ఆ కేసులో ప్రతిపక్షాలను ఇరికించే కుట్ర జరుగుతోంది: కాంగ్రెస్
x

ఆ కేసులో ప్రతిపక్షాలను ఇరికించే కుట్ర జరుగుతోంది: కాంగ్రెస్

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్ట్ అయిన వారిపై ఒత్తిడి తెచ్చి, వారి నోటి వెంట ప్రతిపక్షనాయకుల పేర్లను చెప్పించే ప్రయత్నం జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది.


పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో అరెస్ట్ అయిన ఆరుగురిలో ఐదుగురిని పోలీసులు రోజు చిత్రహింసలకు గురి చేస్తున్నారని నిందితులు బుధవారం కోర్టుకు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రభుత్వ చర్యలను ఖండించారు.

" ప్రభుత్వం తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ప్రతిపక్షాలపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఇది నిజంగా అహంకార చర్య. ప్రతిపక్ష నాయకులను ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని జైలు పంపింది. ఇప్పుడు మరో తప్పుడు కుట్ర పన్నింది" అని హిందీలో రాసిన పోస్ట్ ను ఎక్స్ లో ట్వీట్ చేశారు.

పార్లమెంట్ లోకి చొరబడేందుకు పాస్ లు ఇచ్చిన బీజేపీ ఎంపీపై ఎలాంటి చర్య తీసుకోలేదని, అయితే భద్రతాలోపాలపై గళం విప్పిన 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారని విమర్శించారు. నిరుద్యోగంపై తమ నిరసనను తెలిపినందుకు యువతపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారి నోటి వెంట ప్రతిపక్ష పార్టీల నాయకుల పేర్లను బయటకు రప్పించే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.

మోదీ ప్రభుత్వం అన్యాయ పాలనపై వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందని, రాహూల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ద్వారా ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతుందన్నారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా తమ గళం విప్పామని వివరించారు.

ఐదుగురు నిందితులు మనోరంజన్, డి. సాగర్ శర్మ, లలిత్ ఝా, అమోల్ షిండే, మహేశ్ కుమావత్ తమను హింస్తున్నారని బుధవారం కోర్టులో తెలిపారు. అలాగే 70 తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

" మమ్ములను యూఏపీఏ చట్టం కింద అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా హింసిన్నారు. కొన్నిసార్లు విద్యుత్ షాక్ లు ఇచ్చారు. మాలో ఇద్దరి చేత రాజకీయ పార్టీల నాయకులతో అనుబంధం ఉందని బలవంతంగా పేపర్ల పై రాయించుకున్నారు. " అని నిందితులు బుధవారం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో వెల్లడించారు.

Read More
Next Story