యూపీలోని సంభాల్ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మొగలుల కాలంలో హరిహర దేవాలయం కూల్చివేసి దాని స్థానంలో మసీదు నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో స్థానిక కోర్టు సర్వేకు అనుమతి ఇచ్చింది. అధికారులు మసీదు ప్రాంతానికి వచ్చిన సమయంలో అక్కడ ఉన్న స్థానిక ముస్లింలు.. అధికారులు, వారికి భదత్ర కల్పించడానికి వచ్చిన పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు మైనర్ ఫోర్స్ ను, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఉద్రికత్తల కారణంగా కొంతమంది ముస్లిం యువకులు రోడ్డున పక్కన నిలిపి ఉంచిన వాహనాలకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించారని ఓ అధికారి తెలిపారు.
ఏమిటి వివాదం..
ప్రస్తుతం సంభాల్ లో ఉన్న జామా మసీదు ప్రాంతం ఒకప్పుడు ఒక హిందూ దేవాలయం ఉండేదని, దాన్ని కూలగొట్టి మసీదు నిర్మించారని ఓ న్యాయవాదీ స్థానిక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఈ పిటిషన్ పై సర్వే చేయడానికి అధికారులను పంపింది. గత మంళవారం సర్వే చేసిన అధికారులు, రెండోసారి కూడా సర్వే చేయడానికి ఆదివారం రోజు రాగా, ముస్లిం యువత రాళ్ల దాడికి పాల్పడ్డారు.
స్థానిక అధికారుల ప్రకారం ఉదయం ఏడు గంటలకు సర్వే ప్రారంభమైంది. అక్కడ ఉన్న ఆ వర్గం ప్రజలు గుమిగూడటం ప్రారంభించారు. కొద్దిసేపటికే వారంతా నినాదాలు చేస్తూ అధికారులు, పోలీసులపైకి రాళ్లదాడికి పాల్పడ్డారు.
"గుంపులో ఉన్న కొందరు దుర్మార్గులు పోలీసు బృందంపై రాళ్లు రువ్వారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మైనర్ ఫోర్స్, టియర్ గ్యాస్‌ను ఉపయోగించారు" అని పోలీసు సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ విష్ణోయ్ తెలిపారు. రాళ్లదాడికి పాల్పడిన వారిని, ప్రేరేపించిన వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
జిల్లా మేజిస్ట్రేట్ రాజేంద్ర పెసియా మాట్లాడుతూ, "కొందరు దుర్మార్గులు రాళ్ల దాడికి పాల్పడ్డారు, అయితే ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉంది, సర్వే జరుగుతోంది." రాళ్లదాడి ఘటనకు సంబంధించి దాదాపు 10 మందిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారిస్తున్నామని ఆయన తెలిపారు. సంభాల్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని ఉత్తరప్రదేశ్ పోలీసు చీఫ్ ప్రశాంత్ కుమార్ జాతీయ మీడియాకి తెలిపారు.
"మేము ప్రతిదీ పర్యవేక్షిస్తున్నాము. అన్ని పోలీసులు, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వారు ఆ ప్రాంతాలలో పెట్రోలింగ్ చేస్తున్నారు. అతి త్వరలో సంఘ వ్యతిరేక వ్యక్తులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము," అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) అన్నారు. సంభాల్‌లోని సర్వే స్థలానికి సమీపంలో యువకులు పోలీసులపై రాళ్లు రువ్వుతున్న వీడియోలు ఇంటర్నెట్‌లో కనిపించాయి.
బాబర్, అక్బర్ అక్కడ ఆలయం ఉన్నట్లు..
ఈ కేసులో పిటిషనర్‌గా ఉన్న సుప్రీంకోర్టు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ, మసీదును సర్వే చేయడానికి న్యాయవాది కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) కోర్టు ఆదేశించిందని తెలిపారు. కమిషన్ ద్వారా వీడియోగ్రఫీ, ఫొటోగ్రఫీ సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని తెలిపారు.
మసీదుకు సంబంధించిన పిటిషన్‌లో కేంద్ర, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు, మసీదు కమిటీ, సంభాల్ జిల్లా మేజిస్ట్రేట్‌లు పార్టీలుగా మారారని జైన్ గత మంగళవారం తెలిపారు. విష్ణు శంకర్ జైన్ అతని తండ్రి హరి శంకర్ జైన్ జ్ఞానవాపి మసీదు-కాశీ విశ్వనాథ్ ఆలయ వివాదంతో సహా ప్రార్థనా స్థలాలకు సంబంధించిన అనేక కేసులలో హిందూ పక్షాన ప్రాతినిధ్యం వాదనలు వినిపిస్తున్నారు.
హిందూ తరపు స్థానిక న్యాయవాది గోపాల్ శర్మ శుక్రవారం జాతీయ మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో, "బాబర్నామా", "ఐన్-ఎ-అక్బరీ" ఆ ప్రదేశంలో హరిహర్ ఆలయం ఉన్నట్లు ధృవీకరించాయని పేర్కొన్నాడు. ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారని తెలిపారు. బాబ్రీ మసీదు లాగానే ఇందులో కూడా ధ్వంసం చేసిన ఆలయ శిథిలాలను ఉపయోగించారని, ఆ విషయం బయటపడకుండా ఉండేందుకు అల్లరి మూకలు రాళ్లదాడకి పాల్పడ్డాయని న్యాయవాదీ తెలిపారు.
1529లో మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ ఆలయాన్ని కూల్చివేసినట్లు కూడా అతను పేర్కొన్నాడు. ఈ పరిణామాలపై సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
"సంభాల్‌లోని జామా మసీదు చారిత్రాత్మకమైనది. చాలా పురాతనమైనది. 1947 నుంచి ఏ మతపరమైన ప్రదేశాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో, అవి వాటి స్థానాల్లోనే ఉంటాయని 1991లో సుప్రీంకోర్టు ఆదేశించింది" అని ఆయన చెప్పారు. కేసు తదుపరి విచారణ జనవరిలో ఉంది.