ఢిల్లీ సరిహద్దులో భద్రత కట్టుదిట్టం.. రైతులు అడుగుపెట్టకుండా చర్యలు
పంట ఉత్పత్తుల కోసం పాదయాత్ర చేస్తున్న రైతులు
పంట ఉత్పత్తులకు కనీస మద్ధతు ధర ప్రకటించాలని పంజాబ్ కు చెందిన రైతులు దేశ రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో రాజధాని సరిహద్దులో గల సింఘాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వందకు పైగా రైతు సంఘాలు ఈ రైతు ఉద్యమాన్ని చేపట్టాయి.
వేల మందితో బయలుదేరిన రైతు యాత్ర ప్రస్తుతం హర్యానా సరిహద్దులో గల శంభు సరిహద్దు వద్ద నిలిచిపోయింది. రైతులు తమ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా హర్యానా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారి వెంబడి పెద్ద పెద్ద బారికేడ్లు పెట్టి రైతులను నిలువరించారు.
అయితే ఈ రోజు మధ్యాహ్నం శంభు సరిహద్దు నుంచి పాదయాత్రను పున: ప్రారంభిస్తామని రైతులు ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీ చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు.
"ఢిల్లీ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. సింఘూ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశాం. సింఘు సరిహద్దులో బలగాల మోహరింపు చేయబడింది, అయితే శంబు సరిహద్దు వద్ద పరిస్థితిని బట్టి ఇది పెరగవచ్చు" అని సీనియర్ పోలీసు అధికారి జాతీయ మీడియాకి తెలిపారు. సరిహద్దు వద్ద భద్రతా ఏర్పాట్ల వల్ల ఢిల్లీ మధ్య భాగంలో కూడా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
గట్టి నిఘా..
నోయిడా సరిహద్దులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో రైతు బృందం నిరసన తెలుపుతున్నందున అక్కడ కూడా గట్టి నిఘా ఉంచామని అధికారి తెలిపారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నిరసన తెలిపిన రైతులు ఫిబ్రవరి 13 - ఫిబ్రవరి 21 తేదీలలో ఢిల్లీ వైపు కవాతు చేయడానికి ప్రయత్నించారు. అయితే భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి.
MSPతో పాటు, రైతులు వ్యవసాయ రుణమాఫీ, రైతు కూలీలకు పెన్షన్, విద్యుత్ ఛార్జీల పెంపుదల, పోలీసు కేసుల ఉపసంహరణ (రైతులపై), 2021 లఖింపూర్ ఖేరీ హింసాకాండ బాధితులకు "న్యాయం" డిమాండ్ చేస్తున్నారు. 2013 భూసేకరణ చట్టం పునరుద్ధరణ, 2020-21లో గతంలో జరిగిన ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story