కాబోయే అల్లుడితో అత్త ఎందుకు పారిపోయిందీ?
x
అత్త సప్నా, అల్లుడు రాహుల్

కాబోయే అల్లుడితో అత్త ఎందుకు పారిపోయిందీ?

కాబోయే అల్లుడితో ఓ అత్త పారిపోయింది. భర్త వేధింపులు భరించలేకే అల్లుడితో వెళ్లిపోయినట్టు పోలీసులకు చెప్పింది. ఇప్పుడీ విచిత్ర ప్రేమ కథ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది


ఇది ప్రేమో.. వ్యామోహమో.. కట్టుకున్న వాడు వేధించిన ఫలితమో కాలమే తేల్చాలి. ఉత్తర ప్రదేశ్ అలీఘడ్ లో జరిగిన వాస్తవ కథ ఇది. ఓ సాదాసీదా ఇల్లాలు తనకు కాబోయే అల్లుడితో పరారైన వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కూతురి పెళ్లికి సరిగ్గా పది రోజుల ముందు తల్లి – తన కుమార్తెకు కాబోయే భర్తతో అంటే అల్లుడితో కలిసి ఇంటి నుంచి పారిపోయింది. ఇదో సినిమా అయితే ప్రేక్షకులు నమ్మరేమో కాని నిజంగా జరిగిన కథ కనుక నమ్మాల్సిందే.
ఇలా మొదలైంది...
ఏప్రిల్ 6: దడోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే ఓ ప్రాంతానికి చెందిన సప్నా అనే నడివయసు మహిళ, తన కూతురు శివానీకి నిశ్చితార్థమైన యువకుడు రాహుల్ కుమార్‌తో కలిసి అదృశ్యమైంది. ఈ వార్త పెద్ద సంచలనమే సృష్టించింది. ఊహించని మలుపు తిరిగింది. ఎవరికి తోచిన కామెంట్లు వాళ్లు చేస్తున్నారు. అయితే ఆమె మాత్రం విమర్శకుల నోళ్లు మూయించేలా తన పరిస్థితి తెలిస్తే "మీరిలా అంటారా" అని ప్రశ్నిస్తున్నారు.
"భర్త వేధించాడు.. కూతురు గౌరవించలేదు.. కానీ రాహుల్ అర్థం చేసుకున్నాడు" అని పోలీసులకు లొంగిన అనంతరం సప్నా చేసిన వ్యాఖ్యలు ఆ ప్రాంత వాసుల్ని కలచివేస్తున్నాయి. “ఒక్కరికి కూడా నేను భారం కాకూడదనే అనుకున్నా.. కానీ నా భర్త నన్ను తాగి వేధించేవాడు. నా కూతురు నన్ను తరచూ మానసికంగా గాయపరిచేది. తల్లిననే గౌరవం కూడా ఇచ్చేది కాదు. ఈ జీవితం కంటే మరణమే మేలనిపించింది. కానీ... రాహుల్ ఒకసారిగా నా జీవితంలోకి ప్రవేశించారు. నన్ను అర్థం చేసుకున్నాడు. అందుకే... నేనతనిని ఎంచుకున్నాను. అతనితోనే ఉంటాను” అంటున్నారు సప్నా. “ఏమైనా సరే... రాహుల్‌తోనే జీవితాన్ని గడుపుతా. ఆయన్ని పెళ్లి చేసుకుంటాను” అంటున్నారు ఆమె.
ఇక రాహల్ వాదన ఎలా ఉందంటే..
తాము లేచిపోయిన పరిస్థితులపై రాహుల్ మాటలు మరింత షాకింగ్‌గా ఉన్నాయి. “ఆమె ప్రాణం తీసుకుంటానని బెదిరించింది. బస్టాండ్‌కు రాకపోతే చనిపోతానంది. నేను నమ్మలేదు గాని అక్కడికి వెళ్లాల్సిందే అనిపించింది. అక్కడి నుంచి లక్నో, తర్వాత ముజఫర్పూర్ వెళ్లాం. చివరికి తిరిగి అలీఘడ్‌కే వచ్చాం ” అన్నారు.

"ఇది క్షణకాలపు ప్రేమ కాదన్న" రాహుల్ “ఇంతదాక వచ్చాం కనుక వివాహం చేసుకుంటాను.. తప్పదు.. ఆమె కోసం ఇంతవరకూ వచ్చాను. ఆమెకు జీవితాన్ని ఇస్తాను” అంటున్నాడు. డబ్బు కోసమో ఆమె నగల కోసమో ఈ పని చేయలేదు. ఆమె ఆవేదన నన్ను తాకింది అని చెబుతున్నాడు రాహుల్.
కుటుంబ సభ్యులు మాత్రం ఈ కథను ప్రేమగా చూడట్లేదు. వీళ్లిద్దరూ రూ. 3.5 లక్షల నగదు, రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు తీసుకెళ్లారని సప్నా కూతురు శివానీ ఆరోపించింది. కానీ సప్నా మాత్రం తన కుమార్తె మాటల్ని తోసిపుచ్చారు. “నాకు ఉన్నదల్లా ఒక మొబైల్ ఫోన్, రూ. 200 మాత్రమే. ప్రేమ విలువను డబ్బుతో కొలవగలమా?” అని ప్రశ్నించారు.
నా తల్లి తీసుకెళ్లింది అల్లుణ్ణే కాదు... నా గుండె కూడా!
తన తల్లి సప్నా నాకు వెన్నుపోటు పొడిచింది. ఓ తల్లిగా ఆమె చేయాల్సిన పని కాదది అని శివానీ బాధపడుతోంది. “నాకు జీవితాంతం తోడుగా ఉండాల్సిన వ్యక్తిని తల్లి తీసుకెళ్లింది. ఇది వేదన కాదు, నా జీవితాన్ని విచ్ఛిన్నం చేయడమే ” అని వాపోతోంది.
సప్నా కుటుంబం మాత్రం ఆమెను క్షమించబోమంటోంది. “ఆమెను తిరిగి ఇంట్లోకి రానివ్వం. ఆమె ఈ ఇంటి నుంచి తీసుకువెళ్లిన డబ్బు, నగలు మాత్రం ఆమె తిరిగి ఇవ్వాల్సిందే” అన్నారు ఆమె మరిది. ఆమె ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ భర్త వేధింపుల గురించి మాట్లాడలేదు. ఇప్పుడు ఆ మాట అనడం పచ్చి అబద్ధం అన్నారు ఆయన.
సప్నా పుట్టింటి వాళ్లు సైతం ఆమె మాటల్ని నమ్మడం లేదు. “వేధింపుల మాట విన్న దాఖలాలేదు,” అన్నాడు ఆమె సోదరుడు.
ప్రస్తుతం పోలీసు విచారణ కొనసాగుతోంది. కానీ సమాజం నుంచి మాత్రం ఆమెకు ఛీత్కారాలు ఎదురవుతున్నాయి. గుండెలు పగిలే మాటల్ని ఆమె చుట్టుపక్కల వారు అంటున్నారు. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు ఈ ఘటనపై నోరు మెదపలేదు. కానీ సప్నా – రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం పౌర నైతికత, వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ సంబంధాల అస్థిత్వాలపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.
సప్నా కథ పాఠ్యపుస్తకాల్లో ఉండేది కాదు. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థకే సవాల్ విసిరిన కథ. సమాజం గీసిన గీతల్ని చెరి పేసే కథ. దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న ఏమిటంటే- "ప్రేమా? పరవశమా? లేక పరువు పోగొట్టే పరిణామమా? ఎవరు నిర్ణయిస్తారు?"
Read More
Next Story