‘‘వందేమాతరాన్ని ముక్కలు చేసి, తరువాత దేశాన్ని విభజించారు’’
x
రాజ్యసభలో వందేమాతరంపై జరిగిన చర్చలో అమిత్ షా, మాజీ ప్రధాని నెహ్రూ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు

‘‘వందేమాతరాన్ని ముక్కలు చేసి, తరువాత దేశాన్ని విభజించారు’’

రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నెహ్రూను సమర్థించిన ఖర్గే


జవహర్ లాల్ నెహ్రూ మొదట బుజ్జగింపు రాజకీయాలు చేసి ‘వందేమాతరాన్ని’ విభజించారని, చివరకు అది దేశ విభజనకు దారి తీసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు.

‘వందేమాతరానికి’ 150 సంవత్సరాలు పూర్తయినందున రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా నెహ్రూపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలు ఈ చర్చను బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలతో ముడిపెట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

షా ఆరోపణపై కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. మొదటి ప్రధాని నెహ్రూను ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా తీవ్రంగా అవమానపరుస్తున్నారని ఆరోపించారు.
వందేమాతరంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే జాతీయ గేయంగా తీసుకోవాలని మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖులు సమష్టిగా నిర్ణయం తీసుకున్నారని ఆయన వాదించారు.
షా ఏమన్నారంటే...
ఎగువ సభలో వందేమాతరంపై ప్రారంభమైన ప్రత్యేక చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వం వహించారు. వందేమాతరం దేశంలో సాంస్కృతిక జాతీయతను మేల్కొల్పిన మంత్రమని, స్వాతంత్య్ర ఉద్యమకాలంలో ఎంత ప్రాముఖ్యం ఉందో నేటీ అంతే ప్రాముఖ్యం ఉందని అమిత్ షా అన్నారు.
దేశాన్ని ‘వికసిత్ భారత్’ వైపు తీసుకెళ్లడంలో రాబోయే రోజుల్లో కూడా ఈ పాట సందర్భోచితంగా ఉంటుందని ఆయన గట్టిగా వాదించారు. వందేమాతరంపై చర్చ అవసరమా అని ప్రశ్నించిన కాంగ్రెస్ పై ఆయన నిప్పులు కురిపించారు. మొదటి ప్రధాని నెహ్రూ ‘వందేమాతరం’ కవితను విభజించి కేవలం రెండు చరణాలకు పరిమితం చేశారని ఆరోపించారు.
‘‘నిన్న లోక్ సభలో కొంతమంది ఎంపీలు వందేమాతరంపై చర్చ ఎందుకని ప్రశ్నించారు. చర్చ అవసరమే. ఈ పాట రాసినప్పుడూ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలోనూ, ఇప్పుడూ కూడా సందర్భోచితంగానే ఉంది. అలాగే 2047 లో వికసిత భారత్ సాధించిన తరువాత కూడా సందర్భోచితంగానే ఉంటుంది’’ అని షా సమాధానమిచ్చారు.
‘‘పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు వస్తున్నందున వందేమాతరంపై చర్చ తీసుకొచ్చారని కొందరు అంటున్నారు. బెంగాల్ ఎన్నికలతో ముడిపెట్టడం ద్వారా వారు వందేమాతరం ప్రాధాన్యం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన అన్నారు.
బెంగాల్ పాట.. దేశమంతా వ్యాపించింది..
