![ఢిల్లీ కొత్త సీఎం ఎవరూ? ఎవరెవరూ పోటీ పడుతున్నారు? ఢిల్లీ కొత్త సీఎం ఎవరూ? ఎవరెవరూ పోటీ పడుతున్నారు?](https://telangana.thefederal.com/h-upload/2025/02/08/511358-c.webp)
ఢిల్లీ కొత్త సీఎం ఎవరూ? ఎవరెవరూ పోటీ పడుతున్నారు?
ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా లదే తుది నిర్ణయం
ఢిల్లీలో అధికారం కోసం బీజేపీ దాదాపుగా 27 సంవత్సరాలుగా వేచి చూస్తోంది. చివరగా తాజాగా జరుగుతున్న అసెంబ్లీ కౌంటింగ్ లో ఆ పార్టీ స్పష్టమైన మెజారిటీతో దూసుకుపోతోంది.
ఇప్పుడు ఆ పార్టీలో సీఎం అభ్యర్థి ఎవరనే చర్చ మొదలైంది. ఈ పదవికి రమేష్ బిధూరి, పర్వేష్ వర్మ, దుష్యంత్ గౌతమ్ వంటి నేతలు పోటీపడుతున్నారు. వీరే కాకుండా చాలామంది ఢిల్లీ సీఎం సీటు కోసం బలంగా లాబీయింగ్ చేస్తున్నారు.
అయితే ఎంతమంది అభ్యర్థులు పోటీపడుతున్నప్పటికీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా లదే తుది నిర్ణయం. వారు సూచించిన వ్యక్తే ఢిల్లీ సీఎంగా ఎన్నికవుతారు.
ప్రధాన పోటీదారులు ఎవరంటే...
దుష్యంత్ గౌతమ్: జాతీయ ప్రధాన కార్యదర్శి, దళిత నాయకుడు. మాజీ రాజ్యసభ నాయకుడు. ఇప్పటికే ఆయన రెండుసార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ప్రస్తుతం ఆయన కరోల్ బాగ్ స్థానం నుంచి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ ఆప్ తరఫున మూడు సార్లు గెలిచిన విశేష్ రవి బరిలో ఉన్నారు.
రమేష్ బిధూరి: ప్రముఖ గుర్జార్ కమ్యూనిటీ నాయకుడు, మాజీ లోక్ సభ ఎంపీ, బిధూరి చాలా కఠినంగా వ్యవహరిస్తారని పేరుంది. కానీ ఆప్ పై బీజేపీ దూకుడు కొనసాగించాలని నిర్ణయించుకుంటే బిధూరికే సీఎం అయ్యే అవకాశం ఉంది. ఆయన కల్కాజీ స్థానం నుంచి ప్రస్తుత సీఎం ఆతీశీ పై పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పర్వేశ్ వర్మ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. ఆయన జాట్ వర్గానికి చెందిన ముఖ్య నాయకుడు. గత దశాబ్ధకాలంగా ఈ గ్రూపు ప్రధానంగా ఆప్ ను సపోర్ట్ చేస్తోంది. ఈయన ప్రస్తుతం ఆప్ అధినేత కేజ్రీవాల్ పై పోటీకి దిగారు. ఆయనకు గట్టీ పోటీ ఇస్తున్నారు. కేజ్రీవాల్ ను గనక ఓడిస్తే పర్వేశ్ వర్మనే సీఎంగా మారవచ్చు.
విజేందర్ గుప్తా: గుప్తాకు మృదు స్వభావిగా పేరుంది. 2015, 2020 లో ఆప్ వేవ్ ను ఎదుర్కొని గెలిచిన బీజేపీ నేత. ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పని చేశారు. కానీ గౌతమ్, బిధూరి, వర్మ లాంటి నాయకులకు ఉన్న ప్రజా మద్దతు ఆయన లేదు.
హరీష్ ఖురానా: పంజాబీ అయిన ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత మదన్ లాల్ ఖురానా కుమారుడు. కానీ ఈయన పెద్ద నాయకుడిలా పేరు గడించలేదు.
వీరితో పాటు బీజేపీలోని ప్రసిద్ద సిక్కు నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా, ఉత్తరాఖండ్ కు చెందిన రవీందర్ సింగ్ నేగీ, మాజీ ఆప్ మంత్రి, హిందూత్వానికి బలమైన మద్దతుదారుడైన కపిల్ మిశ్రా, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ సతీష్ ఉపాధ్యాయ, మాజీ ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్, మాజీ కౌన్సిలర్ రేఖ గుప్తాలు సైతం ఈ పదవి కోసం పోటీ పడుతున్నారు.
ఢిల్లీ అంటేనే బీజేపీ మాతృసంస్థ అయిన జన్ సంఘ్ కు కంచుకోట. అంతకుముందు తనకు బలాన్ని ఇచ్చిన రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, అవిభక్త మధ్య ప్రదేశ్ లో తిరిగి బీజేపీ అధికారంలోకి రాగలిగింది కానీ గత 27 సంవత్సరాలుగా ఢిల్లీ కిరిటం కోసం ఎదురు చూస్తోంది. ఆప్ దాదాపుగా దశాబ్దం పాటు కాషాయ పార్టీని అధికారానికి దూరంగా నిలిపింది.
Next Story