
మేం బిచ్చగాళ్లము కాము: ఎస్పీ తీరుపై కాంగ్రెస్
చర్చలు జరగుతున్న సమయంలో అభ్యర్థుల లిస్ట్ ప్రకటనపై ఆగ్రహం
సీట్ల పంపకం చర్చలు జరుగుతున్న సమయంలో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థుల జాబితాను ప్రకటించడంపై కాంగ్రెస్ బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్యను నివారించి ఉండాల్సిందని పేర్కొంది.
మంగళవారం ఇద్దరు మిత్రపక్షాల మధ్య జరిగిన రెండో విడత చర్చల తరువాత ఎస్పీ తన కూటమి భాగస్వామికి కేవలం 26 సీట్లను మాత్రమే ఆఫర్ చేయగా, ఆ కొన్ని గంటలకే రాబోయే ఎన్నికల కోసం ఐదుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఆ పరిణామం గురించి అడగ్గా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) యూపీ ఇన్ చార్జీ రాజేంద్ర పాల్ గౌతమ్ ఇలా అన్నారు. ‘‘వారు అలా చేయకుండా చర్చలు ముగిసే వరకూ వేచి ఉండాల్సింది. అయినప్పటికీ 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కొంతమంది అభ్యర్థులను ఉపసంహరించుకున్నారు కూడా. అంతా సవ్యంగా జరుగుతుందని ఆశిస్తున్నాను’’
కాంగ్రెస్ కు మొత్తం 26 సీట్లు ఆఫర్ చేశారన్న వాదనలను తోసిపుచ్చుతూ గౌతమ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేము అలాంటి ప్రకటనలతో ఏకీభవించము. ఆ తరువాత స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయి.
మేము మొత్తం 403 సీట్లపై చర్చలు జరుపుతున్నాము’’ అని అన్నారు. చర్చల సందర్భంగా ఇప్పటికే చాలా స్థానాలు ఖరారు అయ్యాయని, మిగిలిన నియోజకవర్గాలను తదుపరి సమావేశంలో పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు.
‘‘అందుకే నేను ఏమి చెప్పదలుచుకోలేదు. బాధ్యతాయుతమైన పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతున్నప్పుడు, మనం ఆ బాధ్యతను గుర్తించి, బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి’’ అని గౌతమ్ అన్నారు.
ఎంపీ మసూద్ ఏమన్నారు...
ఏకపక్ష ప్రకటనపై ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(యూపీసీసీ) అధ్యక్షుడు ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఎస్పీపై తీవ్రంగా విరుచుకుపడిన నేపథ్యంలో గౌతమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన సొంత లోక్ సభ స్థానమైన సహరన్ పూర్ తో సహ ఐదు నియోజకవర్గాలకు ఎస్పీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ‘‘మేము యాచించడం లేదు’’ అని మసూద్ అన్నారు.
ఎస్పీతో మున్ముందు చర్చలు జరపాలా వద్దా అనే విషయంపై పార్టీ నాయకత్వంతో సంప్రదిస్తానని ఆయన అన్నారు. ‘‘ఒక వైపు చర్చలు జరుపుతూ, మరో వైపు ప్రకటనలు చేస్తుంటే మీరు సీరియస్ గా లేరని అర్థమవుతుంది’’ అని మసూద్ అన్నారు. ‘‘ఏం చేయాలి.. చర్చలకు కూర్చోవాలా వద్దా అనే దానిపై మా పార్టీలో చర్చిస్తాం. ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలో పార్టీ నిర్ణయిస్తుంది’’
మిత్రపక్షం ఉద్దేశాలను ప్రశ్నిస్తూ ఆయన ఇలా అన్నారు. ‘‘మీరు నాతో కాంగ్రెస్ తో లేదా బీజేపీతో పోరాడాలనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మనం బీజేపీతో పోరాడాలా లేక మనలో మనం పోరాడుకోవాలా అనేది తేల్చుకోవాలి’’
పశ్చిమ యూపీలో..
ఎస్పీ ప్రకటించిన ఐదు స్థానాలలో నాలుగు ఎస్పీ సిట్టింగ్ స్థానాలు. సహరన్ పూర్ నుంచి అషు మాలిక్, కైరానా నుంచి నహిద్ హసన్, బెహత్ నుంచి ఉమర్ అలీ ఖాన్, అమ్రోహ నుంచి మెహబూబ్ అలీ పోటీ చేస్తారని పేర్కొన్నారు.
