'కలిసుందాం రా' అంటే ఇకపై కుదరదట! రశీదు ఉంటేనే ఇల్లైనా, హాస్టలైనా!!
లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న ప్రతి వ్యక్తి ప్రభుత్వ రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి..
ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని ఓ ఇంట్లో ఓ జంట (పేర్లు మార్చాం రూమీ, పామీ) కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఒకర్ని ఒకరు అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయం వాళ్ల పెద్దవాళ్లకి తెలిసినా చుట్టుపక్కల వాళ్లకి తెలియదు. ప్రభుత్వానికి తెలియజెప్పాల్సిన అవసరం అసలే రాలేదు. ఇంతలో పొరుగింటి పుల్లయ్యలెవరో.. ‘ఈ జంట సహజీవనం చేస్తోందని, వీళ్లకి పెళ్లి కాలేదని’ ‘సర్కార్’కి ఉప్పందించారు. అప్పటి వరకు గుట్టుగా సాగిన ‘సహజీవనం’ పబ్లిక్ అయింది. అధికారులు వచ్చారు, తలుపు తట్టారు. రశీదు అడిగారు. వాళ్లు లేదన్నారు. అయితే తెచ్చుకోమన్నారు. మున్ముందు ఇలా ‘లివింగ్ టు గెదర్’, ‘లివ్ ఇన్ రిలేషన్ షిప్’, ‘కలిసుంటాం, సహజీవనం’ చేయాలంటే రిజిస్ట్రేషన్ తప్పని సరన్నారు. ప్రభుత్వానికి చెప్పి తీరాలని, లేకుంటే జైలు శిక్షకో జరిమానాకో లేదా రెండింటికో సిద్ధపడాలని హెచ్చరించి వెళ్లిపోయారు.
అవును, మీరు చదివింది నిజమే. అటువంటి చట్టాన్నే బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ ప్రభుత్వం తీసుకువచ్చింది. దానిపేరే యూనిఫాం సివిల్ కోడ్ లేదా ఉమ్మడి పౌరస్మృతి. దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతిపై చర్చ జరుగుతున్న తరుణంలో ఉత్తరాఖండ్ ఈ బిల్లుకు ఆమోదం తెలపిన తొలి రాష్ట్రంగా రికార్డుల్లోకి ఎక్కింది.
దేశంలోనే తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్..
దేశంలోనే తొలిసారి ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అమల్లోకి వచ్చింది. ఉత్తరాఖండ్ యూనిఫాం సివిల్ కోడ్‌ను రాష్ట్ర శాసనసభ ఆమోదించింది. కొత్త రూల్స్‌ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం 'లివ్ ఇన్ రిలేషన్‌షిప్'లో (సహజీవనం) ఉండాలనుకుంటున్న జంటలు ఇకపై రాష్ట్ర ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
సహజీవనం ఉన్నామని చెప్పకపోతే జైలు శిక్ష..
లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటూ ఆ సంబంధాన్ని రిజిస్ట్రేషన్ చేయించకపోతే ఆ జంటకు ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.25 వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశాలున్నాయి. లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్న జంట నమోదు చేసుకున్న రిజిస్ట్రేషన్ రసీదు ఆధారంగానే అద్దె ఇల్లు, హాస్టల్ లేదా పేయింగ్ గెస్ట్ (పీజీ) సౌకర్యాన్ని పొందగలుగుతారు.
బిల్లులోని ముఖ్యాంశాలు ఏమిటంటే...
