
మాజీ ‘రా’ అధికారి వికాస్ యాదవ్ పై వారెంట్ జారీ
కోర్టుకు హాజరుకాకపోవడంతో ఉత్తర్వులు జారీ చేసిన పాటియాల కోర్టు
ఖలీస్తానీ ఉగ్రవాదీ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ హత్య చేయడానికి కుట్ర పన్నారని అమెరికా పేర్కొన్న మాజీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) అధికారి వికాస్ యాదవ్ పై ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు యాదవ్, ఇతరులపై అపహరణ, హత్యాయత్నం కేసుకు సంబంధించిన కేసులో విచారణకు రాకుండా తప్పించుకున్నందుకు యాదవ్ పేరు మీద కోర్టు వారెంట్ జారీ చేసింది.
‘‘నిందితుడు వికాస్ యాదవ్ పై ఎన్బీడబ్ల్యూ లు జారీ చేశాం. సెక్షన్ 491 భారతీయ నాగరిక్ సురక్ష సంహిత కింద అతని పూచీకత్తుదారునికి అక్టోబర్ 17న నోటీస్ ఇవ్వండి’’ అని పాటియాలా హౌజ్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జీ సౌరబ్ ప్రతాప్ సింగ్ లాలర్ ఒక ఉత్తర్వ్యూలో తెలిపారు. ఈ కేసులో యాదవ్ కుటుంబ సభ్యుడు పూచీకత్తుగా ఉన్నట్లు సమాచారం. ఈ కేసును ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దర్యాప్తు చేస్తోంది.
2023 లో అరెస్ట్.. 2024 లో బెయిల్..
రోహిణీ నివాసి ఒకరు యాదవ్ పై దోపిడీ, కిడ్నాప్ ఆరోపణలు చేసి గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించడంతో 2023 స్పెషల్ సెల్ వికాస్ ను అరెస్ట్ చేసింది.
సిక్కు తీవ్రవాదీ పన్నూన్ పై జరిగిన కిరాయి హత్య కుట్రలో వికాస్ యాదవ్ పాత్ర ఉందని అమెరికా న్యాయ శాఖ అతడిపై అభియోగాలు మోపిన మూడు వారాల తరువాత ఆ అరెస్ట్ జరిగింది.
అయితే రోహిణీ కేసులో యాదవ్, మరొక నిందితుడు తరువాత విడుదల అయ్యాడు. ఆయనకు మొదట మార్చి 2024 లో మధ్యంతర బెయిల్, ఏప్రిల్ లో సాధారణ బెయిల్ లభించింది.
ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టులో విచారణలకు వ్యక్తిగతంగా హాజరు కాకపోవడాన్ని తన ప్రాణాలకు బెదిరింపులు ఉన్నాయని యాదవ్ గతంలో పేర్కొన్నారు.
రోహిణీ కేసు అంటే ఏంటీ?
ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రాజ్ కుమార్ వాలియా ఫిర్యాదు మేరకు సోమవారం పాటియాలా హౌజ్ కోర్టు ముందు హజరుకాకపోవడంతో అతనిపై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జైలులో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ తరపున వికాస్ యాదవ్, సహ నిందితుడు అబ్ధుల్లా ఖాన్ తనను కిడ్నాప్ చేసి హింసించారని వాలియా తన ఫిర్యాదులో ఆరోపించారు.
Next Story