వందేమాతరం సందేశ స్ఫూర్తిని దేశ యువత మదిలోకి తీసుకెళ్లాలని కేంద్ర హోంమంత్రి గౌరవ సభ్యులను కోరారు. ఈ పాటను బంకించంద్ర చటోపాధ్యాయా బెంగాల్ లో రాశారని, అయితే అది దేశవ్యాప్తంగా వ్యాపించి, దేశ స్వాతంత్య్ర పోరాట నినాదంగా మారిందని ఆయన గుర్తు చేశారు.
భారత్ వందల సంవత్సరాలుగా ఇస్లామిక్ దండయాత్రను ఎదుర్కొందని, తరువాత బ్రిటిష్ వారు దేశంపై కొత్త సంస్కృతిని రుద్దడానికి ప్రయత్నించిన తరువాత ఈ పాట రాశారని కేంద్ర హోంమంత్రి చెప్పారు.
‘‘ఈ పాట దేశాన్ని తల్లిగా చూసే సంస్కృతిని తిరిగి స్థాపించింది. బ్రిటిష్ ప్రభుత్వం దీనిని నిషేధించడానికి ప్రయత్నించింది. వందేమాతరం ఆలపిస్తే ప్రజలను కొట్టి జైలులో పెట్టిన ప్రజల హృదయాలను తాకి, కశ్మీర్ నుంచి కన్యాకుమారీ వరకూ వ్యాపించింది’’ అని ఆయన అన్నారు.
‘‘ఏ చర్య ద్వారా సరిహద్దులు నిర్ణయించబడని ఏకైక దేశం భారత్, దాని సరిహద్దులు సంస్కృతి ద్వారా నిర్ణయించబడ్డాయి. సంస్కృతే దానిని ఏకం చేసింది. అందుకే ఇది సాంస్కృతిక జాతీయవాద చిహ్నం. ఈ సాంస్కృతిక జాతీయవాదం అనే ఆలోచన బంకించంద్ర చటోపాధ్యాయ మేల్కొలిపారు’’ అని షా అన్నారు.
నెహ్రూ వాటిని తొలగించారు
కాంగ్రెస్, నెహ్రూ కలిపి వందేమాతరాన్ని విభజించారని అమిత్ షా ఆరోపించారు. వందేమాతరం 100 సంవత్సరం వేడుకల సందర్భంలో దేశంలో ఎమర్జెన్సీ విధించారని అన్నారు.
‘‘వందేమాతరంపై చర్చ ఎందుకుని కాంగ్రెస్ సభ్యులు చాలామంది ప్రశ్నించారు. దీనిని డైవర్షన్ వ్యూహంగా విమర్శించారు. మేము ఎటువంటి చర్చను చేపట్టడానికి మేము భయపడట్లేదు. మేము పార్లమెంట్ ను అడ్డుకోము. మాకు దాచడానికి ఏమీ లేదు. ఏ అంశంపైనా అయిన చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము’’ అని షా స్పష్టం చేశారు.
‘‘1937 లో వందేమాతరం 50 వార్షికోత్సవం సందర్భంగా నెహ్రూ దానిని రెండుగా విభజించి రెండు చరణాలకు పరిమితం చేశారు. కాంగ్రెస్ వందేమాతరాన్ని గౌరవించిన విధానం ఇది’’ అని ఆయన అన్నారు. దీనిపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇక్కడే బుజ్జగింపు రాజకీయాలు మొదలుపెట్టారని, చివరకు భారత్ విభజనకు దారితీసిందని అన్నారు. ‘‘వారు(నెహ్రూ) బుజ్జగింపు రాజకీయాల కోసం పాటను రెండు విభజించి ఉండకపోతే భారత్ కూడా విభజించపడి ఉండేది కాదు’’ అని ఆయన అన్నారు.
చర్చల వెనక ఎలాంటి ఉద్దేశం లేదని షా అన్నారు. బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. ప్రస్తుత పాలక వర్గం పాలనపై దృష్టి పెట్టకుండా చరిత్రను తవ్వి తీస్తున్నారని, దానిపైనే ప్రజలు దృష్టి పెట్టాలని పాలక వర్గం కోరుకుంటున్నట్లు ఆమె విమర్శించారు.
దీనిపై కేంద్రమంత్రి షా.. రాజ్యసభలో జవహర్ లాల్ నెహ్రూ -గాంధీ కుటుంబంలోని తరాలు వందేమాతరం ప్రాముఖ్యతను పదేపదే అణగదొక్కుతాయని ఆయన ఆరోపించారు.
బెంగాల్ కాంగ్రెస్ చీఫ్..
