ఈసారి కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా?
x

ఈసారి కాంగ్రెస్ ఖాతా తెరుస్తుందా?

ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేదు.


ఈ ఏడాది రాజస్థాన్‌లో అధికారాన్ని కోల్పోయిన కాంగ్రెస్ అంతకుముందు 2014, 2019 సార్వత్రిక ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ మరోసారి హ్యట్రిక్ కొట్టబోతుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

2014లో రాష్ట్రంలోని మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో బీజేపీ విజయదుందుబీ మోగించింది. 2019లో జైపూర్‌ పీఠంపై కాంగ్రెస్ కూర్చుంది. తర్వాత, జరిగిన ఎన్నికల్లో బిజెపి 24 సీట్లు గెలుచుకుంది, ఒక్క సీటు రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ గెలుచుకుంది. ఇది బీజేపీ మిత్రపక్షం.
రాజస్థాన్ లోక్‌సభ ఎన్నికల తొలి రెండు దశల్లో ఏప్రిల్ 19, 26 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా నెలరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.
బీజేపీ హ్యాట్రిక్‌పై గురి
బీజేపీ చాలా రోజులుగా పఠిస్తున్న డబుల్ ఇంజిన్ సర్కార్ ఓటర్లను మరోసారి ఆకర్షిస్తుందని అలాగే అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట వంటివి కమలం పార్టీకి ఓట్ల వర్షం కురిపిస్తోందని అంచనాలు వేసుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు. దీనితో ఆ సారి హ్యాట్రిక్ ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అయితే బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత జరిగిన కరణ్ పూర్ కు జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ ఓడిపోయింది. అక్కడ నిలబడిన అభ్యర్థిని మంత్రిగా నియమించినప్పటికీ కూడా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. ఇటీవల, చురు ఎంపీ రాహుల్ కశ్వాన్ తనకు బీజేపీ మళ్లీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో పార్టీ మారారు. అలాగే మీనా కమ్యూనిటీ ప్రభుత్వం పై అసంతృప్తితో ఉన్నారు. సీఎం రేసులో ఉన్నట్లు కనిపించిన కిరోడి లాల్ మీనాకు చివరి నిమిషంలో పదవి దక్కకపోవడంపై మీనా వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అలాగే గుజ్జర్లు కూడా బీజేపీ ప్రభుత్వంలో తమ పార్టీకి మెరుగైన స్థానాలు కావాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా భరత్‌పూర్, ధోల్‌పూర్ జిల్లాలకు చెందిన జాట్‌లు తమకు ఓబీసీ రిజర్వేషన్ కావాలని ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ కష్టాలకు అంతేలేదు
మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, అతని ఒకప్పటి డిప్యూటీ సచిన్ పైలట్ మధ్య నడుస్తున్న వైరంతో రాజస్థాన్‌లో కాంగ్రెస్ బలం నానాటికి తగ్గిపోతోంది. కాంగ్రెస్ నుంచి వలసలు జరగడం కూడా పార్టీ బలహీనపడటానికి మరో కారణంగా చెప్పవచ్చు.
మాజీ మంత్రి, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మహేంద్రజీత్ సింగ్ మాల్వియా గత నెలలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడిన జ్యోతి మిర్ధాకు నాగౌర్ నుంచి బీజేపీ టికెట్ లభించింది.
మారిన నాయకులు వీరే కాదు. మాజీ మంత్రులు రాజేంద్ర యాదవ్, లాల్ చంద్ కటారియా, పార్టీ మాజీ ఎంపీ కరణ్ సింగ్ యాదవ్ సహా పలువురు రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరారు.
కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యేలు రిచ్‌పాల్‌ మిర్ధా, ఆయన కుమారుడు విజయపాల్‌ మిర్ధా, స్వతంత్ర మాజీ ఎమ్మెల్యే అలోక్‌ బెనివాల్‌, రాష్ట్ర సేవాదళ్‌ మాజీ చీఫ్‌ సురేష్‌ చౌదరి కూడా కాంగ్రెస్‌ను వీడి అధికార పార్టీలో చేరారు.
