
వారణాసిలోని మణికర్ణికా ఘాట్
మణికర్ణికా ఘాట్ పై తప్పుడు ఫొటోలతో ప్రచారం
ఎనిమిది కేసులు నమోదు చేసిన పోలీసులు, ఏఐతో ఫోటోలు మార్చినట్లు గుర్తింపు
ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం అయిన వారణాసిలోని మణికర్ణికా ఘాట్ లో జరుగుతన్న అభివృద్ధి పనులపై తప్పుడు ఫోటోలతో ప్రచారం చేస్తున్న వారిపై యూపీ పోలీసులు కేసులు నమోదు చేశారు.
వారణాసిలోని ‘చౌక్ పోలీస్ స్టేషన్’ లో ఎనిమిది వేర్వేరు కేసులు నమోదు అయ్యాయి. ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఏఐతో ఫొటోలు తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది.
ఇలాంటి వ్యక్తులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు. దీనితో పోలీసులు బీఎన్ఎస్ లోని ఎనిమిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌరవ్ బన్సాల్ మీడియాకు తెలిపారు.
అపూర్వమైన అభివృద్ధి: సీఎం
వారణాసిలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు చరిత్రలో ఇంతకుముందు జరగలేదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఇది కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు కోపం తెప్పించిందని, తప్పుడు చిత్రాలతో ప్రజలను దారితప్పించాలని చూస్తున్నారని మండిపడ్డారు.
‘‘కాశీ నేడు అపూర్వమైన అభివృద్ధి కనిపిస్తోంది. రూ. 55 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్ లు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పూర్తి అయ్యాయి. అభివృద్ధిలో కొత్త అధ్యాయం లిఖించబడింది’’ అన్నారు.
శ్రీ కాశీ విశ్వనాథ్ కారిడార్ నిర్మాణంతో పునర్జీవనం ప్రారంభమైందని ఆయన అన్నారు. అప్పుడు కూడా కొంతమంది విరిగిన విగ్రహాలను ప్రదర్శించడం ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
స్పందించిన అఖిలేష్ యాదవ్..
సీఎం వ్యాఖ్యలపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ‘‘మీరు వారణాసి ఘాట్ లకు వెళ్లి వారి కళ్లల్లోకి చూస్తూ ఇది చెప్పగలరా?, ఇది ప్రశ్న కాదు. ఒక సవాల్’’ అని ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
తమిళనాడు నివాసి ఫిర్యాదు..
మణికర్ణిక ఘాట్ లో జరుగుతున్న సుందరీకరణ పనులపై వాస్తవాలను విరుద్దంగా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని తమిళనాడు వాసి ఒకరు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసి ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకతను నింపే లక్ష్యం ఇందులో ఉందన్నారు.
తమిళనాడుకు చెందిన మనో అనే వ్యక్తి చౌక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. నవంబర్ 15, 2025న తన కంపెనీ దహన సంస్కారాలకు చెందిన పనులను చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
అయితే వాస్తవాలను విరుద్దంగా అశుతోష్ పోట్నీస్ అనే పేరుతో ఉన్న ‘ఎక్స్’ హ్యండిల్ జనవరి 16 రాత్రి నుంచి ఏఐ ద్వారా క్రియేట్ చేసిన చిత్రాలతో తప్పు దారి పట్టించే చిత్రాలను పోస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
ఇవి హిందువుల విశ్వాసాలకు విరుద్దంగా ఉన్నాయన్నారు. తరువాత వీటిని అనేకమంది రీపోస్ట్ చేసినట్లు చెప్పారు. ఇవన్నీ కూడా సమాజంలో అశాంతి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నంగా బన్సాల్ చెప్పారు.
వీరందరిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ విషయంపై దర్యాప్తు జరుగుతోందని, సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Next Story

