
తేజస్వీ యాదవ్
పంచాయతీ అధిపతుల జీతం రెట్టింపు చేస్తా: తేజస్వీ యాదవ్
ఆయనపై 27 కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నా జేడీ(యూ)
బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహాఘట్ బంధన్ అధికారంలోకి వస్తే పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రతినిధుల జీతభత్యాలను రెట్టింపు చేస్తానని ఆర్జేడీ నాయకుడు, విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్ హమీ ఇచ్చారు.
అలాగే వారికి రూ.50 లక్షల బీమా సౌకర్యం, పెన్షన్ కూడా అందజేస్తానని ప్రకటించారు. పంచాయతీరాజ్ మూడు వ్యవస్థ మూడు స్థాయిలలో ఉంటుంది. జిల్లా పరిషత్, పంచాయతీ సమితి(మండల వ్యవస్థ) గ్రామ పంచాయతీ గా వ్యవహరిస్తారు. గ్రామాల నాయకులను చైర్ పర్సన్ లేదా ముఖ్య( సర్పంచ్ కు సమానం), పంచాయతీ సమితి(మండల వ్యవస్థ) ప్రముఖ్, జిల్లా పరిషత్ కు అధ్యక్షులు ఉంటారు.
జూన్ లో పెంచిన నితీశ్ కుమార్..
బీహార్ లో ప్రస్తుతం అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ ప్రభుత్వం జూన్ లోనే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ రాజ్ వ్యవస్థ కు జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలను భారీగా పెంచింది.
జిల్లా పరిషత్ అధ్యక్షుల జీతాన్ని నెలకు 20 వేల నుంచి 30 వేలకు, పంచాయతీ సమితి ప్రముఖులకు రూ. 10 వేల నుంచి 20 వేలకు, పంచాయతీ ముఖ్య కు రూ. 5 వేల నుంచి 7,500 కు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,053 పంచాయతీలు, 533 పంచాయతీ సమితులు, 38 జిల్లా పరిషత్ లు పనిచేస్తున్నాయి.
గ్రామీణ ప్రజల ముంగిట న్యాయం అందించడం కోసం ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ కచహరిని కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
వడ్డీ లేని రుణాలు..
‘‘ఇండి కూటమి అధికారంలోకి వస్తే, బీహార్ పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రతినిధుల నెలవారీ భత్యాలు రెట్టింపు అవుతాయి. రాష్ట్రంలోని పీడీఎస్ పంపిణీదారుల క్వింటాలుకు మార్జిన్ మనీని కూడా మేము గణనీయంగా పెంచుతాము’’ అని తేజస్వీ విలేకరులతో అన్నారు.
రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థ పంపిణీదారులకు ప్రస్తుతం క్వింటాల్ కు రూ. 258.40 కమిషన్ చెల్లిస్తున్నారు. ‘‘అంతేకాకుండా రాష్ట్రంలోని క్షురకులకు, కుమ్మరులకు, వడ్రంగులకు రూ. 5 లక్షల వరకూ వడ్డీలేనీ రుణాలను అందిస్తాము’’ అని ఆయన అన్నారు.
వాగ్థానాల పరంపర..
ఇండి బ్లాక్ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ భాగాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ పర్మినెంట్ చేస్తామని తేజస్వీ ప్రకటించారు.
రాష్ట్రంలో పనిచేస్తున్న ‘జీవిక దీదీలు’’ అనే సుమారు రెండు లక్షల మంది, కమ్యూనిటీ మొబిలైజర్లకు, ప్రభుత్వ ఉద్యోగి హోదా ఇస్తానని వారికి నెలకు రూ. 30 వేలు ఇస్తామని తేజస్వీ ప్రకటించారు. అంతేకాకుండా ప్రతి బీహార్ కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఆయన హమీ ఇచ్చారు.
జేడీ(యూ) విమర్శలు..
ఆర్జేడీ నాయకుడి తాజా ప్రకటనలపై జేడీయూ స్పందించింది. ఆ పార్టీ ప్రతినిధి నీరజ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘ఆయన హమీలన్నీ వ్యర్థమని ప్రజలకు తెలుసు. ఆయన పై 27 అవినీతి, ఇతర నేరాల కేసులు ఉన్నాయి.
బీహార్, ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ లో ఆయనపై కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పంచాయతీ రాజ్ వ్యవస్థ ప్రతినిధులు, పీడీఎస్ పంపిణీదారుల కోసం ఏమి చేశారో ఓటర్లకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.
తేజస్వీ యాదవ్ తన పదేళ్ల ఎమ్మెల్యే రాజకీయ జీవితంలో రూ. 13.41 కోట్ల ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు చెబితే బాగుంటుందని నీరజ్ కుమార్ అన్నారు.
243 మంది సభ్యులున్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, నవంబర్ 11 తేదీలలో రెండు దశలలో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 14 న ఫలితాలు ప్రకటన ఉంటుంది.
Next Story

