పటేల్ సేవను తుడిచివేసే ప్రయత్నం చేశారు: అమిత్ షా
x

పటేల్ సేవను తుడిచివేసే ప్రయత్నం చేశారు: అమిత్ షా

దేశాన్ని ఐక్యం చేసిన సర్థార్ పటేల్ చరిత్రను కొన్ని దుష్ట శక్తులు తుడిచివేసే ప్రయత్నాలు చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.


దేశానికి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చేసిన అపారమైన కృషిని తుడిచివేయడానికి కొంతమంది తీవ్రంగా ప్రయత్నాలు చేశారని, చాలా కాలం ఆయనకు భారతరత్న ఇవ్వకుండా చేశారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం విమర్శించారు.

పటేల్ జయంతి సందర్భంగా ‘రన్ ఫర్ యూనిటీ’ని జెండా ఊపి మంత్రి కేంద్ర హోంమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశ తొలి హోంమంత్రి దూరదృష్టి, చతురత వల్లనే 550కి పైగా సంస్థానాలు భారత యూనియన్‌లో విలీనమై దేశం సమైక్యంగా మారిందని అన్నారు. సర్దార్ పటేల్ వల్లనే లక్షద్వీప్, జునాగఢ్, హైదరాబాద్ సహ ఇతర రాచరిక రాష్ట్రాలన్నీ భారత్‌లో విలీనమయ్యాయని అన్నారు.
"అయితే దేశానికి సర్దార్ పటేల్ చేసిన అపారమైన సేవను తుడిచివేయడానికి, అణగదొక్కడానికి ప్రయత్నాలు జరిగాయి. ఆయనకు చాలా కాలం పాటు భారతరత్నను కూడా ఇవ్వలేదు" అని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెవాడియాలో పటేల్‌కు అత్యంత ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పారని, ఆయనను సముచితంగా సత్కరించి ఆయన జ్ఞాపకాన్ని సజీవంగా ఉంచారని పేర్కొన్నారు.
మోదీ 2018లో గుజరాత్‌లోని కెవాడియాలో స్టాట్యూ ఆఫ్ యూనిటీని ప్రారంభించారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రతి రంగంలో సర్దార్ పటేల్ దార్శనికత, ఆలోచనలకు ప్రధాని మోదీ ఒక నిర్దిష్ట రూపాన్ని ఇచ్చారని షా కొనియాడారు.
సర్దార్ పటేల్ 1950లో మరణించిన 41 సంవత్సరాల తర్వాత, మరణానంతరం 1991లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించారు. దేశ ప్రజలు ఇప్పుడు ఐక్యంగా ఉన్నారని, 2047 నాటికి భారత్‌ను పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాని కలను నెరవేర్చేందుకు తమను తాము అంకితం చేసుకున్నారని షా అన్నారు.
2047 నాటికి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తామని, ప్రపంచంలోని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తామని ప్రధాని దేశ ప్రజలకు వాగ్ధానం చేశారని, దాన్ని ఆయన నిలుపుకుంటారని చెప్పారు. ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న, బలమైన దేశంగా ప్రపంచం ముందు నిలిచిందని షా పేర్కొన్నారు. ప్రతి రంగంలో అగ్రగామిగా నిలిచే మార్గంలో ప్రపంచం ముందు భారతదేశం బలంగా నిలుస్తుందని, దానికి పునాది సర్దార్ పటేల్ అని హోంమంత్రి అన్నారు.
“సర్దార్ పటేల్ గొప్ప ఆలోచనలు దేశంలోని యువ తరానికి కచ్చితంగా మార్గదర్శకంగా మారతాయి” అని ఆయన అన్నారు. 'రన్ ఫర్ యూనిటీ' ద్వారా భారతదేశ ఐక్యతను బలోపేతం చేసేందుకు ప్రతిజ్ఞ చేయాలని, 2047 నాటికి సంపూర్ణ అభివృద్ధి చెందిన భారతదేశ కలను సాకారం చేయాలని అమిత్ షా పౌరులకు పిలుపునిచ్చారు.
పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న 'రన్ ఫర్ యూనిటీ'ని సాధారణంగా నిర్వహిస్తామని అయితే ఈ ఏడాది దీపావళి రోజున రావడంతో రెండు రోజుల ముందుగానే నిర్వహించినట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం 2014 నుంచి అక్టోబర్ 31ని 'రాష్ట్రీయ ఏక్తా దివస్' లేదా జాతీయ ఐక్యత దినోత్సవంగా పాటిస్తోంది.
పటేల్ చరిత్ర..
పటేల్ అక్టోబర్ 31, 1875న గుజరాత్‌లోని నడియాడ్‌లో జన్మించారు. భారత మొదటి హోం మంత్రి, ఉప ప్రధాన మంత్రిగా పనిచేశారు. 550 పైగా రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్‌లో విలీనం చేసి ఉక్కు మనిషిగా ఖ్యాతి పొందారు. భారతదేశాన్ని ఏకీకృతం చేయడంలో సర్దార్ పటేల్ చేసిన కృషిని గుర్తు చేస్తూ జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ 150వ జయంతిని స్మారకంగా 2024 నుంచి 2026 వరకు రెండు సంవత్సరాల పాటు దేశవ్యాప్త కార్యక్రమంతో దేశానికి ఆయన చేసిన సేవలను గౌరవించనున్నట్లు షా గత వారం ప్రకటించారు.
Read More
Next Story