
ఢిల్లీ కాలుష్యంపై కొత్త ప్రభుత్వం చర్యలు
ప్రతి పౌరుడికి నాలుగు వందల మీటర్ల లోపే మెట్రో సేవలు అందించాలని నిర్ణయం?
న్యూఢిల్లీలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం వాయు కాలుష్యం పై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దమైంది. అందులో భాగంగా చిన్న చిన్న అంశాలలో సైతం జోక్యం చేసుకోవడానికి సిద్దమైంది.
ముఖ్యంగా నిర్మాణ ప్రాంతాలలో దుమ్ము ధూళి చెలరేగకుండా ఆంక్షలు విధించాలని యోచన చేస్తుంది. వాటితో పాటు చెట్లను శుభ్రపరచడం, అంతర్గత రహదారులు, ఇరుకైనదారులను శుభ్రపరచడానకి స్వీపర్లను నియమించబోతోంది.
పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా, ఐఐటీ - ఢిల్లీ, ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, క్లీన్ ఎయిర్ కలెక్టివ్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధుల మధ్య శనివారం ఢిల్లీలో సమావేశం జరిగింది.
ప్రజారవాణాలో ఎలక్ట్రిక్ వాహనాలను సంఖ్య వేగంగా పెంచడం, నగర రోడ్ల నుంచి పాత కాలుష్య కారకాల వాహానాలను తొలగించడం కోసం ప్రతిపాదనలు చేశారు. ప్రతి పౌరుడికి నివాసానికి 400 మీటర్ల లోపు మెట్రో రైలు అందేలా చర్యలు తీసుకోవాలని అంశం కూడా చర్చకు వచ్చింది.
మెట్రో రైలు పౌరులందరికి అందుబాటులోకి రావడం వల్ల ప్రయివేట్ వాహానాలపై ఆధారపడుతుండటం తగ్గుతుందని తద్వారా వాయు కాలుష్యం తగ్గుతుందని అధికారులు తెలిపారు. అలాగే ప్రజా రవాణా వ్యవస్థ, మౌలిక వసతులు బలోపేతం అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
కొత్త వాహానాల రిజిస్ట్రేషన్ సమయంలో ఎలక్ట్రిక్ వాహానాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, నగరంలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న పాతతరం వాహనాలను కచ్చితంగా తొలగించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాలుష్యం నుంచి పిల్లలను రక్షించడానికి పాఠశాల క్యాలెండర్ లో మార్పులు సూచించారు.
నిర్మాణాల వల్లే 30 శాతం ధూళి..
ఢిల్లీలో వాయు కాలుష్య కారకాలలో ప్రధానంగా 30 శాతం వరకూ నిర్మాణ ధూళి కారణమని పలు సర్వేల్లో తేలింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ తన ప్రత్యేక పోర్టల్ ద్వారా దీనిని అరికట్టడానికి చురుకుగా పనిచేస్తోందని మంత్రి అన్నారు.
దుమ్ము ధూళి డేటా ఆధారిత మూల్యాంకనం చేయాలని నిపుణులు చెప్పారు. పట్టణ రద్దీ, కాలుష్యాన్ని నివారించడానికి నగర పార్కింగ్ విధానాన్ని సమగ్రంగా సవరించాలని అంగీకారానికి వచ్చారు. కాలుష్యాన్ని నివారించడానికి ఢిల్లీ సరిహద్దులో ఆటోమెటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.
అలాగే వివిధ ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం, అధునాతన సాంకేతికతతో గాలి నాణ్యత పర్యవేక్షణ అప్ గ్రేడేషన్, వాయు కాలుష్యం సవాళ్లను సమర్థవంతంగా స్పందించే మున్సిపల్ విభాగాల సామర్థ్యాన్ని పెంచడం వంటివి ఉన్నాయి.
‘‘మా పిల్లలకు స్వచ్ఛమైన గాలిని అందించడానికి, కాలుష్యానికి వ్యతిరేకంగా మేము యుద్దం చేస్తున్నాము. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు. ఇది నైతిక బాధ్యత. ఈ రోజు పంచుకున్న అనేక సూచనలు ఇప్పటికే మా కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. అలాగే ఇతర ప్రణాళికను సైతం ఆలోచిస్తున్నాము’’ అని సమావేశం అనంతరం ఒక ప్రకటనలో సిర్సా తెలిపారు.
సైన్స్, సాంకేతికత, పాలసీ, ఆవిష్కరణలు ప్రజల భాగస్వామ్యాన్ని ఉపయోగించి మేము ఈ యుద్ధంలో పోరాడి గెలుస్తాము. ఇక్కడ ప్రతి అడుగు ముఖ్యమైనది’’ అని సిర్సా సమావేశంలో అన్నారు.
‘‘వికసిత్ ఢిల్లీ’’ దార్శనికతలో భాగంగా నిర్థిష్ట కార్యాచరణ ప్రణాళికలను అభివృద్ది చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం శాస్త్రీయ సంస్థలు, పౌర సమాజం, పౌరులతో కలిసి పనిచేస్తుందని మంత్రి అన్నారు.
Next Story