మోదీతో చేతులు కలపనున్న బిహర్ సీఎం నితీష్ కుమార్?
x

మోదీతో చేతులు కలపనున్న బిహర్ సీఎం నితీష్ కుమార్?

సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికి మరో ఎదురుదెబ్బ తగిలింది. బిహర్ సీఎం నితీష్ కుమార్ కూటమి నుంచి వైదొలగనున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి.


ఇప్పటికే కూటమి నుంచి పశ్చిమ బెంగాల్ పార్టీ అయిన టీఎంసీ తప్పుకోగా, తరువాత పంజాబ్ లో సైతం తాము( ఆమ్ ఆద్మీ పార్టీ) ఒంటరిగా పోటీ చేస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు. మొత్తం అన్ని స్థానాల్లో తామే పోటీచేస్తామని టీఎంసీ, ఆప్ ప్రకటన వెలువడిన రెండు రోజుల్లోనే నితీష్ కుమార్ సైతం తిరిగి ఎన్డీయోలోకి చేరుతున్నారని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హిందూస్థాన్ అవామీ మోర్చా లీగ్ అధ్యక్షుడు మాజీ సీఎం జీతన్ రాం మాంఘీ సైతం ఇదే విషయాన్ని మీడియా సమావేశం నిర్వహించి మరీ చెప్పారు.

"త్వరలోనే మహ ఘట్ బంధన్ ప్రభుత్వం కూలిపోనుంది" అని ప్రకటించారు. కుటుంబ రాజకీయాలు దేశానికి మంచిది కాదని బిహార్ సీఎం నితీష్ ఇంతకు ముందు వ్యాఖ్యానించారు. అయితే ఇదీ ఆర్జేడీని ఉద్దేశించినవి కావని తరువాత బిహార్ సీఎం కు అత్యంత సన్నిహితంగా ఉండే మంత్రి త్యాగి వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు, దానికి ఆర్జేడీ సమాధానాలు చూస్తే బిహార్ ప్రభుత్వం కూలిపోతుందని జీతన్ రాం మాంజీ ఓ అంచనాకొచ్చారు.

అయితే బిహార్ సీఎం నితీష్ వ్యాఖ్యలపై ఆర్జేడీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. లాలూ కుమార్తె రోహిణి ఎక్స్ లో పెట్టిన పోస్ట్ వీరిద్దరి మధ్య ఉన్న దూరం నిజమని తెలిపినట్లు అయింది. ‘కొంతమంది తాము సోషలిజం ఛాంపియన్లమని చెప్పుకుంటారు. కానీ వారి విధానాలన్నీ అస్తవ్యస్తంగా ఉంటాయి’ అని ఆమె ట్వీట్ చేశారు. అయితే తరువాత వాటిని తొలగించారు. అయితే వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ వివాదాలు ఇలా ఉండగానే బిహార్ మాజీ ముఖ్యమంత్రి ‘కర్పూరీ ఠాకూర్ కు భారత రత్న’ ప్రధానం చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై నితీష్ సంతోషం వ్యక్తం చేశారు. దీంతో హిందీ బెల్ట్ లో రాజకీయ ఊహగానాలు జోరందుకున్నాయి. నితీష్ రాజకీయంగా మరోసారి జంప్ చేయడానికి సిద్దంగా ఉన్నారని, ప్రస్తుతం అసెంబ్లీని రద్దు చేయడానికి ఉన్నఅవకాశాలను పరిశీలిస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాంగ్రెస్ ఎంపీ రాహూల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 29 న బిహార్ లోకి ప్రవేశించనుంది. ఈ కార్యక్రమానికి నితీష్ హజరుకారని ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇండియా కూటమిలో తనను కన్వీనర్ గా ప్రకటించకపోవడంతో నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందే ప్రధాని అభ్యర్థిని సైతం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే వీటిని పలు పార్టీలు తిరస్కరించడంతో ఆయన మనస్థాపం చెంది, తిరిగి బీజేపీతో చేతులు కలిపారని తెలుస్తోంది. బీజేపీని ప్రభుత్వంలో చేర్చుకుని రెండు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని, అలాగే బిహర్ లోని మెజారీటీ ఎంపీ సీట్లను కూడా కేటాయించాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం.

రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమంతో బీజేపీ గ్రాఫ్ ఉత్తరాదిలో అమాంతంగా పెరిగింది. అయోధ్యకు దగ్గర ఉన్న బిహర్ రాష్ట్రంలో దీని స్థాయి ఇంకాస్త ఎక్కువగా ఉందని గ్రహించిన నితీష్ ఓడిపోయే పార్టీలతో ఉండే బదులు, బీజేపీతో ఉంటేమేలు అని భావిస్తూ తెలివిగా ముందస్తుగా ఈ ఎత్తు వేసినట్లు తెలుస్తోంది.

Read More
Next Story