కాంగ్రెస్ ఎంతగా దిగజారిందో చూడండి:  బిజెపి
x
ఇంకా నిర్మాణం పూర్తి కాని అయోధ్య రామాలయం

కాంగ్రెస్ ఎంతగా దిగజారిందో చూడండి: బిజెపి

కాంగ్రెస్ రామమందిర ఆహ్వానాన్ని తిరస్కరించడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పార్టీ చరిత్ర మొత్తం హిందూ వ్యతిరేకతే అని, ఇప్పుడు మరోసారి అది బయటపడిందంది.


రామమందిర ప్రారంభోత్సవానికి రావడానికి తిరస్కరించిన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం పై బీజేపీ భగ్గుమంది. "రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టానను తిరస్కరించడం అంటే హిందూ మత వ్యతిరేకతను ప్రదర్శించడమే" అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేదీ అన్నారు. ఇది ముమ్మాటికి దేశ సంస్కృతిని కించపరచడమే అని కాషాయపార్టీ విమర్శలు గుప్పించింది.

ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఉన్న వ్యతిరేకత, అసూయ, ద్వేషం వంటి వాటి కారణంగానే కాంగ్రెస్ దేశాన్ని వ్యతిరేకించే స్థాయికి చేరిందని, ఇప్పుడు దేవుడిని సైతం తిరస్కరించే స్థాయికి దిగజారిందని ఆయన దుయ్యబట్టారు. అయోధ్య రామమందిర నిర్మాణం అనేది హిందువుల వందల ఏళ్ల కలగా త్రివేదీ అభివర్ణించారు.

"భారతీయుల ఆత్మగౌరవం, సంస్కృతి, అత్యున్నత విలువలకు ప్రతీక రామమందిరం" అని చెప్పారు. కానీ కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్షపార్టీలు సెక్యూలర్ ముసుగులో అతివాద రాజకీయాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బాబ్రీ- అయోధ్య ఆలయానికి సంబంధించిన భూవివాదంలో ముస్లిం కక్షిదారుడు అయిన ఇక్భాల్ కు కూడా రామమందిర ప్రారంభ ఆహ్వనం పంపినట్లు ఆయన గుర్తు చేశారు.

దేశానికి సంబంధించిన చారిత్రాత్మక క్షణాల్లో అడ్డంకులు సృష్టించడం ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ధోరణి అని ఆయన ఆరోపించారు. "మీరు చరిత్ర పేజీ తిరగేయండి, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం, జీఎస్టీ, దళిత, గిరిజన దేశాధినేతలు ఎన్నిక కావడం, రాష్ట్రపతి ప్రసంగాలు" ఇలా వేటిని తీసుకున్న కాంగ్రెస్ బహిష్కరించడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.

ఈ అలవాటు కారణంగానే గత దశాబ్ధంగా కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తూ వస్తున్నారని, కానీ అది మాత్రం తన బుద్దిని మార్చుకోవడం లేదని ఘూటు వ్యాఖ్యలు చేశారు. గత తప్పిదాలను సరిచేసుకునే సువర్ణ అవకాశాన్ని కాంగ్రెస్ చేజార్చుకుందని త్రివేదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇప్పటికీ బాబ్రీ తిరిగి నిర్మించాలనే ఆలోచనలతోనే ఉందా? అంటూ ఆయన ప్రశ్నించారు.

ఇంతకుముందు గుజరాత్ లోని సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి ప్రధాని నెహ్రూ కూడా ఇలాగే తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఇతర కాంగ్రెస్ నాయకులు నిర్ణయాలను వ్యతిరేకించారని, ఇప్పుడు అదే తత్వాన్ని కాంగ్రెస్ కొనసాగిస్తోందని అన్నారు. గాంధీజీ కలలు కన్న రామరాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కాలరాస్తోందని విమర్శించారు.

రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు హజరుకావాలన్న ఆహ్వానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీతో పాటు లోక్ సభలో ఆ పార్టీ పక్షనేత అధిర్ రంజన్ చౌధరి లు అది ఆర్ఎస్ఎస్ కార్యక్రమం అని విమర్శించారు. బీజేపీ ఎన్నికల రాజకీయాలకు పాల్పడుతోందని, కేవలం ఎన్నికల ప్రాజెక్ట్ కోసమే రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారని ఆ పార్టీ ఆరోపించింది.

Read More
Next Story