ఇప్పుడు ‘రెండు భారత్’ లు కనిపిస్తున్నాయి- రాహూల్ గాంధీ
దేశాన్ని ఏకం చేయాల్సిన అవసరం కనిపిస్తోందని, అలా చేసే వారే నిజమైన దేశభక్తులని రాహూల్ గాంధీ అన్నారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆయన వారణాశిలో ప్రసంగించారు.
ప్రస్తుతం ఉన్న మన దేశంలో ‘రెండు భారత’ దేశాలు కనిపిస్తున్నాయని, అందువల్ల దేశాన్ని ఏకం చేయాల్సిన ఆవశ్యకత ఉందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ రాహూల్ గాంధీ అభిప్రాయపడ్డారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఆయన రెండో రోజు ఉత్తర ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు.
పురాతన నగరం.. హిందూవుల ఆధ్యాత్మిక కేంద్రమైన వారణాశి(కాశీ) పట్టణంలో నిర్వహించిన ఒక సభలో ఆయన ప్రసంగించారు. " భారత దేశం ఆది నుంచి ప్రేమతత్త్వాన్ని అందిస్తోంది. ఇప్పుడున్న ద్వేషం మనకు కొత్తగా నేర్పిస్తున్నారు. మన సోదరులతో మనమే గొడవపడటం వల్ల దేశం బలహీనమవుతుంది. దేశాన్ని ఏకం చేయడమే నిజమైన దేశభక్తి" అని పేర్కొన్నారు. నేను వచ్చి గంగనదికి నమస్కరించాను. ఈ యాత్రలో మీరంతా కూడా మీలో ఒక్కడినైనా మీ సోదరుడిని కలుసుకోవడానికే వచ్చారని అనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. .
" ఇప్పుడు దేశంలో రెండు భారత్ లు కనిపిస్తున్నాయి. ఒకదాంట్లో ధనికులు నివసిస్తుంటే, పేదలకు మరొక దేశాన్ని సృష్టించారు. రైతుల, కార్మికుల సమస్యలు మీడియా చూపడం లేదు" అని ఆయన ఆరోపించారు.
దేశంలోని సమస్యలు కొంతమంది నాయకులకు, మీడియా సంస్థలకు పట్టవు కానీ.. "మోదీజీని, 24 గంటలు చూపిస్తుంది. సినీ తారలను చూపిస్తుంది. రైతులు, వారి సమస్యలు, ఇతర కారణాలు కనిపించగానే మీడియా నోరు మెదపదు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సభకు హాజరైన రాహూల్ అనే యువకుడిని పిలిచి మైక్ అందించాడు. అతడు చదువుకున్న చదువు, నిరుద్యోగ సమస్య, చదువుకు అయిన ఖర్చు మొదలైన విషయాలు అడిగారు. " దేశంలో ద్రవ్యోల్భణం, నిరుద్యోగం అనే రెండు సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కానీ వాటిని పట్టించుకుని, పరిష్కరించే తీరిక ఇప్పుడున్న ప్రభుత్వాలకు లేవు" అని రాహూల్ గాంధీ విమర్శించారు.
రాహూల్ గాంధీ ప్రసంగిస్తున్న సమయంలో యూపీ పార్టీ అధ్యక్షుడు అజయ్ రాయ్ తో పాటు అప్నాదళ్ నాయకుడు పల్లవి పటేల్, సిరత్ కు చెందిన సమాజ్ వాద్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఒపెన్ టాప్ జీబులో ఉన్నారు. రాయ్ బరేలీలో జరిగే యాత్రలో సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సైతం పాల్గొంటానని ప్రకటించారు.
రాహూల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర శుక్రవారం బిహార్ నుంచి యూపీలోకి ప్రవేశించింది. రాత్రికి అక్కడే నిద్ర చేసి తెల్లవారుజామున వారణాశి చేరుకున్నారు.
ఈ యాత్ర తరువాత రాజస్తాన్ లోకి ప్రవేశిస్తుంది. తూరు - పడమర యాత్ర ద్వారా మణిపూర్ - ముంబై కలిపే ఉద్దేశంతో ప్రారంభించారు. ఇది 15 రాష్ట్రాల గుండా 6,700 కి మీ సాగుతుంది. మార్గమధ్యలో సామాన్య ప్రజలను కలుసుకుంటూ న్యాయ్ సందేశాన్ని హైలైట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.