కేంద్రమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన ప్రసంగాన్ని బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ శుభాంకర్ సర్కార్ ఖండించారు. జాతీయ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ తనే స్వయంగా ఎంచుకున్నారని, తరువాత భారత రాజ్యాంగ సభ దీనిని ఆమోదించిందని, ప్రియాంక గాంధీ సరిగానే చెప్పారని అన్నారు. రాబోయే పశ్చిమబెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వందేమాతరంపై చర్చను లేవనెత్తరాని వాద్రా చేసిన వాదన నిజమని చెప్పారు.
రవీంద్రనాథ్ ఠాగూర్, రాజా రామ్మోహన్ రాయ్, బంకించంద్ర చటోపాధ్యాయ వంటి బెంగాల్ పుత్రులను అవమానించినందుకు బీజేపీ బెంగాలీలు త్వరలోనే గట్టి సమాధానం చెబుతారని ఆయన జోస్యం చెప్పారు.
ప్రియాంక గాంధీ అబద్దాల వలయాన్ని చీల్చి చెండారని, వందేమాతరం నిజమైన కాలక్రమాన్ని, చారిత్రక పత్రాలను సమర్పించిన విధానం ప్రకారం పార్లమెంట్ ఆర్కైవ్ లో చారిత్రాత్మక రికార్డుగా మిగిలిపోతుందని అన్నారు.
‘‘దీని చుట్టూ వివాదం తలెత్తడం రవీంద్రనాథ్ ఠాగూర్ ను రాజ్యాంగ సభలోని సభ్యులను తీవ్రంగా అవమానించడమే’’ అని సర్కార్ అన్నారు. మోదీ తన ప్రసంగంలో బంకించంద్ర చటోపాధ్యాయను అగౌరవపరిచే విధంగా ప్రస్తావించారని ఆయన విమర్శించారు.
షా ఆరోపణలను ఖండించిన ఖర్గే..
నెహ్రూపై చేసిన ఆరోపణలను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే తోసిపుచ్చారు. తన ప్రసంగాన్ని ఖర్గే వందేమాతరం నినాదంతో ప్రారంభించారు. కాంగ్రెస్ నాయకులు ఎప్పూడు వందేమాతరం అని జపించారని అన్నారు.
‘‘మేము ఎప్పుడూ వందేమాతరం పాడుతూనే ఉన్నాము. కానీ వందేమాతరం పాడని వారు కూడా ఇప్పుడు దానిని పాడటం ప్రారంభించారు. ఇది వందేమాతరం శక్తి. ఇది జాతీయ పండగ, చర్చ కాదు.
1921 లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ నాయకులు వందేమాతరం నినాదాలు చేసి జైలుకు వెళ్లారు. మీరు అప్పడు ఏం చేస్తున్నారు? బ్రిటిష్ వారి కోసం పనిచేస్తున్నారు’’ అని ఖర్గే అన్నారు.
‘‘మీరు మాకు దేశభక్తిని నేర్పుతున్నారా? మీరు దేశభక్తికి భయపడి బ్రిటిష్ వారికి సేవ చేస్తున్నారు. నెహ్రూను అవమానించడానికి ప్రధాని మోదీ ఎటువంటి అవకాశాన్ని వదిలిపెట్టరు. కేంద్రహోంమంత్రి కూడా వందేమాతరం చరణాలను తొలగించినందుకు నెహ్రూను నిందించారు. ఇది తీవ్ర అభ్యంతరం’’ అని ఖర్గే అన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించిన కవితలోని రెండు చరణాలను మాత్రమే పాడాలనే తీర్మానాన్ని నెహ్రూ ఒక్కడే చేయలేదని గాంధీ, సుభాష్ చంద్రబోస్, మదన్ మోహన్ మాలవ్యా, ఆచార్య జేబీ కృపలానీ వంటి నాయకులు కూడా ఉన్నారని ఖర్గే కాంగ్రెస్ నిర్ణయాలను సమర్థించుకున్నారు.
కవితలోని మొదటి రెండు చరణాలను మిగిలిన పాటతో విడదీయడం వలన తనకు ఎటువంటి ఇబ్బంది లేదని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన దాన్ని ఖర్గే కోట్ చేశారు.
‘‘మీరు గొప్ప నాయకులందరిని అవమానిస్తున్నారు. ఇది వారి ఉమ్మడి నిర్ణయం. మీరు నెహ్రూజీని మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు?’’ అని ఆయన అన్నారు.
Read More
Next Story