
త్రిభాషా విధానాన్నిసమర్థించిన సుధామూర్తి
సుధామూర్తికి ఎనిమిది భాషలు తెలుసన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
రచయిత్రి, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఇటీవల జాతీయ విద్యావిధానం లో పేర్కొన్న త్రిభాషా విధానానికి తన మద్దతును తెలిపారు. బహుభాషావేత్తగా తనను తాను ఉదాహారణగా పేర్కొన్నారు.
‘‘ కొత్త భాషలు నేర్చుకోవడం సాధ్యమే. నేను ఆ సిద్దాంతాన్నినమ్ముతాను. నాకు ఏడు, ఎనిమిది భాషలు తెలుసు. నేను నేర్చుకోవడాన్ని ఆనందిస్తాను. పిల్లలు దాని నుంచి ప్రయోజనం పొందుతారు’’ అని సుధామూర్తి అన్నారు.
తమిళనాడులో ఎన్ఈపీ విధానాన్ని అమలు చేయడంపై తమిళనాడు ప్రభుత్వం కేంద్రం మధ్య వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానం పై సుధామూర్తి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ప్రధాన్ ఏం అన్నారంటే..
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. పార్లమెంట్ లోత్రిభాషా విధానాన్ని సమర్థిస్తూ సుధామూర్తి మాట్లాడటంపై ఆనందం వ్యక్తం చేశారు. తను స్వయంగా ఎన్ని భాషలు తెలుసని సుధామూర్తిని అడిగితే.. ‘‘తాను పుట్టుకతో కన్నడిగా అని తన ఉద్యోగం కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నానని, తరువాత సంస్కృతం, హిందీ, ఒడియా, తెలుగు, మరాఠీలో ప్రావీణ్యం సంపాదించాను’’ అని చెప్పారన్నారు.
సుధామూర్తిని ఇన్ని భాషలు నేర్చుకోవమని ఎవరూ బలవంతం చేశారని ప్రశ్నించారు. ఎవరూ, ఎవరిపై ఏమి విధించరు? అని ప్రధాన్ చెబుతూ.. తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం మాత్రం దానిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించారు.
‘‘ఇది ప్రజాస్వామ్యం, కొన్ని సార్లు ఒకటి కంటే ఎక్కువ భాషలు అవసరం’’ అని కేంద్రమంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం భారత సమాజాన్ని విభజించడానికి భాషను ఉపయోగిస్తుందనే ప్రతిపక్షాల వాదనలను ఆయన తోసిపుచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎప్పుడూ అలాంటి వ్యూహాలను ఆశ్రయించదని, దానిని పాపంగా చూస్తారని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ ఎంపీ..
కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం త్రిభాషా విధానంపై విమర్శలు గుప్పించారు. తమిళనాడు దీర్ఘకాలంగా తమిళం, ఇంగ్లీష్ తో కూడిన ద్విభాషా విధానాన్ని ఉపయోగిస్తుందని, వారికి ఇదే ఆమోదయోగ్యంగా ఉందన్నారు.
తమిళం సంస్కృతిని కాపాడుతుందని, ఇంగ్లీష్ వాణిజ్య, శాస్త్ర ప్రపంచంతో అనుసంధానం చేస్తుందని ఆయన అన్నారు. మూడో భాష నేర్చుకోవడం అనేది వ్యక్తిగత ఎంపిక అన్నారు.
‘‘హిందీని తప్పనిసరి చేయడం సరికాదన్నారు. మనపై మూడో భాషను రుద్దడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. కేంద్రం తన విధానాల్లో సరళతను పెంపొందించుకోవాలి’’ అన్నారు.
మరో కాంగ్రెస్ ఎంపీ జేబీ మాథుర్ మాట్లాడుతూ.. బీజేపీ అనుసరిస్తున్న విధానాలను విమర్శించారు. ‘‘భాష సున్నితమైన, భావోద్వేగ సమస్యగా గుర్తించాలి. ప్రజల మనోభావాలను కించపరిచే దేనిని ప్రొత్సహించకూడదు,
ప్రధాన్ అనవసరంగా సమాజంలో విభజనను సృష్టిస్తున్నారు’’ అని ఆమె అన్నారు. ప్రతిపక్షాలు ఐక్యతకు కట్టుబడి ఉన్నాయని, అందుకే ఒక రోజు ముందుకు పార్లమెంట్ నుంచి వాకౌట్ చేశామన్నారు. ఎన్ఈపీని తీసుకురావడంలో బీజేపీ రహస్య ఎజెండా ఉందన్నారు.
Next Story