ఈ నాలుగు నియోజకవర్గాల పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో ఉన్నాయి. ఇక్క బీజేపీ దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్ఎల్డీ) అలాగే ఎంఐఎం అధినేత ఓవైసీ, ఆజాద్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని కొత్తగా ఏర్పాటైన సామాజిక పరివర్తన్ మోర్చా వంటి గట్టి పోటీని ఎస్పీ ఎదుర్కొంటోంది.
ఎస్పీ ఐదో అభ్యర్థి జ్యోతి లోధి బుందేల్ ఖండ్ లోని లలిత్ పూర్ నుంచి పోటీ చేయబోతున్నారు. అంతకుముందు ఆగష్టులో పార్టీ తేజ్ నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండేను అయోధ్య నుంచి తమ అభ్యర్థిగా ప్రకటించింది.
సమీకరణాలు ముఖ్యం..
రెండు పార్టీల మధ్య చర్చల ప్రక్రియ లో పీటముడి పడిన నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ స్పందించారు. సీట్ల సంఖ్య కంటే గెలుపు సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కోరారు.
వరుసగా రెండో రోజు కూడా ఇరుపక్షాలు మధ్య చర్చలు అసంపూర్తిగా ముగిసిన తరువాత ఎక్స్ లో ట్వీట్ చేశారు. అయినప్పటికీ ఇరుపక్షాల నాయకులు చర్చలు సానుకూలంగా అభివర్ణించారు. రాబోయే రెండు సమావేశాలలో ఒక ఒప్పందం ఖరారు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ పార్టీ ఇప్పటికే ప్రతిపాదించిన 26 స్థానాలకు మించి, పోటీ చేయబోయే ఆసక్తి ఉన్న నియోజక వర్గాల జాబితాను సమర్పించాలని ఎస్పీ అధినేత కాంగ్రెస్ ను కోరారు. ఆ జాబితా ఆధారంగా ప్రతి స్థానంలో గెలుపొందడానికి ఏ అభ్యర్థి ఉత్తమ అవకాశంలో ఉన్నారో ఇరు మిత్రపక్షాలు సంయుక్తంగా అంచనా వేయవచ్చని ఆయన సూచించారు.
‘‘సౌభ్రాతృత్వం వివేకం ద్వారా మనం దీనిని సాధిస్తాం. ఈ ఆశతో కేవలం సీట్ల సంఖ్యపై కాకుండా విజయ సూత్రాలపై దృష్టి పెడదాం. తద్వారా మనం గెలిచి యూపీలో ఆ తరువాత ఢిల్లీలో మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దేశ భవిష్యత్ తీర్చిదిద్దడంలో మన పాత్ర చిరకాలం స్వర్ణాక్షరాలతో లిఖించబడేలా చూద్దాం’’ అని యాదవ్ ట్వీట్ లో పేర్కొన్నారు.
సీట్ల సంఖ్యపై...
ఎస్పీ 26 సీట్లను ఆఫర్ చేయగా, కాంగ్రెస్ సుమారు 130 నియోజక వర్గాల కోరికల జాబితాను సమర్పించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇరుపక్షాల నాయకులు సీట్ల వారీగా చర్చలు జరిపారు.
కాంగ్రెస్ ప్రతినిధి బృందంలో గౌతమ్, ఆరాధన మిశ్రా, మోనా, మసూద్, వీరేంద్ర చౌదరి ఉన్నారు. ఎస్పీ తరఫున రామ్ గోపాల్ యాదవ్, శ్యామ్ లాల్, రాజీవ్ రాయ్, అవధేష్ ప్రసాద్ ఇక్రా హసన్ ఉన్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2017 నుంచి ఈ రాష్ట్రంలో బీజేపీ వరుసగా రెండుసార్లు గెలుపొందింది. ఈ పరంపరంకు ఎస్పీ ముగింపు పలకాలని తహతహలాడుతోంది.
2022 రాష్ట్ర ఎన్నికలలో స్వతంత్రంగా పోటీ చేసిన తరువాత ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు 2024 లోక్ సభ ఎన్నికలలో ప్రతిపక్ష ఇండి కూటమిలో భాగంగా కలిసి పోరాడి ఉత్తర ప్రదేశ్ లోని 80 పార్లమెంటరీ స్థానాలలో 43 స్థానాలను గెలుచుకున్నాయి.
Next Story
