షాహీ ఈద్గా- శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం: సర్వే పై స్టే పొడిగింపు
x

షాహీ ఈద్గా- శ్రీ కృష్ణ జన్మభూమి వివాదం: సర్వే పై స్టే పొడిగింపు

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి - షాహీ ఈద్గా మసీదు కేసులన్నీ ఏప్రిల్ మధ్య భాగం నుంచి విచారణ ప్రారంభిస్తామని ఉన్నత న్యాయస్థానం ప్రకటించింది.


మథురలోని శీ కృష్ణ జన్మభూమి - షాహీ ఈద్గా మసీద్ వివాదం కోర్టు పర్యవేక్షణలో సర్వే చేయాలని ఆదేశించిన అలహబాద్ హైకోర్టు ఆదేశాలపై మధ్యంతర స్టే కొనసాగించాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. షాహీ ఈద్గా మసీదు కమిటీ ఆఫ్ మేనేజ్ మెంట్ దాఖలు చేసిన పిటిషన్ కు ఏప్రిల్ ప్రథమార్థంలో సమయం కేటాయించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

"మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయి. ఏప్రిల్ 2024 మొదటి అర్ధభాగంలో మళ్లీ జాబితా చేయండి " అని బెంచ్ వ్యాఖ్యానించింది. అప్పటిలోగా మిగిలిన అన్ని అభ్యర్థనలను కోర్టు ముందు పెట్టాలని పిటిషన్ దారులను ఆదేశించింది. అన్ని పెండింగ్ పిటిషన్లను ఏప్రిల్ లో కలిసి విచారణకు తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

షాహీ ఈద్గా మసీదు సముదాయాన్ని కోర్టు పర్యవేక్షణలో సర్వే చేయడానికి అనుమతించిన అలహబాద్ హైకోర్టు డిసెంబర్ 14, 2023న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై జనవరి 16న సుప్రీంకోర్టు స్టే విధించింది. మసీదు ప్రాంగణాన్ని పర్యవేక్షించడానికి కోర్టు కమిషనర్ ను నియమించడానికి అంగీకరించిన హైకోర్టు ఆదేశాన్ని కూడా సుప్రీంకోర్టు నిలిపివేసింది. అయితే సివిల్ ప్రోసీజర్ కోడ్ లోని ఆర్డర్ 7,రూల్ 11 ప్రకారం దావా నిర్వహణలో సహ వివాదంలో హైకోర్టులో విచారణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్ లో పూజ స్థలాల చట్టం 1991 ప్రకారం, ఆగష్టు 15, 1947 తరువాత ఉన్న ప్రార్థన స్థలాలను స్వభావాన్ని మార్చడానికి వీలులేదని పేర్కొంది. ఈ చట్టం కేవలం అయోధ్య కు మాత్రమే వర్తించదు అని పిటిషన్ లోవారు వాదనలు వినిపించారు. దీనిపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హిందూ పక్షం వారు మాత్రం ఇదీ శ్రీ కృష్ణ జన్మస్థానమని వాదిస్తున్నారు.

మథురలోని షాహీ ఈద్గా మసీదును వేరే చోటికి మార్చడం కోసం సివిల్ జడ్జీ సీనియర్ డివిజన్(III) కోర్టులో దావా వేయబడింది. ఇది శ్రీకృష్ణ జన్మభూమికి సంబంధించిన 13.37 ఎకరాల స్థలంలో నిర్మించబడిందని హిందూ పక్షం వాదిస్తోంది. బాబ్రీ మసీదు- రామజన్మభూమి టైటిల్ వివాదంలో జరిగినట్లే అసలు విచారణను నిర్వహించాలని హిందూపక్షం హైకోర్టు ముందు వాదనలు వినిపించింది.

Read More
Next Story