మోదీ గొప్ప నేత అంటూనే, కేంద్ర మంత్రిపదవికి రాజీనామా
x

మోదీ గొప్ప నేత అంటూనే, కేంద్ర మంత్రిపదవికి రాజీనామా

కేంద్రమంత్రి పదవికి పశుపతి పరాస్ రాజీనామా చేశారు. తన సీట్ల కేటాయింపులో తమ పార్టీకి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు.


సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి మరో షాక్ తగిలింది. బిహార్ నుంచి పార్టీకి మద్దతునిస్తున్న కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ అయినా రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీకి అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు. తన అన్న కొడుకు ఎల్ జేపీ( రామ్ విలాస్)కి ఐదు సీట్లు ఇచ్చిన ఒక రోజు తరువాత పశుపతి కుమార్ పరాస్ ఈ ప్రకటన చేశారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమికి తాను నిజాయితీ, విధేయతతో సేవ చేశానని, అయితే తనకు అన్యాయం జరిగిందని అన్నారు. మోదీ గొప్ప నేత అని కితాబు ఇస్తునే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ఒక్క సీటు కేటాయించలేదు
బీహార్‌లో బీజేపీ తన మిత్రపక్షాలతో కుదుర్చుకున్న సీట్ల పంపకాల ఒప్పందంలో RLJP కి ఒక్క సీటు దక్కలేదు. 2019లో పరాస్ గెలుపొందిన హాజీపూర్‌తో సహా చిరాగ్ పాశ్వాన్ కు చెందిన ఎల్‌జెపికి బిజెపి ఐదు సీట్లను కేటాయించింది. హాజీపూర్‌తో పాటు చిరాగ్ వర్గానికి జముయి, వైశాలి, సమస్తిపూర్, ఖగారియా స్థానాలు కూడా కేటాయించారు.
కాంగ్రెస్, RJD వంటి ప్రతిపక్ష పార్టీలతో ఒప్పందం కుదుర్చుకోవడానికి పరాస్ ఆసక్తి చూపట్లేదు. అయితే హాజీపూర్ స్థానంలో తన ఆర్‌ఎల్‌జేపీ పోటీ చేస్తుందని ఆయన ధృవీకరించారు. తనతో సహా ఆర్‌ఎల్‌జేపీకి చెందిన ఐదుగురు ఎంపీలు గత ఎన్నికల్లో గెలిచిన స్థానాల్లో పోటీ చేస్తారని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
చిరాగ్ పాశ్వాన్ తండ్రి దివంగత కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని అవిభక్త లోక్ జనశక్తి పార్టీ తరఫున పశుపతి ఎన్నికల్లో గెలుపొందారు. రామ్ విలాస్ పాశ్వాన్ హజీపూర్ నుంచి ఎనిమిదిసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఒక్కసారి కూడా బీజేపీ గెలవలేదు. 2020 అక్టోబర్ లో మరణించాక ఆయన పార్టీ రెండు ముక్కలయింది. అయితే బిహార్ లో పాశ్వాన్ కమ్యూనిటీ దాదాపు 6 శాతం ఉన్నారు. వీరికి నాయకుడిగా ప్రస్తుతం ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. బీజేపీ మాత్రం రామ్ విలాస్ కొడుకు చిరాగ్ నే ఆయన వారసుడిగా గుర్తించి ఆయనతో పొత్తు పెట్టుకుంది.
2020 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిరాగా పాశ్వాన్ సొంతంగా పోటీ చేశారు. దీనితో జేడీయూ ఎన్నడూ లేనంతగా కేవలం 43 సీట్లకే పరిమిత అయింది. ఓట్ల చీలికలో బీజేపీ బాగా లాభపడింది. అయితే ఇప్పుడు రెండు పార్టీలు మళ్లీ ఒకే వేదికపైకి వచ్చాయి.
ఏప్రిల్ 19 నుంచి ఏడు దశల్లో బిహార్ లో పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 40 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 17 స్థానాల్లో బీజేపీ, 16 స్థానాల్లో జేడీయూ, 5 స్థానాల్లో చీలిక ఎల్జేపీ నాయకుడు చిరాగ్ పాశ్వాన్ కు కేటాయించారు. జితన్‌రామ్‌ మాంఝీకి చెందిన హిందుస్థానీ అవామ్‌ మోర్చా, ఉపేంద్ర కుష్వాహా రాష్ట్రీయ లోక్‌మోర్చాకు ఒక్కో సీటు కేటాయించారు.
Read More
Next Story