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి ప్రభుత్వం తెచ్చిన యూనిఫాం సివిల్ కోడ్‌లో ఇలాంటి అనేక అంశాలున్నాయి. కామన్ సివిల్ కోడ్లో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ (సహజీవనం)పై స్పష్టమైన వివరణ ఇచ్చారు. దీని ప్రకారం ఒక పురుషుడు, ఒక మహిళ మాత్రమే లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండాలి. థర్డ్ జెండర్‌కి చాన్స్ లేదు. సహజీవనం చేస్తున్న జంట రిజిస్ట్రేషన్ చేసే నాటికి వివాహం చేసుకుని ఉండ కూడదు. లేదా మరొకరితో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండకూడదు. చట్టప్రకారం మరే ఇతర నిషేధిత సంబంధాలలో ఉండకూడదు. లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్న ప్రతి వ్యక్తి ప్రభుత్వ రిజిస్టర్డ్ వెబ్ పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్నాక రిజిస్ట్రార్ వారికి రిజిస్ట్రేషన్ రసీదు ఇస్తారు. ఆ రసీదు ఆధారంగా సహజీవనం చేస్తున్న జంటకు ఇల్లు, హాస్టల్ లేదా పెయింగ్ గెస్ట్ సౌకర్యం లభిస్తుంది. లేకుంటే ఎవ్వరూ ఇల్లు ఇవ్వరు. సహజీవనం కోసం రిజిస్ట్రార్ వద్ద రిజిస్టర్ చేయించుకున్న జంట.. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు, సంరక్షకులకు తప్పనిసరిగా తెలియజేయాలి. గిరిజనులను ఈ బిల్లు నుంచి మినహాయించారు. వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం వంటి విషయాల్లో అందరికీ ఒకేతరహా నిబంధనల కోసం ఈ ఉమ్మడి పౌరస్మృతిని తీసుకువచ్చినట్టు ఉత్తరాఖండ్ సీఎం ధామీ చెబుతున్నారు.
ఉత్తరాఖండ్ సీఎం వాదన ఇదీ...
"రాష్ట్ర ప్రజలందరికీ నేను అభినందనలు చెబుతున్నా. 'ఒకే భారత్, మెరుగైన భారత్' కలను సాకారం చేసేందుకు ఉత్తరాఖండ్‌లో యూనిఫాం సివిల్ కోడ్‌ను తీసుకువస్తామని మా ప్రభుత్వం హామీ ఇచ్చింది. చెప్పినట్లు చేసింది. అయితే ఈ బిల్లుపై తమ ఆలోచనలను పంచుకున్నందుకు ప్రతిపక్ష సభ్యులతో సహా అసెంబ్లీ సభ్యులందరికీ ధన్యావాదాలు చెబుతున్నా" అన్నారు సీఎం పుష్కర్ సింగ్ ధామి. "రెండో సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే తొలి మంత్రివర్గ సమావేశంలోనే యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం కమిటీ ఏర్పాటు చేశాం. 2022 మే 27న రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటైంది. 2.32 లక్షలకు పైగా సూచనలు అందాయి. రాష్ట్రంలోని దాదాపు 10 శాతం కుటుంబాలు బిల్లు రూపకల్పనకు తమ సూచనలను అందించాయి. యూసీసీ సాధారణ బిల్లు కాదు. అత్యద్భుతమైన బిల్లు" అని సీఎం ధామి కొనియాడారు.
సహజీవనం చేస్తున్న జంటకు పిల్లలు పుడితే...
లివ్ ఇన్ రిలేషన్‌లో ఉంటున్న సమయంలో ఆ జంటకు పుట్టిన పిల్లలు.. వారి చట్టబద్ధమైన పిల్లలుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. అలాంటి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆస్తులపై అన్ని హక్కులను పొందుతారు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నవాళ్లు విడిపోవాలనుకున్నా తిరిగి ప్రభుత్వ పోర్టల్‌లోనే నిబంధనలకు అనుగుణంగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉత్తరాఖండ్ దారిలో మరికొన్ని రాష్ట్రాలు...
ఉత్తరాఖండ్‌ను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్‌లో ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈతరహా బిల్లులను తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ బిల్లును తాము కూడా తీసుకొస్తామని రాజస్థాన్ ఇప్పటికే ప్రకటించింది.