ఇంకో రెండు మీటర్లు.. మరో రెండు గంటలు
x

ఇంకో రెండు మీటర్లు.. మరో రెండు గంటలు

సిల్ క్యారా సొరంగంలో చిక్కుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లు NDMA ప్రకటించింది. డ్రిల్లింగ్ యంత్రం అగర్ ఆగిన చోట పనులు తిరిగి మొదలైనట్లు వెల్లడించింది. కూలిన 60 మీటర్ల సొరంగంలో 58 మీటర్ల వరకూ డ్రిల్లింగ్ పూర్తి చేయడంలో ర్యాట్ మైనింగ్ హోల్ నిఫుణులు విజయం సాధించారని ఎన్డీఎంఏ సభ్యుడు, రిటైర్డ్ లెప్టినెంట్ జనరల్ సయ్యద్ హుస్సైన్ వెల్లడించారు.


మరో రెండు మీటర్లు సొరంగం పూర్తి చేసి కార్మికులు ఉన్నచోటుకు వెళ్తామని చెప్పారు. దీని కోసం మరో రెండు గంటలు ఓపికగా వేచి చూడాల్సి ఉందని వివరించారు. ఇప్పటి వరకూ డ్రిల్లింగ్ పనులను అడ్డుకున్న ఇనుప ముక్కలను ప్లాస్మ కట్టర్ల సాయంతో తొలగించినట్లు వెల్లడించారు. ఈ పని కోసం ర్యాట్ మైనింగ్ హోల్ నిఫుణులు, ఆర్మీ ఇంజనీర్లు, రాత్రంతా శ్రమించినట్లు ఆయన మీడియాకు వివరించారు. సొరంగం తవ్వకం పూర్తి కాగానే వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల దగ్గరికి చేరుకుని ఒక్కొక్కరిని బయటకు తెస్తారని చెప్పారు.

సొరంగం లోపల ఉన్న 41 మంది కార్మికులు బయటకు రాగానే వైద్య సాయం అందించడానికి అక్కడే తాత్కాలికంగా శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే 41 అంబులెన్సులు కూడా సిద్దం చేశారు. దగ్గర్లోని వైద్య కేంద్రంలో ప్రత్యేక బెడ్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎవరికైన ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే తరలించడానికి వీలుగా వాయుసేన కి చెందిన చినూక్ హెలికాప్టర్లు సైతం సొరంగం వెలుపల సిద్దంగా ఉంచారు. మరోవైపు కార్మికుల కుటుంబాలకు సమాచారం అందించారు.

నవంబర్ 12 న ఉత్తరఖండ్ లో చార్ ధామ్ యాత్ర కోసం తొలుస్తున్న సిల్ క్యారా సొరంగం కూలింది. ఇప్పటికి 17 రోజులుగా సొరంగం లోపలే 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారికి అవసరమైన ఆహరం, నీరు ఇతర నిత్యావసరాలు ప్రత్యేకంగా అమర్చిన పైపుల ద్వారా అందిస్తున్నారు. కార్మికులు మానసికంగా ధృడంగా ఉండడానికి వైద్యులు నిరంతరం వారితో మాట్లాడుతున్నారు. మరోవైపు కార్మికులకు ఆట విడుపుకోసం మొబైల్లు, వైకుంఠపాళి వంటి వాటిని అందించారు. కార్మికులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడటం కోసం బీఎస్ఎన్ ఎల్ ప్రత్యేకంగా మిని ఎక్స్ ఛేంజ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం, ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పటికప్పడూ సహయక చర్యలను పర్యవేక్షించింది.

Read More
Next Story