అయితే ఈ సారి ఎన్నికల్లోమెరుగైన ఫలితాలు సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ మేధావులు అంచనా వేస్తున్నారు. మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ కు ఉన్న అనుభవం, గుజ్టర్ల లో సచిన్ పైలెట్ కు ఉన్న పట్టు బీజేపీకి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యేలా చేస్తుందని అంచనాలు ఉన్నాయి.
అయితే, ఈ ఇద్దరు అగ్రనేతల మధ్య ఆధిపత్య పోరు గత ఐదేళ్లుగా పార్టీ బలాన్ని దెబ్బతీసింది. దాని ప్రధాన ప్రత్యర్థి బిజెపితో పోలిస్తే సంస్థాగత నిర్మాణం బూత్ నిర్వహణ పరంగా కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. అలాగే కాంగ్రెస్ హయాంలో జరిగిన అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు వాటిపై బీజేపీ పోరాటాలు వంటివి ఇప్పుడు పార్టీకి కొంచెం ఇబ్బందికరంగా మారాయి. అయితే రాష్ట్రంలోని కొత్త బిజెపి ప్రభుత్వంలో తమకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని భావిస్తున్న గుజ్జర్ కమ్యూనిటీలో ఏర్పడిన అసంతృప్తిని సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది.
మొదటి జాబితా ప్రకటన
15 సీట్లకు బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. ఇందులో ఏడుగురు కొత్తవారికి టికెట్లు ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీలు గెలిచిన తర్వాత ఈ ఏడు స్థానాల్లో రెండు ఖాళీ అయ్యాయి. మొత్తంగా, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ఐదుగురు ఎంపీలు బరిలోకి దిగారు. దీనికి విరుద్ధంగా, కాంగ్రెస్ తన సిట్టింగ్ ఎమ్మెల్యేలను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని కోరుతున్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే దీనికి కొంతమంది ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో గెహ్లాట్‌, పైలట్‌లను కాంగ్రెస్‌ బరిలోకి దింపవచ్చని, పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు ఇది దోహదపడుతుందని మొదట ఏఐసీసీ వర్గాలు భావించాయి. కానీ తరువాత మళ్లీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.
గెహ్లాట్ కుమారుడు వైభవ్‌ను జలోర్ నియోజకవర్గం నుంచి పార్టీ పోటీకి దింపింది. బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రాహుల్ కశ్వాన్‌కు కూడా ఆ పార్టీ చురు నుంచి పోటీకి నిలిపింది. రాజస్థాన్ నుంచి 10 మంది కాంగ్రెస్ అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాలో అల్వార్ లోక్‌సభ స్థానం నుంచి లలిత్ యాదవ్, టోంక్ లోక్‌సభ స్థానం నుంచి హరీష్ మీనా, జుంజును లోక్‌సభ స్థానం నుంచి బ్రిజేంద్ర ఓలా రంగంలోకి దింపింది. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యేలు కావడం విశేషం.
అలాగే పార్టీ అగ్రనేతలకు ప్రాంతాల వారీగా ఇంచార్జీగా నియమించున్నట్లు తెలుస్తోంది.ఈ ప్రణాళిక ప్రకారం జోధ్‌పూర్, నాగౌర్, బికనీర్ పాలి జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు గెహ్లాట్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తారు. 2020లో గెహ్లాట్ మంత్రివర్గం నుంచి వైదొలిగిన పైలట్ దౌసా, టోంక్, ధౌల్‌పూర్ జిల్లాలను పర్యవేక్షిస్తారు.
రాష్ట్ర యూనిట్ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రాకు సికార్, జైపూర్ జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషికి ఉదయ్‌పూర్, రాజ్‌సమంద్, భిల్వారా జిల్లాల బాధ్యతలు అప్పగించారు.
" అభ్యర్థుల కోసం ప్రచారం చేయడం, మెరుగైన వ్యూహాలు రచించడం, మద్దతుదారులు, ఓటర్లను సమీకరించడం వంటివి మా బాధత్యలని" అని ఒక నాయకుడు ఫెడరల్ తో చెప్పారు.


Read More
Next Story