పంజాబ్ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నవజ్యోత్ సింగ్ సిద్దూను ప్రకటిస్తే ఆయన తిరిగి క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారని ఆయన భార్య పార్టీ నాయకురాలు నవజ్యోత్ కౌర్ సిద్ధూ అన్నారు.
ఏ పార్టీకి ఇవ్వడానికి తమ వద్ద డబ్బు లేదని, కానీ పంజాబ్ ను బంగారు రాష్ట్రంగా మార్చగల సత్తా సిద్దుకు ఉందని పేర్కొన్నారు. ‘‘మేము ఎల్లప్పుడూ పంజాబ్, పంజాబీయత్ కోసం మాట్లాడాము. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి మా దగ్గర రూ. 500 కోట్లు లేవు’’ అని గవర్నర్ గులాబ్ చంద్ కటారియాను కలిసిన తరువాత ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆరోపణలతో సహ పలు అంశాలపై ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. మీ దగ్గర ఎవరైన డబ్బు డిమాండ్ చేశారా? అని ప్రశ్నించగా, ఎవరూ చేయలేదని, కేవలం రూ. 500 కోట్ల సూట్ కేస్ ఇచ్చిన వ్యక్తి ముక్యమంత్రి అవుతారని ఆమె చెప్పారు.
‘‘ఏ పార్టీ అయిన అతనికి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని బాగు చేస్తాడు. కానీ ఏ పార్టీకి ఇవ్వడానికి తమ వద్ద డబ్బు లేదు. మేము మంచి ఫలితాలు ఇస్తాము. పంజాబ్ ను బంగారు రాష్ట్రంగా మారుస్తాము’’ అని ఆమె అన్నారు.
పంజాబ్ కాంగ్రెస్ యూనిట్ లో అంతర్గత కలహాలు ఉన్నాయని ఆమె అంగీకరించారు. ఇప్పటికే నలుగురు నాయకులు ముఖ్యమంత్రి పదవి కోసం ఆశిస్తున్నారని, వారు సిద్ధును ముందుకు రానివ్వరని చెప్పారు. తన భర్తకు ప్రియాంక వాద్రాతో మంచి సంబంధాలు ఉన్నాయని మాత్రం ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు.
‘‘కానీ అంతర్గత పోరు బలంగా ఉంది. ఐదు ముఖ్యమంత్రి ముఖాలు ఉన్నాయి. వారు కాంగ్రెస్ ను ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు. నవజ్యోత్ సింగ్ సిద్దూను ప్రొత్సహించడానికి వారు సిద్ధంగా లేరు. హైకమాండ్ దీన్ని అర్థం చేసుకుంటే మంచిది, కానీ అది వేరే విషయం’’ అన్నారు.
సిద్దూ మరోసారి బీజేపీలో చేరతాడా అని ప్రశ్నించగా, అతని నిర్ణయాన్ని తను చెప్పలేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ సిద్దును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారా అని ప్రశ్నించగా, ఆయన మంచి డబ్బు సంపాదిస్తున్నారు... సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారని ఆమె బదులిచ్చారు.
పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ అయిన సిద్ధూ చాలా నెలలగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. 2024 లోక్ సభ ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయలేదు. ఐపీఎల్ 2024 సీజన్ లో ఆయన తిరిగి వ్యాఖ్యాతగా రంగ ప్రవేశం చేశారు.
ఏప్రిల్ లో తన జీవిత అనుభవాలు, క్రికెట్ గురించి మాట్లాడటం కోసం ‘నవజ్యోత్ సిద్ధూ అఫీషియల్’ అనే కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాడు. ఆ సమయంలో క్రియాశీల రాజకీయాల్లోకి రావడం గురించి సిద్ధును ప్రశ్నించగా, అది కాలం సమాధానం చెబుతుందని, తాను కేవలం ప్రజా క్షేమం కోసం వచ్చానని, తనకు అది వ్యాపారం కాదని అన్నారు. 2027 లో పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.