ఎందుకీ కామన్ సివిల్ కోడ్, ఏమిటి ఉపయోగం?
x
GRAFIC IMAGE

ఎందుకీ కామన్ సివిల్ కోడ్, ఏమిటి ఉపయోగం?

కామన్ సివిల్ కోడ్ (ఉమ్మడి పౌర స్మృతి) మళ్లీ తెరపైకి వచ్చింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఈ బిల్లును పెట్టారు. ఇంతకీ ఇందులో ఏముందీ, ఏమిటీ ప్రయోజనం?


భారత్‌ లాంటి భిన్న సంస్కృతులు, మతాలు, కులాలు ఉన్న దేశానికి ఒకే పౌరస్మృతి ఉండాల్నా.. దీనివల్ల సమస్యలు రావా? అసలు దీని ఉద్దేశం ఏమిటీ? ఓకే దేశం.. ఒకే చట్టం అంటున్న బీజేపీకి దీన్ని తేవడం సాధ్యమవుతుందా?

కే దేశం.. ఒకే చట్టం.. దీన్నే ఉమ్మడి పౌరస్మృతి అంటారు. మతపరమైన ఆచారాలు, సంప్రదాయాలకు అతీతంగా.. భారత భూభాగం పరిధిలో ఉన్న పౌరులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయడమే యూనిఫాం సివిల్‌ కోడ్‌ . ఈ దేశంలో పెళ్లిళ్లు, విడాకులు, వారసత్వంగా వచ్చే ఆస్తులు, పిల్లలను దత్తత తీసుకోవడం, జీవనభృతి లాంటి విషయాలకు సంబంధించి.. చట్టాలు అందరికీ ఒకేలా లేవు. పౌరులు ఆచరించే మతం, విశ్వాసాల ఆధారంగా ఒక్కో వ్యక్తికి.. చట్టం ఒక్కోలా ఉంది. అయితే.. మతంతో సంబంధం లేకుండా, లింగ భేదాల్లేకుండా.. భారత పౌరులందరికీ ఒకే చట్టం వర్తింపజేయడం యూనిఫాం సివిల్ కోడ్ ప్రధాన ఉద్దేశం. ఈ డిమాండ్.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచే ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్- 44 కూడా ఇదే చెబుతోంది. దేశ పౌరులకు యూనిఫాం సివిల్ కోడ్ తీసుకొచ్చేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశిక సూత్రాల రూపంలో రాజ్యాంగం సూచిస్తోంది.

మతపరమైన పర్సనల్‌ చట్టాలు...

ఇప్పటివరకు.. దేశంలో ప్రజలకు చట్టాలున్నా.. వాటికి భిన్నంగా మతపరమైన పర్సనల్‌ చట్టాలు కూడా ఉన్నాయి. హిందూ వివాహ, వారసత్వ చట్టాలు, షరియా లాంటి ముస్లిం పర్సనల్ చట్టాలు ఇవన్నీ మన దేశంలో అమలవుతున్నాయి. అయితే.. ఉమ్మడి పౌరస్మృతిలో ఎవరికి వాళ్లుగా అమలు చేసుకునే చట్టాలకు చోటు ఉండదు. యూనిఫాం సివిల్‌ కోడ్‌లో కుల, మతపరమైన చట్టాలు చెల్లవు. అందుకే చాలాకాలంగా దేశంలో మెజారిటీగా ఉన్న హిందువులు, మైనారిటీ వర్గాలైన ముస్లింలు ఈ యూనిఫాం సివిల్‌కోడ్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌ ఎందుకు తొందరపడుతోంది...

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీలో యూసీసీ బిల్లు పెట్టడంతో ఇప్పుడు.. మళ్లీ ఉమ్మడి పౌరస్మృతి అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. ముస్లింల షరియా చట్టాలకు కౌంటర్‌గానే యూనిఫాం సివిల్ కోడ్ తెస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. షరియా చట్టాలు అనాగరికంగా ఉన్నాయనేదే వాళ్ల వాదన. ఇందుకు.. ఇస్లాం మతంలో భార్యలకు విడాకులిచ్చే ట్రిపుల్ తలాఖ్‌ను ఉదాహరణగా చూపుతున్నారు. 2019లో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని నేరంగా మారుస్తూ చట్టం కూడా తీసుకొచ్చింది..

25వ అధికరణం ఏమి చెబుతోంది...

భారత రాజ్యాంగంలోని 25వ అధికరణంలోని.. కొన్ని అంశాలతో ఉమ్మడి పౌర స్మృతి విభేదిస్తుందనే వాదనలు ఉన్నాయ్. పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించేందుకు, అనుసరించేందుకు, ఆ మతాన్ని వ్యాప్తి చేసేందుకు ఆర్టికల్‌ 25 వీలు కల్పిస్తుంది. కానీ.. యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల మత స్వేచ్ఛ విషయంలో ఎలాంటి మార్పులుండవు. అయితే.. భిన్న మతాలు, నమ్మకాలున్న భారత్ లాంటి అతిపెద్ద దేశాల్లో… సివిల్ కోడ్స్ ద్వారా అందరినీ ఏకం చేయడమనేది చాలా కష్టమైన విషయమంటున్నారు.

