తెహ్రీక్‌ ఏ హురియత్‌పై వేటు
x
అమిత్ షా ట్వీట్

తెహ్రీక్‌ ఏ హురియత్‌పై వేటు

భారత్‌ నుంచి జమ్మూ కశ్మీర్‌ను వేరు చేసి అక్కడ ఇస్లామిక్‌ పాలన ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ పలు ప్రయత్నలు చేసింది


చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (అన్‌లా ఫుల్‌ యా క్టివిటీస్‌ ప్రివెన్షన్‌ యాక్ట్‌- ఉపా) మరోసారి తెరపైకి వచ్చింది. ఇండియాలో ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే సాకుతో కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. జమ్మూ కశ్మీర్‌లో పాక్‌ అనుకూల వేర్పాటువాద సంస్థ తెహ్రీక్‌ ఏ హురియత్‌ (టీఈహెచ్‌)పై కేంద్రం హోం మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా స్వయంగా ఈ విషయాన్ని ట్వీట్‌ చేశారు.

ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, భారత వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకొన్నట్లు వివరించారు అమిత్‌ షా. ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించని వైఖరికి కట్టుబడి ఉందని చెబుతున్నారు అమిత్‌ షా. ఏ వ్యక్తి అయినా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు. ‘‘తెహ్రీక్‌ ఏ హురియత్‌ను చట్ట విరుద్ధ సంస్థగా ప్రకటిస్తున్నాం. ఉపా చట్టం కింద ఈ నిర్ణయం తీసుకొన్నాం. భారత్‌ నుంచి జమ్మూ కశ్మీర్‌ను వేరు చేసి అక్కడ ఇస్లామిక్‌ పాలన ఏర్పాటు చేయడానికి ఈ సంస్థ పలు ప్రయత్నలు చేసింది’’ అని అమిత్‌షా ఎక్స్‌ పోస్టులో రాసుకొచ్చారు.

గిలానీ ఈ సంస్థ సభ్యుడే...

2021లో మరణించిన సయ్యద్‌ అలీషా గిలానీ చాలా కాలం పాటు ఈ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈ సంస్థ పాక్‌ అనుకూల వైఖరితో పనిచేస్తుంది. ప్రస్తుతం దీనికి మసరత్‌ ఆలం భట్‌ అధ్యక్షత వహిస్తున్నాడు. ఇతడు కూడా భారత వ్యతిరేక.. పాక్‌ అనుకూల వైఖరి తీసుకొన్నాడు. 2010 నాటి జమ్మూకశ్మీర్‌ అల్లర్లతో మసరత్‌ పేరు వెలుగులోకి వచ్చింది. ఇదే కేసులో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలకు ఆర్థికసాయం చేశాడన్న అభియోగంపై 2019లో ఎన్‌ఐఏ అతడిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ప్రస్తుతం అతడు తిహాడ్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

మసరత్‌పై ఇప్పటికే వేటు...

మసరత్‌కు ముస్లిం లీగ్‌ పేరిట రాజకీయ పార్టీ ఉంది. దీనిపై ఈ నెల 27వ తేదీన కేంద్రం నిషేధం విధించింది. దేశ వ్యతిరేక, వేర్పాటువాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు ఉగ్రవాదానికి సహకారం అందిస్తున్నందుకు గానూ దీనిపై వేటు వేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాన్ని కూడా అప్పట్లో కేంద్రమంత్రి అమిత్‌షా వెల్లడించారు.

ఇదే దారిలో హురియత్‌ కాన్ఫరెన్స్‌...

హురియత్‌ కాన్ఫరెన్స్‌పై కూడా కేంద్రం నిషేధం విధించే అవకాశాలున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఉపా చట్టం కింద ఏ సంస్థ అయినా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే ప్రభుత్వం నిషేధం విధిస్తుంది.

Read More
Next Story