండ్రి చెప్పారు.
‘‘వారు ఏ పనిచేయరు. విపిన్ కు పనిలేకపోవడంతో నేను నా కూతురికి బ్యూటీ పార్లర్ తెరవడానికి సాయం చేశాను. ఆ తరువాత అతను పార్లర్ నుంచి డబ్బులు దొంగలించడం ప్రారంభించారు’’ అని సింగ్ జాతీయ మీడియాకు తెలిపారు.
మెర్సిడెస్ కారు కావాలి..
విపిన్ ను శనివారం అరెస్ట్ చేశారు. అతని తల్లిని ఆదివారం అరెస్ట్ చేశారు. వివాదాన్ని పరిష్కరించడానికి అనేకసార్లు పంచాయతీ నిర్వహించామని కానీ అన్ని ప్రయత్నాలు వృథా అయ్యాయని భిఖారీ పేర్కొన్నారు.
‘‘విపిన్ ఈ కారును ఒక సంవత్సరం నుంచి డిమాండ్ చేస్తున్నాడు. మెర్సిడెస్ ఇవ్వండి లేదా రూ. 60 లక్షలు ఇవ్వండి’’ అని డిమాండ్ చేసినట్లు చెప్పారు. భాటిస్ టాప్ మోడల్ స్పార్కియో కారు కావాలని కోరుకుంటున్నట్లు నిక్కి తల్లి చెప్పింది.
‘‘మేము వారికి స్విప్ట్ డిజైర్ మాత్రమే ఇవ్వగలమని చెప్పాము. అయినప్పటికీ మేము పెళ్లిలో స్కార్పియో 30 తులాల బంగారం ఇచ్చాము’’ అన్నారు.
బైక్ ల బహుమతి..
బహుమతులు అక్కడితో ఆగలేదు. ‘‘నా కూతుళ్లకి పిల్లలు పుట్టినప్పుడూ మేము వారికి మోటార్ సైకిల్లు, 11 తులాల బంగారం ఇచ్చాము. అయినప్పటికీ మా కూతుళ్లను హింసించారు. మేము వారిని ఇంటికి తీసుకువచ్చినప్పుడూ వారు ఒక పంచాయతీ నిర్వహించి, వారిని కాపురానికి పంపమని మమ్మల్ని వేడుకున్నారు.
అయినప్పటికీ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి’’ తల్లి చెప్పారు. తమకు మంచి రోజులు వస్తాయని నిక్కి ధైర్యం చెప్పేదని కానీ అవి రాలేదని .. మొత్తం భాటీ కుటుంబంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.
ఆధారాలు..
నిక్కీ అక్క కాంచన్ ఈ దాడిని వీడియో రికార్డ్ చేసి, విపిన్ అతని కుటుంబం కట్నం కోసం తన సోదరిని చంపారని ఆరోపించింది.
ఈ సంఘటనకు సంబంధించిన కలకలం రేపే వీడియోలు, నిక్కి కుమారుడు, సోదరి సాక్ష్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి. విపిన్, మరొక మహిళ నిక్కీపై దారుణంగా దాడి చేసి జుట్టు పట్టుకుని లాగుతున్నట్లు చూపించాయి.
మరో క్లిప్ లో తీవ్రంగా కాలిన నిక్కి మెట్ల మీద నుంచి నడుస్తూ కుప్పకూలిపోతున్నట్లు చూపించారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలిస్తుండగా ఆమె మరణించింది.
‘‘మేరీ ముమ్మా కే ఊపర్ కుచ్ దాలా, ఫిర్ ఉంకో చాంతా మారా, ఫిర్ లైటర్ సే ఆగ్ లగా ది( వారు నా తల్లిపై ఏదో పోసి, చెంప దెబ్బ కొట్టి లైటర్ ఉపయోగించి నిప్పంటించారు) అని నిక్కి ఆరెళ్ల కుమారుడు మీడియాకు చెప్పారు.
సోదరి ఎదుర్కొన్న కష్టాలు..
జాతీయ మీడియాతో కాంచన్ మాట్లాడుతూ.. ‘‘మమ్మల్ని రోజుల తరబడి కొట్టి హింసించారు. రూ. 36 లక్షలు డిమాండ్ చేశారు. వారు ఆమె మెడ, తలపై కొట్టి యాసిడ్ పోసి, ఆమె బిడ్డ ముందే నిప్పంటించారు’’ అని అన్నారు. తను జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడూ తనపై కూడా దాడి జరిగిందని కాంచన్ వివరించింది.
‘‘విపిన్ మరో వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యాడని, అందుకోసం నిక్కిని బయటకు పంపించేందుకు ప్రయత్నించారని, ఒప్పుకోకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పారు.
అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ.. కాలిన గాయాలతో ఉన్న ఒక మహిళను సప్ధర్ జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు ఫోర్టిస్ ఆసుపత్రి నుంచి ఫోన్ వచ్చిందని తెలిపారు. ‘‘పోలీసులు వెంటనే సప్థర్ జంగ్ ఆస్పత్రికి బయల్దేరారు కానీ వారు వెళ్లే లోపు ఆ మహిళ మరణించింది’’ అని ఆయన చెప్పారు.
పారిపోయే ప్రయత్నం.. కాల్పులు..
నిక్కిని సజీవ దహనం చేసిన భర్త విపిన్ భాటీ మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో ఆధారాలు సేకరించేందుకు పోలీసులు అతనిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా, పారిపోవడానికి ప్రయత్నించాడని గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ పీఆర్ఓ తెలిపారు.
‘‘అతడిని వెంబడించి కాలిపై కాల్పులు జరిపి తరువాత పట్టుకున్నారు’’ అని అధికారి తెలిపారు. తరువాత విపిన్ తల్లిని అరెస్ట్ చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. నిక్కిని ఆగష్టు 22న ఈ కేసు నమోదు చేశారు.
Next Story