
అక్రమ వలసదారుల విమానం పంజాబ్ కే ఎందుకు వస్తుంది: భగవంత్ మాన్
పంజాబీలను కించపరచడానికే కేంద్ర ప్రభుత్వం ఇలా చేస్తొందని ఆగ్రహం
అమెరికా నుంచి అక్రమ వలసదారులతో వస్తున్న ప్రతి విమానం ఎందుకు పంజాబ్ లో ల్యాండ్ చేస్తున్నారని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ ప్రశ్నించారు. ఇది కేంద్ర ప్రభుత్వం పంజాబ్ ను అవమానించడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో అక్రమ వలసదారులతో కూడిన విమానం తిరిగి అమృత్ సర్ కు వచ్చే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు.
ఫిబ్రవరి 15న రాత్రి 10 గంటల ప్రాంతంలో పంజాబ్ లో ల్యాండ్ అయ్యే అవకాశం ఉందని శుక్రవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం భగవంత్ మాన్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
అమెరికా నుంచి 119 మంది అక్రమ భారతీయ వలసదారులతో కూడిన విమానం తిరిగి పంజాబ్ లోని అమృత్ సర్ లో ఎందుకు ల్యాండ్ చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఈ విమానంలో వచ్చే 119 మంది అక్రమ భారతీయ వలసదారులలో 67 మంది పంజాబ్ కు చెందినవారు, 33 మంది హర్యానాకు, ఎనిమిది మంది గుజరాత్, ముగ్గురు ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ చెందిన వారు ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారని వారు తెలిసింది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పంజాబ్ పట్ల వివక్ష చూపుతోంది. పంజాబ్ ను కించపరిచే ఏ అవకాశాన్ని కేంద్రం వదులుకోవట్లేదని మాన్ అమృత్ సర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆరోపించారు.
‘‘ ఒక ప్రణాళిక ప్రకారమే పంజాబ్, పంజాబీలను కించపరచడానికే ప్రయత్నిస్తున్నారు’’ అని ఆయన అన్నారు. అమెరికా నుంచి అక్రమ భారతీయ వలసదారులను తీసుకెళ్తున్న మరో విమానం శనివారం అమృత్ సర్ విమానాశ్రాయంలో ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది.
పంజాబ్ కు వచ్చిన మొదటి విమానంలో హర్యానా, గుజరాత్ కు చెందిన 33 మంది, పంజాబ్ కు చెందిన వారు 30 మంది ఉన్నారని మాన్ ఇంతకుముందు వెల్లడించారు.
‘‘ఇప్పుడు రెండో విమానం వస్తోంది. రేపు అది పంజాబ్ లో ల్యాండ్ అవుతుంది. అయితే అమృత్ సర్ ను మాత్రమే ఎందుకు ఎంచుకుంటున్నారు. కేంద్రం, విదేశాంగమంత్రిత్వ శాఖ నాకు చెప్పాలి. మీరు అమృత్ సర్ ను ఎందుకు ఎంచుకున్నారు? మీరు పంజాబ్, పంజాబీలను కించపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు’’ అని మాన్ అన్నారు.
బహిష్కరణ అనేది ఒక జాతీయ సమస్య అని ఆయన అన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై విమర్శలు గుప్పిస్తూ అక్రమ భారతీయ వలసదారుల మరో విమానం ఇండియా వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ‘‘మరో బహుమతి’’ తీసుకువస్తున్నారా? అని మాన్ ప్రశ్నించారు.
Next Story