వాళ్ల విషానికి విరుగుడు కనపెట్టాం, దాని పేరే అభివృద్ధి : ప్రధాని మోదీ
x
భారత ప్రధాని నరేంద్ర మోదీ

వాళ్ల విషానికి విరుగుడు కనపెట్టాం, దాని పేరే అభివృద్ధి : ప్రధాని మోదీ

దేశంలో అభివృద్ధి కార్యక్రమాలతో బుజ్జగింపు విషం బలహీనపడుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఇంతకుముందు నాయకులు శిలాఫలాకాలు వేసి మాయమయ్యేవారని విమర్శించారు.


దేశంలో అభివృద్ది పెరుగుతున్న కొద్ది బుజ్జగింపు రాజకీయాల విషం ప్రభావం క్రమక్రమంగా తగ్గిపోతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని ఆజంగఢ్ లో రూ. 34,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆదివారం ఆయన ప్రారంభించారు.

గతంలో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) అధినేత అఖిలేష్ యాదవ్ కుటుంబ కంచుకోటగా భావించే అజంగఢ్‌లో ఆయన పెద్ద సభను నిర్వహించారు. హాజరైన అశేష జనవాహిని ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమానమైన అభివృద్ధిని సాధించిందని, ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతంగా భావించే యూపీలో ముఖ్యంగా ఆజంగఢ్ పట్టణంలో దీనిని చూడవచ్చని అన్నారు. దేశం మొత్తాన్ని ఆజంగఢ్ తో కనెక్ట్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు. అందువల్ల ఆజంగఢ్ ప్రకాశిస్తోందని వివరించారు.
ఈ ప్రాజెక్టులను ఎన్నికలతో అనుసంధానం చేయకూడదని ప్రధాని సూచించారు. 2047 నాటికి భారత్ ను అభివృద్ది చెందిన దేశంగా మారడానికి అన్ని ప్రయత్నాలను వేగం చేస్తున్నామని వెల్లడించారు.
గత ప్రభుత్వాల్లోని వ్యక్తులు ప్రజలను మోసం చేసేలా ప్రకటనలు చేసేవారు.. ఎన్నికల ముందు శిలాఫలకం వేసి ఆ తర్వాత మాయమయి పోయేవారు. ఆ తరువాత అలాంటి నాయకులు కూడా కనుమరుగయ్యారని ప్రధాని మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. నేడు దేశంలో అభివృద్ది పథకాలు పరుగులు పెడుతున్నాయని వివరించారు.

అజంగఢ్‌లోని మహారాజా సుహెల్ దేవ్ స్టేట్ యూనివర్శిటీతో పాటు అజంగఢ్, శ్రావస్తి, చిత్రకూట్, అలీఘర్‌లలో విమానాశ్రయాలను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఏటా 13 మిలియన్లకు పైగా ప్రయాణికులకు వసతి కల్పించే లక్ష్యంతో కొత్త టెర్మినల్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు.
దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.1,383 కోట్లు. కొత్త టెర్మినల్‌లో 75 చెక్-ఇన్ కౌంటర్లు, 18 చెక్-ఇన్ కియోస్క్‌లు, 30 లిఫ్టులు మరియు ఐదు ఎస్కలేటర్లు ఉండనున్నాయి. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ముందు ప్రధాని వీటిని ప్రారంభించారు.


Read More
Next Story