హిందూ, ముస్లిం మతాలను తీసుకుంటే.. అందులో కూడా భిన్నమైన నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. హిందువుల్లోనూ.. భిన్న ఆచారాలు, సంప్రదాయాలు పాటించే వాళ్లున్నారు. ముస్లింలలో షరియా చట్టాలను పాటించని వాళ్లున్నారు. బోరా ముస్లింలు.. ఆస్తుల వారసత్వం విషయంలో హిందువుల చట్టాలను అనుసరిస్తుంటారు. ఆస్తుల వారసత్వం విషయంలో మన దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన చట్టాలున్నాయ్. క్రైస్తవులు మెజారిటీగా ఉండే నాగాలాండ్, మిజోరం లాంటి రాష్ట్రాలు తమకంటూ ప్రత్యేకమైన సివిల్ చట్టాలను రూపొందించుకున్నాయ్. వాటికి ఆధారం.. వారి సంప్రదాయాలేకానీ మతం కాదు.

గోవాలో పర్సనల్ లా ఇప్పటికీ ఉందా

గోవాలో 1867 పోర్చుగీసువారి పాలనలోనే కామన్ సివిల్ కోడ్ అమల్లో ఉంది. కానీ.. క్యాథలిక్స్, ఇతర మతస్థులకు భిన్నమైన నియమాలున్నాయ్. భారత్‌లో పౌర స్మృతులు.. ఉమ్మడి జాబితాలో ఉన్నాయి. అందువల్ల 1970ల నుంచి రాష్ట్రాలు తమకంటూ సొంత సివిల్ కోడ్‌ని రూపొందించుకుంటూ వస్తున్నాయి. హిందువుల్లో.. కొడుకులతో సమానంగా కూతుళ్లకు వారసత్వ ఆస్తిలో వాటా పొందేలా 2005లో చట్టాలను సవరించారు. కానీ.. దీనికంటే ముందే ఐదు రాష్ట్రాలు.. మహిళలకు వారసత్వ ఆస్తిలో వాటా హక్కును కల్పిస్తూ చట్టాలు చేశాయి.

మ్మడి పౌరస్మృతితో కులం, మతం, వర్గం, స్త్రీ, పురుష లింగ భేదాలకు అతీతంగా.. దేశంలోని పౌరులందరికీ సమాన హోదా లభిస్తుంది. చట్టప్రకారం ఆడ, మగ ఇద్దరూ సమానమేననే లింగ సమానత్వం కల్పిస్తుంది. క్రిమినల్, సివిల్ చట్టాలన్నీ అందరికీ సమానంగా అమలు చేసేలా యూనిఫాం సివిల్‌కోడ్‌ ఉంటుంది. అంతేకాదు.. ఇప్పుడున్న పర్సనల్ చట్టాలను సంస్కరించాల్సిన పనిలేదు. బహు భార్యత్వం నేరమవుతుంది. అన్ని మతాల్లో.. చిన్న కుటుంబం తప్పనిసరి చేసే అవకాశం కలుగుతుంది. ఒకే దేశంగా ..అందరికీ ఒకే చట్టం అమలు చేయడం వల్ల జాతీయతభావం కలుగుతుంది. దేశ సమగ్రతని సాధించేందుకు వీలవుతుందని నిపుణులు చెబుతున్నమాట.

యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు వల్ల కొన్ని ప్రతికూలతలూ ఉన్నాయనేది మరికొందరి వాదన. ఉమ్మడి పౌరస్మృతి మతంపై, సంస్కృతిపై దాడి అని.. ముస్లింలు సహా మిగతా మైనారిటీ వర్గాలకు దీనివల్ల ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. అంతేకాకుండా మతం అనే వ్యక్తిగత అంశంలో ప్రభుత్వ జోక్యం ఏంటని వ్యతిరేకించేవారూ ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ద్వారా సంక్రమించే మత స్వేచ్ఛకు ఇది అడ్డంకిగా మారుతుందని భావిస్తున్నవాళ్లూ ఉన్నారు.

ప్పటివరకు ఉమ్మడి పౌర స్మృతి అంశంపై కోర్టులు కూడా స్పష్టమైన ఆదేశాలివ్వలేదు. గడిచిన 40 ఏళ్లలో.. భిన్న తీర్పుల్లో భాగంగా.. దేశ సమైక్యత కోసం యూనిఫాం సివిల్ కోడ్ తీసుకురావాలని.. సుప్రీంకోర్టు ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చింది. అయితే.. తీవ్రమైన పరిణామాలకు దారితీసే ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావడం కంటే.. లింగ అసమానతలను తొలగించేందుకు.. పౌర స్మృతులను సవరణ చేస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

Read More
Next Story