
ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్
‘మహాఘట్ బంధన్’ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్?
సంయుక్త విలేకరుల సమావేశంలో కూటమి నుంచి వెలువడనున్న అధికారిక ప్రకటన
మహాఘట్ బంధన్ లోని పార్టీలంతా కలిసి ఏర్పాటు చేయబోయే విలేకరుల సమావేశంలో కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్ ను ప్రకటిస్తారని, ఈ ప్రతిపాదనకు కూటమిలోని అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మహా ఘట్ బంధన్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పాట్నాలో విలేకరుల సమావేశం నిర్వహించబోతోంది.
సీట్ల కేటాయింపులో కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య విభేదాలు తలెత్తాయి. చాలా స్థానాలకు ఆర్జేడీ, కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో కూటమిలోని వివాదాలను సరిదిద్దుకోవాలని నిర్ణయించుకుని ఈ రోజు మధ్యాహ్నం సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఇందులోనే ఆర్జేడీ నేత, విపక్ష నాయకుడు తేజస్వీ యాదవ్ ను సీఎం అభ్యర్థిగా ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గెహ్లాట్ తో ఆర్జేడీ అధినేత లాలూ, తేజస్వీ యాదవ్ తో సమావేశం అయ్యాక దీనిపై ఓ అవగాహానకు వచ్చారు.
కూటమిలో చీలిక లేదు
బీహార్ ఎన్నికల ముందు మహాఘట్ బంధన్ లో చీలిక వచ్చిందనే ప్రచారాన్ని కాంగ్రెస్ అగ్ర నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తోసిపుచ్చారు. ఆయన నిన్న పాట్నాలో లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వీ యాదవ్ తో సమావేశం అయ్యారు. ఇతర రాష్ట్రాలలో కూడా కొన్ని సార్లు స్నేహపూర్వక పోటీ జరిగిందని, కూటమి బీజేపీ- జేడీ(యూ) కూటమికి వ్యతిరేకంగా బలంగా ఉందని తెలిపారు.
కేవలం తేజస్వీ యాదవ్ ఫొటో మాత్రమే..
ఈ రోజు మధ్యాహ్నాం కూటమి నిర్వహించే సంయుక్త విలేకరుల సమావేశం కోసం ఏర్పాటు చేసిన ప్లెక్సీలో మహాఘట్ బంధన్ లోని నాయకుల ఫోటోలు లేకుండా కేవలం తేజస్వీ యాదవ్ ఫోటో మాత్రమే ఉంది. ప్రస్తుతం ఇది వివాదంగా మారింది. ఈ ఫెక్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వివాదంపై బీజేపీ కూడా స్పందించింది. మహాఘట్ బంధన్ విచ్చిన్నమైందని వ్యాఖ్యానించింది. ‘‘ఇండి కూటమిలో కొనసాగుతున్న కలహాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
గతంలో రాహుల్ గాంధీ నిర్వహించిన పాదయాత్రలో తేజస్వీ యాదవ్ ను పట్టించుకోలేదు. ఇప్పుడు తేజస్వీ యాదవ్, రాహుల్ గాంధీని పోస్టర్ల నుంచి తొలగించారు’’ అని ఆ పార్టీ రాష్ట్ర మీడియా ఇంచార్జ్ డానిష్ ఇక్భాల్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. సంయుక్త విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీ కూటమి విచ్చిన్నాన్ని ఓ ప్రకటన అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
మహాఘట్ బంధన్ లోని నాయకుల చిత్రాలు లేకుండా ప్లెక్సీ ఎందుకు పెట్టారనే దానిపై వ్యాఖ్యానించడానికి ఆర్జేడీ నాయకులు అందుబాటులో లేరు. బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, నవంబర్ 11న రెండు విడతలలో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి. బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉన్నాయి.
Next Story