‘‘పుతిన్ పర్యటన వలన అమెరికాతో సంబంధాలు దెబ్బతినవు’’
x
భారత విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్

‘‘పుతిన్ పర్యటన వలన అమెరికాతో సంబంధాలు దెబ్బతినవు’’

విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్


రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటించడం వలన అమెరికా సంబంధాలలో ఒడిదుడుకులు ఉండవని విదేశాంగమంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతీయ దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై తాజాగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉక్రెయిన్ తో యుద్ధం చేయడానికి రష్యా కు అందే నిధులు చమురు అమ్మకం ద్వారా అందుతున్నాయని ట్రంప్ గత కొద్ది కాలంగా ఆరోపిస్తున్నారు. పుతిన్ భారత్ లో పర్యటించడం మూలంగా మాస్కో- ఢిల్లీ మధ్య ఆర్థిక సంబంధాలు తిరిగి ఊపందుకోవడానికి వీలు కల్పించిందని విదేశాంగమంత్రి అన్నారు.

‘‘భారత్- రష్యా ఆర్థిక సంబంధాలు వేగంతో ముందుకు సాగలేదు. పుతిన్ తాజా పర్యటన ఆ సంబంధాన్ని తిరిగి ఊపందుకోవడానికి, ఇంతకుముందు లేని కోణాలను నిర్మించడం గురించి సాగింది’’ అని జైశంకర్ వ్యాఖ్యానించినట్లు జాతీయ మీడియా పేర్కొంది.

రష్యా విశ్వసనీయ మిత్రదేశం..
హిందూస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో జైశంకర్ మాట్లాడుతూ.. భారత్ కు విశ్వసనీయమైన మిత్రుడు రష్యా అని, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో భారత్ బలమైన సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
‘‘మనలాంటి పెద్ద దేశానికి, కీలక సంబంధాలు అన్ని మంచి స్థితిలో ఉండటం చాలా కీలకం. వీలైనంత ఎక్కువ మంది ఆటగాళ్లతో మనం మంచి సంబంధాన్ని కొనసాగించడం ముఖ్యం. మనకు ఆ ఛాయిస్ ఉంది. అందరికి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఇది విదేశాంగ విధానం’’ అని జైశంకర్ అన్నారు.
హసీనా నిర్ణయమే.. మా నిర్ణయం..
విద్యార్థుల పేరుతో జరిగిన తిరుగుబాటుతో అధికారం కోల్పోయిన హసీనా, భారత్ లో ప్రవాస జీవితం గడుపుతున్న అంశంపై కూడా జైశంకర్ స్పందించారు. బంగ్లాదేశ్ షేక్ హసీనాను అప్పగించడంపై అభ్యర్థన వచ్చిందని అయితే అవామీ లీగ్ అధినేత స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సిన విషయమన్నారు. ‘‘ఆమె వేరే పరిస్థితుల్లో దేశంలోకి వచ్చింది. ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆమె తుది నిర్ణయం తీసుకోవాలి’’ అన్నారు.
విద్యార్థుల ఆందోళన సందర్భంగా జరిగిన కాల్పులపై మానవత్వానికి వ్యతిరేకంగా హసీనా వ్యవహరించారని హసీనాకు ప్రత్యేక ట్రిబ్యూనల్ మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో మంచి సైనిక నాయకులు ఉన్నారు. అలాగే మంచివారు కానీ వారు సైతం ఉన్నారని పరోక్షంగా పాక్ సైనిక చీఫ్ అసిమ్ మునీర్ ను ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
సరిహద్దు స్థిరంగా ఉంది..
భారత్- చైనా సరిహద్దు ప్రశాంతంగా ఉందని జైశంకర్ అన్నారు. 2024 అక్టోబర్ లో ప్రధానమంత్రి మోదీ, షీ జిన్ పింగ్ తో కలిసిన తరువాత చాలా వరకు సరిహద్దు ప్రశాంతంగా ఉందని జైశంకర్ చెప్పారు.
‘‘2024 అక్టోబర్ లో ప్రధాని మోదీ, అధ్యక్షుడు షీ జిన్ పింగ్ మధ్య కజాన్ లో సమావేశం జరిగింది. అప్పటి నుంచి సరిహద్దు ప్రశాంతంగా ఉంది. పెట్రోలింగ్ తిరిగి ప్రారంభం అయింది. అంతా సాధారణంగా ఉంది. సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత మంచి సంబంధాలు కలిగి ఉండటానికి కీలకమైన అంశం’’ అని జైశంకర్ అన్నారు.
ట్రంప్ తో ఎలా ఉన్నాయంటే..
అమెరికాతో భారత్ సంబంధాలు వ్యూహాత్మక సహాకారం నుంచి లావాదేవీల ప్రాతిపదికన మారుతుందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ట్రంప్ వాణిజ్యాన్ని మాత్రమే తన విధానంగా అమలు చేస్తున్నారని విదేశాంగమంత్రి చెప్పారు.
గత ప్రభుత్వాల కంటే ఇప్పడు వాషింగ్టన్ విధానపరమైన ఆలోచనలు కేవలం ఆర్థిక అంశాలే ప్రామాణికంగా ఉన్నాయని చెప్పారు. భారత్ వీటిని అందుకోవడానికి సిద్దంగా ఉందంటూనే.. మన దేశానికి సహేతుకమైన నిబంధనలు కూడా ఉండాలని కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు.
దౌత్యం సారాంశం ప్రతి భాగస్వామిని సంతృప్తి పరచడం కాదని, జాతీయ ప్రయోజనాలను కాపాడటం అని జైశంకర్ గట్టిగా అభిప్రాయపడ్డారు. అంతిమంగా భారత్ విదేశాంగ విధానం దేశ పౌరులకు లబ్ధి చేకూర్చేదిగా ఉండాలని చెప్పారు.
Read More
Next Story