ఉప ఎన్నికల తరువాత రాజకీయ సంక్షోభం తప్పదా?
x

ఉప ఎన్నికల తరువాత రాజకీయ సంక్షోభం తప్పదా?

ఎన్నికల తరువాత హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వంలో భారీ కుదుపు ఉంటుందని తిరుగుబాటు ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. సీఎం సుఖుపై చాలా మందికి అసంతృప్తి ఉందని..


హిమాచల్ ప్రదేశ్ లో లోక్ సభ ఎన్నికలతో పాటు కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేసిన కారణంగా ఆరు స్థానాలకు ఉప ఎన్నికలు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ స్థానాలపై కాంగ్రెస్ పట్టు కొల్పోతే ముఖ్యమంత్రి సుఖ్ విందర్ సింగ్ సుఖు నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్ర రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

భారతీయ జనతాపార్టీ 2024 లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా హిమాచల్ లో ఉన్న నాలుగు ఎంపీ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ ఉన్న అన్ని స్థానాల్లో కమలమే జయకేతనం ఎగరవేసింది. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దాంతో హస్తం పార్టీ కంగుతింది.
70 మంది ఉన్న సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్ కు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ప్రభుత్వం మైనారిటీలో పడింది. అసెంబ్లీలో ప్రభుత్వం నిలబడాలంటే కనీసం 35 మంది సభ్యులుండాలి. కానీ కాంగ్రెస్ కు 34 మంది సభ్యుల మద్ధతు మాత్రమే ఉంది. నవంబర్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 40 స్థానాలను గెలుచుకుంది. అయితే ముఖ్యమంత్రి సుఖు విధానాలతో విసిగిన ఆరుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీలో చేరారు.
‘‘ ముఖ్యమంత్రి సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హమీలను నెరవేర్చడం లేదనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నాం. ప్రజలను మోసం చేయడంతో పార్టీని వదిలివేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మైనారిటీలో ఉంది. ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను మేము గెలుచుకున్నట్లయితే అసెంబ్లీలో కాంగ్రెస్,బీజేపీకి చెరో 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు అవుతుంది’’ అని ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న తిరుగుబాటు ఎమ్మెల్యే కాంగ్రెస్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు రవి ఠాకూర్ ది ఫెడరల్ తో అన్నారు.
ఎమ్మెల్యేల తిరుగుబాటు
హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న ఎన్నికలు ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి సుఖుకు ఒక అగ్నిపరీక్షగా భావించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యేల తిరుగుబాటు ను ఆయన ఎదుర్కొన్నారు. ముఖ్యమంత్రికి ఇతర సీనియర్ నాయకులకు పార్టీలో పొసగడం లేదని, ఎమ్మెల్యేల మాటను ఖాతరు చేయడం లేదని పదేపదే అధిష్టానికి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే సమయంలో ఏఐసీసీ రాజ్యసభ ఎన్నికల కోసం అభిషేక్ మనుసింఘ్విని పోటీకి దింపింది. కానీ ఆరుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఆయన ఓటమి పాలయ్యారు.
మాతో చర్చించలేదు
రాజ్యసభ అభ్యర్థి విషయంలో పార్టీ అధినాయకత్వం, రాష్ట్ర నాయకత్వం తమతో సంప్రదించలేదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు చెబుతున్న మాట. ‘‘ మేము ఎమ్మెల్యేలం, ఇష్టం వచ్చినట్లు మేపుకునే గొర్రెలం కాదు. ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాలు నెరవేర్చనందున మాకు చాలా ఫిర్యాదులు ఉన్నాయి’’ అని ఠాకూర్ అన్నారు. సుఖుపై మరిన్ని తిరుగుబాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి ఆయనకు మరిన్ని సమస్యలు పెరిగే అవకాశం ఉందని ఆయనంటున్నారు.
‘‘ హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఎన్నికల హమీలు నెరవేర్చకపోవడంతో ఎమ్మెల్యేల సమస్యలు, నియోజకవర్గంలో వారు పడుతున్న సమస్యల గురించి పార్టీ పట్టించుకోవట్లేదు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది’’ అని మరో తిరుగుబాటు ఎమ్మెల్యే ఇందర్ దత్ లఖన్ పాల్ ది ఫెడరల్ తో అన్నారు.
ఇంకొంతమంది తిరుగుబాటు చేస్తారు..
లోక్ సభ ఎన్నికల ఫలితాల, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వానికి సమస్యలు పెరగడం ఖాయం. లోక్ సభ ఎన్నికలు ముగిసి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత సుఖు ప్రభుత్వం పై మరికొంత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి తమ వైపుకు వస్తారని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.
‘‘ మేము ముఖ్యమంత్రికి, రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మాకు కనీసం 15 మంది ఎమ్మెల్యెల మద్ధతు లభించింది. ఆరుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం.రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మరో ముగ్గురు ఉన్నారు. అయితే వారి రాజీనామాలను స్పీకర్ ఇంకా ఆమోదించలేదు. హిమాచల్ ప్రభుత్వం మైనారిటిలో పడింది’’ అని ఠాకూర్ అన్నారు.
కాంగ్రెస్ ఇప్పటికే తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై విష ప్రచారం ప్రారంభించారని ఠాకూర్ అన్నారు. మేము బీజేపీలో చేరి ప్రజలకు సేవ చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిష్టం మేరకు మమ్మల్ని ఎన్నుకున్నారని, మళ్లీ గెలుస్తామనే నమ్మకం మాకు ఉందన్నారు. ప్రజలు బాధ్యతలు అప్పగించారు కాబట్టి వారికిచ్చిన హమీలను నెరవేర్చాలని అన్నారు.
Read More
Next Story